Gold Price Hike: పండుగ రోజే బంగారం షాక్.. ఒక్కరోజులో రూ.1,210 పెరుగుదల
Gold Price Hike: బంగారం ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చిత పరిస్థితులతో పసిడికి డిమాండ్ పెరిగింది. ఇవాళ ధరలు పెరగడంతో కొనుగోలుదారులకు షాక్ తగిలింది. వరలక్ష్మీ వ్రతం పండుగ రోజు పసిడి కొనాలనుకునేవారికి ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి.

పసిడి ప్రియులకు బిగ్ షాకిచ్చిన బంగారం
బంగారంతో పాటు వెండి ధరలు కూడా వరుసగా రెండో రోజు పెరిగాయి. విలువైన లోహాల మార్కెట్‌లో పెట్టుబడిదారుల ఆసక్తి పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పుడు పెట్టుబడిదారులు సాధారణంగా సురక్షితమైన పెట్టుబడి సాధనాల వైపు మొగ్గుచూపుతారు. ఈ నేపథ్యంలో బంగారం, వెండికి డిమాండ్ పెరుగుతోంది.
రూ.160,480కు చేరిన బంగారం
24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర గ్రాముకు రూ.1210 పెరిగి రూ.160,480కు చేరింది. ఇక 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,100 పెరిగి రూ.1,47,100గా ఉంది. మరోవైపు 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,20,360గా నమోదైంది. అంటే ప్రస్తుతం బంగారం కొనుగోలు చేయాలంటే గతంతో పోలిస్తే భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. వెండిపై రూ.5వేలు పెరిగి రూ.2.65 లక్షలకు చేరుకుంది.
పసిడి ధరలపై ప్రత్యక్ష ప్రభావం
ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్‌కు సంబంధించిన పరిణామాలు, హోర్ముజ్ జలసంధి చుట్టూ నెలకొన్న పరిస్థితులు, ఇంధన మౌలిక వసతులపై దాడులు వంటి అంశాలు అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో ఆందోళన పెంచుతున్నాయి. ఫలితంగా రిస్క్ ఉన్న ఆస్తుల నుంచి పెట్టుబడులు కొంతమేర సురక్షిత ఆస్తుల వైపు మళ్లుతున్నాయి.
అదే సమయంలో అమెరికా ద్రవ్యోల్బణ పరిస్థితులు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు కూడా బంగారం ధరలకు కీలకంగా మారనున్నాయి. వడ్డీ రేట్లలో మార్పులు, డాలర్ విలువలో హెచ్చుతగ్గులు అంతర్జాతీయ పసిడి ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకోవడం కూడా పసిడికి సపోర్టుగా నిలుస్తోంది.
బంగారానికి డిమాండ్
దేశీయంగా పండుగలు, వివాహాలు, శుభకార్యాల సీజన్ ప్రారంభం కావడంతో బంగారానికి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే వినియోగదారులు కొనుగోళ్లను వాయిదా వేసే అవకాశం కూడా ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అధిక ధరలు భౌతిక బంగారం డిమాండ్‌పై ప్రభావం చూపవచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా పేర్కొంటోంది.

