- Home
- Automobile
- Maruti EV Car : సింగిల్ ఛార్జ్‌తో 315 కి.మీ నాన్ స్టాప్ ప్రయాణమా..! ధర కేవలం రూ.10 లక్షలేనా!!
Maruti EV Car : సింగిల్ ఛార్జ్‌తో 315 కి.మీ నాన్ స్టాప్ ప్రయాణమా..! ధర కేవలం రూ.10 లక్షలేనా!!
భారత ఆటోమొబైల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ మారుతి సుజుకి రూ.10 లక్షల లోపు ధరలో కొత్త ఎలక్ట్రిక్ కారును తీసుకురాబోతోంది. ఈ ఈవి కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 315 కిలోమీటర్ల వరకు వెళ్తుందని అంచనా.

మారుతి సుజుకి కొత్త ఈవి కారు వచ్చేస్తోంది..
ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఇప్పుడు ఇండియా ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌పై సీరియస్‌గా దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే కేవలం రూ.10 లక్షలలోపు ధరలో ఓ కొత్త ఎలక్ట్రిక్ కారును పరిచయం చేయడానికి ఈ కంపెనీ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫార్చ్యూన్ ఇండియా రిపోర్ట్ ప్రకారం… మారుతి తీసుకురాబోయే ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.8.50 లక్షల నుంచి రూ.10.50 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా.
ఖరీదైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల లాగా పెద్ద బ్యాటరీ, ఎక్కువ రేంజ్ కాకుండా నగరాల్లో రోజూ ప్రయాణించే వారికి ఈ కారు సరిగ్గా సరిపోతుందని అంచనా. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 250 నుంచి 315 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వడమే దీని లక్ష్యం. ఈ రేంజ్, టాటా మోటార్స్ వారి టియాగో ఈవీకి సమానం.
కొత్త మారుతి ఈవి ధర ఎందుకింత తక్కువ?
ఇప్పటికే ఉన్న పెట్రోల్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చడం కాకుండా పూర్తిగా కొత్త ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌పైనే డిజైన్ రెడీ అవుతోందట. దీనివల్ల బ్యాటరీని సరైన స్థలంలో అమర్చడానికి, క్యాబిన్‌లో ఎక్కువ స్పేస్ ఇవ్వడానికి, ఎలక్ట్రిక్ భాగాలను పర్ఫెక్ట్ గా అమర్చడానికి వీలవుతుందని మారుతి సంస్థ భావిస్తున్నట్లు సమాచారం.
దేశీయంగా ఎక్కువ భాగాలను తయారు చేయడం, చిన్న బ్యాటరీ ప్యాక్ ఉపయోగించడం వల్ల కారు ధరను అదుపులో ఉంచవచ్చని మారుతి సుజుకి భావిస్తోంది. సుమారు రూ.8.50 లక్షల నుంచి రూ.10.50 లక్షల మధ్య కొత్త ఈవి ఎక్స్-షోరూమ్ ధరను నిర్దేశించనున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే భారత్‌లో చాలా మంది ఎలక్ట్రిక్ కారు కొనే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వ్యాగనార్, స్విఫ్ట్ వంటి కార్లను కొనాలనుకునే కస్టమర్లను కూడా ఈ కొత్త ఈవీ ఆకర్షిస్తుందని అంచనా.
మారుతి ఈవి అమ్మకాలు పెరుగుతాయా?
మారుతి ప్రీమియం షోరూమ్ నెక్సా ద్వారా ఇ-విటారా అమ్ముడవుతోంది. కానీ ఈ కొత్త బడ్జెట్ ఎలక్ట్రిక్ కారును అరీనా డీలర్‌షిప్‌ల ద్వారా అమ్మే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న అరీనా నెట్‌వర్క్, మారుతి ప్రస్తుత కస్టమర్లకు ఈ కొత్త ఈవీని వేగంగా చేరవేయడానికి సహాయపడుతుంది.
మారుతి సుజుకి ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి ఆలస్యంగా ప్రవేశించినా, ఇ-విటారాతో మంచి ఆదరణ పొందింది. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, విన్‌ఫాస్ట్ వంటి మోడళ్లతో పోటీపడే ఇ-విటారా విజయం తర్వాత, ఎక్కువ మంది కస్టమర్లను చేరుకోవడానికి కంపెనీ ఈ చౌక ఈవీపై దృష్టి పెట్టింది. ఇ-విటారా అధిక ధర చాలా మందికి అడ్డంకిగా ఉంది. ఈ నేపథ్యంలో తక్కువ ధర మోడల్ మారుతి ఈవీ అమ్మకాలను మరింత పెంచుతుంది.
ఇ-స్కై కారునే ఇండియాకు తెస్తున్నారా?
సుజుకి ఇటీవల జపాన్‌లో ఇ-స్కై (e-Sky) అనే బడ్జెట్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారును పరిచయం చేసింది. అయితే భారత్‌లో రాబోయే మారుతి ఈవీకి, ఈ ఇ-స్కైకి సంబంధం ఉందా లేదా అనే విషయాన్ని కంపెనీ ఇంకా ధృవీకరించలేదు.
ఇ-స్కై కారు పొడవు 3,395 మి.మీ., వీల్‌బేస్ 2,460 మి.మీ. సుమారు 1,030 కిలోల బరువున్న ఈ కారులో 'టాల్ బాయ్' డిజైన్‌ను ఉపయోగించారు. దీనివల్ల చిన్న కారులోనే ఎక్కువ క్యాబిన్ స్పేస్ లభిస్తుంది. ఇ-స్కై కారులో 26 kWh బ్యాటరీ ప్యాక్ అమర్చారు. ఇది సింగిల్ ఛార్జ్‌పై 310 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది.
భారత్ కోసం మారుతి తయారుచేస్తున్న కొత్త బడ్జెట్ ఈవీకి, ఇ-స్కై మోడల్‌కు సాంకేతికంగా ఏమైనా సంబంధం ఉంటుందా అనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు. ఈ కొత్త మోడల్ పేరు, బ్యాటరీ సామర్థ్యం, ఛార్జింగ్ వేగం, కచ్చితమైన రేంజ్, విడుదల తేదీపై మారుతి సుజుకి ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

