- Home
- Life
- Parenting: పిల్లలకు పాకెట్ మనీ ఇస్తున్నారా? ఈ మూడు డబ్బాల సీక్రెట్ నేర్పితే.. మీ పిల్లలకు మనీ విలువ తెలిసినట్లే..!
Parenting: పిల్లలకు పాకెట్ మనీ ఇస్తున్నారా? ఈ మూడు డబ్బాల సీక్రెట్ నేర్పితే.. మీ పిల్లలకు మనీ విలువ తెలిసినట్లే..!
Parenting: అందరి పేరెంట్స్ లాగానే మీరు కూడా మీ పిల్లలకు పాకెట్ మనీ ఇస్తున్నారా? ఆ డబ్బుని మీ పిల్లలు ఏం చేస్తున్నారు? పాకెట్ మనీతో పిల్లలకు మనీ వాల్యూ ఎలా నేర్పించాలో తెలుసా?

Parenting
ఈ రోజుల్లో పేరెంటింగ్ పూర్తిగా మారిపోయింది. మా చిన్నప్పుడు మేం చాలా ఇబ్బంది పడ్డాం.. మా పేరెంట్స్ మాకు అడిగినవి ఏవీ కొనివ్వలేదు అని అనుకొని.. తమ పిల్లలకు అడగకుండానే అన్నీ కొనిస్తున్నారు. పిల్లలు అడిగింది కొనివ్వడం, వారికి అడిగినంత పాకెట్ మనీ ఇవ్వడమే ప్రేమ అని అనుకుంటున్నారు. కానీ, ఆ ప్రేమ వారి భవిష్యత్తును ప్రమాదంలో నెట్టకూడదు. ముఖ్యంగా డబ్బుల విషయంలో ఆ పొరపాటు అస్సలు చేయకూడదు. ‘ డబ్బులు చెట్లకు కాయవు.. కష్టపడితేనే వస్తాయి’ అని పిల్లలకు చిన్నతనంలోనే నేర్పించాలి. అది.. మీరు ఇచ్చే పాకెట్ మనీతోనే నేర్పించాలి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
డబ్బులు ఊరికే రావు .. పనికి తగ్గ పారితోషికం
పిల్లలు అడిగిన వెంటనే వారి చేతికి పాకెట్ మనీ ఇచ్చే అలవాటును వెంటనే పక్కన పెట్టండి. డబ్బుకు విలువ తెలియాలంటే దాని వెనుక ఉన్న కష్టం తెలియాలి. ఇంట్లో వారి వయస్సుకు తగ్గ చిన్న చిన్న పనులు చెప్పాలి. ఉదాహరణకు: మొక్కలకు నీళ్లు పోయడం, పుస్తకాల షెల్ఫ్ సర్దడం, లేదా వాహనాలు శుభ్రం చేయడం లాంటి పనులు అప్పగించండి.
ఆ పనిని వారు పూర్తి చేసినప్పుడు మాత్రమే వారికి కొంత డబ్బును బహుమతిగా లేదా పాకెట్ మనీగా ఇవ్వండి. దీనివల్ల "కష్టపడితేనే డబ్బు వస్తుంది" అనే ప్రాథమిక సూత్రం వారి మనస్సులో బలంగా నాటుకుపోతుంది.
మూడు డబ్బాల ఫార్ములా..
మీరు ఇచ్చిన పాకెట్ మనీని పిల్లలు ఎలా ఖర్చు చేయాలో నేర్పించడానికి 3 డబ్బాల కాన్సెప్ట్ అద్భుతంగా పనిచేస్తుంది. మీ పిల్లలకు 3 పారదర్శకమైన డబ్బాలు ఇచ్చి, వాటిపై మూడు పేర్లు రాయాలి.
డబ్బా 1: ఖర్చుల కోసం (Spending Jar): పిల్లలకు వచ్చిన డబ్బులో కొంత భాగం (ఉదాహరణకు 50%) ఈ డబ్బాలో వేయమనండి. వారు రోజువారీగా కొనుక్కోవాలనుకునే స్నాక్స్, పెన్సిళ్లు లేదా చిన్న చిన్న ఆశల కోసం ఈ డబ్బును వాడుకోవచ్చు.
డబ్బా 2: పొదుపు కోసం (Savings Jar): వచ్చిన డబ్బులో మరో భాగం (ఉదాహరణకు 30%) ఈ డబ్బాలో వేయాలి. ఏదైనా పెద్ద బొమ్మ, కాస్ట్లీ సైకిల్ లేదా వీడియో గేమ్ కొనుక్కోవాలనే కోరిక ఉంటే.. ఈ డబ్బాలోని డబ్బు సరిపోయే వరకు వేచి చూసి కొనుక్కోవాలని నేర్పండి. ఇది వారిలో సహనం పెంచుతుంది.
డబ్బా 3: ఎమర్జెన్సీ ఫండ్ (Emergency Jar): మిగిలిన డబ్బును (ఉదాహరణకు 20%) ఈ మూడో డబ్బాలో ఉంచాలి. స్కూల్లో జరిగే ఛారిటీ ఈవెంట్స్, అవసరంలో ఉన్న స్నేహితుడికి సాయం చేయడం లేదా ఏదైనా అనుకోని అత్యవసర ఖర్చుల కోసం ఈ డబ్బును వాడేలా ప్రోత్సహించండి. ఇది వారిలో సామాజిక బాధ్యతను, దాతృత్వాన్ని పెంపొందిస్తుంది.
పిల్లలకు ఆస్తులు, డబ్బులు సంపాదించి ఇవ్వడం కంటే.. డబ్బును ఎలా సంపాదించాలి, ఎలా కాపాడుకోవాలి అనే భావన అందించడమే మనం వారికి ఇచ్చే అతిపెద్ద బహుమతి. ఈ రోజే మీ ఇంట్లో ఈ మూడు జార్ల ఫార్ములాను ఫాలో అయితే.. పిల్లలకు సేవింగ్ అలవాటు అవుతుంది.

