పసుపును ఇలా వాడారంటే మొక్కలు పచ్చగా, చీడ పీడలు లేకుండా పెరుగుతాయి
మొక్కలు పచ్చగా ఉంటే చూసేందుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. మొక్కలు వాడిపోవడం లేదా పురుగుల బెడద పెరగినప్పుడు పెద్దగా గాభరా పడకండి. వంటింట్లో ఉన్న పసుపును వాడడం ద్వారా మొక్కను కాపాడుకోవచ్చు.
మొక్కల కోసం పసుపు
ప్రతి ఇంట్లోనూ ఇప్పుడు చిన్న చిన్న కుండీల్లో మొక్కలు ఉంటున్నాయి. వాటిని కాపాడుకునేందుకు చిన్న చిన్న చిట్కాలను కూడా పాటిస్తూ ఉంటారు. నిజానికి మొక్కలను కాపాడడంలో మన వంటగదిలో ఉండే పసుపు ముందుంటుంది. ఇది మొక్కల ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ అద్భుతంగా పనిచేస్తుంది. మొక్కలకు సోకే ఫంగస్, చిన్న చిన్న పురుగుల సమస్యను పసుపు సులభంగా నివారిస్తుంది. దీన్ని మొక్కలకు ఎలా వాడాలో తెలుసుకోండి.
మొక్కల మట్టిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఫంగస్ (శిలీంధ్రం) పెరిగే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో మట్టిలో కొద్దిగా పసుపు కలిపితే ఫంగస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. పసుపులో ఉండే యాంటీ-ఫంగల్ గుణాలు మొక్కల వేళ్లను కుళ్లిపోకుండా కాపాడతాయి.
పురుగుల బెడద ఉండదు
మొక్కల మట్టిపై చిన్న పురుగులు లేదా చీమలు పట్టేస్తూ ఉంటాయి. మట్టి పైపొరపై కొద్దిగా పసుపు పొడిని చల్లితే ఆ సమస్య రాదు. పసుపు వాసనకు, దాని గుణానికి పురుగులు మొక్కల దగ్గరకు రావు, ఆ మట్టిపై చేరవు.
మొక్క కొమ్మ విరిగినా లేదా మీరు ప్రూనింగ్ (కొమ్మలను కత్తిరించడం) చేసినా, ఆ కత్తిరించిన భాగానికి పసుపు పొడిని పెట్టడం లేదా నీళ్లు కలిపి పేస్టులా రాయడం వంటివి చేయండి. ఇది మనుషుల గాయానికి పసుపు ఎంత అద్భుతంగా పనిచేస్తుందో అలాగే పనిచేస్తుంది. ఆ భాగానికి ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకకుండా రక్షిస్తుంది.
పసుపును ఎలా వాడాలి?
పసుపును వాడేటప్పుడు దాని పరిమాణం గుర్తుంచుకోవాలి. ఒక చిన్న కుండీకి సుమారు అర నుంచి ఒక చిటికెడు పసుపు పొడి సరిపోతుంది. దీన్ని మట్టి పైపొరలో తేలికగా కలపాలి. పసుపును ఎక్కువగా వాడితే మట్టి నాణ్యతపై ప్రభావం పడొచ్చు. కాబట్టి, మితంగా వాడాలి. పసుపు అనేది మొక్కలకు ఒక అదనపు సహాయం మాత్రమే. మొక్కలు బాగా పెరగాలంటే సరైన ఎండ, నీరు, మంచి మట్టి, అవసరమైన ఎరువులు అందించడం చాలా ముఖ్యం. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి.

