- Home
- Automobile
- Electric Scooter : లక్ష కిలోమీటర్ల బ్యాటరీ వారంటీతో ఈవి స్కూటీ... ధర కేవలం లక్ష రూపాయలే..!
Electric Scooter : లక్ష కిలోమీటర్ల బ్యాటరీ వారంటీతో ఈవి స్కూటీ... ధర కేవలం లక్ష రూపాయలే..!
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునేవారికి బ్యాటరీ లైఫ్ గురించే పెద్ద టెన్షన్… అయితే ఈ భయాలకు చెక్ పెడుతూ ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఏథర్ కొత్త స్కూటర్‌ను మార్కెట్లోకి తెచ్చింది. దీని ప్రత్యేకతలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

మార్కెట్లోకి ఏథర్ కోనార్క్ వచ్చేసింది
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వాళ్లు ముఖ్యంగా చూసేది బ్యాటరీ ఎన్ని రోజులు వస్తుంది? రిపేర్ వస్తే లక్షలు ఖర్చవుతుందా? అనేదే. ఈ సందేహాలకు సమాధానంగా ఏథర్ కోనార్క్ (Ather Konarc) భారత మార్కెట్లోకి వచ్చింది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఏకంగా 10 ఏళ్లు లేదా 1,00,000 కిలోమీటర్ల వరకు బ్యాటరీ వారంటీతో వస్తోంది.
అయితే ఇక్కడో విషయం గమనించాలి… ఈ 10 ఏళ్ల వారంటీ అన్ని వేరియంట్లకు ఫ్రీగా రాదు. ఇది అదనపు ఛార్జీతో 'AtherStack Pro', 'Extended Battery Warranty' ప్లాన్ల కింద లభించే ఒక ఆప్షన్ మాత్రమే. ఏథర్ ఎనర్జీ కొత్త EL ప్లాట్‌ఫామ్‌పై దీన్ని తయారు చేసింది. దీని ప్రారంభ ధర రూ.99,999 (ఎక్స్-షోరూమ్).
ఏథర్ కోనార్క్ వారంటీని పొడిగించుకొండి
ఏథర్ కోనార్క్ స్కూటర్ కొనుగోలుపై సాధారణంగా 3 ఏళ్లు లేదా 30,000 కి.మీ. వారంటీ వస్తుంది. కానీ AtherStack Pro ద్వారా దీన్ని పొడిగించుకోవచ్చు.
3 ఏళ్లు లేదా 30,000 కి.మీ – బేసిక్ వారంటీ
5 ఏళ్లు లేదా 60,000 కి.మీ – AtherStack Proతో వస్తుంది
8 ఏళ్లు లేదా 80,000 కి.మీ – అదనపు ఎక్స్‌టెండెడ్ వారంటీతో వస్తుంది
10 ఏళ్లు లేదా 1,00,000 కి.మీ – ప్రీమియం ఎక్స్‌టెండెడ్ వారంటీ ఆప్షన్‌తో వస్తుంది. 10 ఏళ్ల ప్లాన్ కోసం అదనంగా రూ.8,999 చెల్లించాలి. వారంటీ ముగిసేనాటికి బ్యాటరీ హెల్త్ (State of Health) కనీసం 70% ఉంటుందని కంపెనీ హామీ ఇస్తోంది.
ఇక రేంజ్ విషయానికొస్తే ఏథర్ కోనార్క్ S సిరీస్‌లో 100, 125, 161, 200 కి.మీ IDC రేంజ్ ఆప్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం కొన్ని నగరాల్లో 125, 161 కి.మీ వేరియంట్లు కూడా కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి.
ఏథర్ కోనార్క్ ఫీచర్లివే
ఏథర్ కోనార్క్‌లో 450W ఆన్‌బోర్డ్ ఛార్జర్ ఉంటుంది. దీనికి అదనంగా బయటి నుంచి మరో 450W ఆఫ్‌బోర్డ్ ఛార్జర్‌ను ఉపయోగించి 'కంబైన్డ్ ఛార్జింగ్' చేయొచ్చు. దీంతో ఇంట్లో ఛార్జింగ్ సమయం బాగా తగ్గుతుంది. కొన్ని వేరియంట్లలో 0 నుంచి 80% ఛార్జింగ్‌కు సుమారు 2 గంటల నుంచి 3 గంటల 10 నిమిషాల సమయం పడుతుంది.
ఈ ఏథర్ కోనార్క్ లో బలమైన మెటల్ బాడీ, స్టీల్ యూనిబాడీ ఛాసిస్, 14-అంగుళాల అలాయ్ వీల్స్, 31-లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్, AeBS (అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ సిస్టమ్), రివర్స్, ఎయిర్‌వాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సర్వీస్ కూడా 10,000 కి.మీ. లేదా ఏడాదికి ఒకసారి చేయిస్తే చాలు.
ఏథర్ కోనాార్క్ మెయింటెనెన్స్ కూడా తక్కువే
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనడానికి చాలామంది వెనకడుగు వేయడానికి కారణం.. బ్యాటరీ మార్చాల్సి వస్తే అయ్యే ఖర్చే. ఆ భయాన్ని తగ్గించడానికే ఏథర్ ఈ లాంగ్-టర్మ్ వారంటీ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రోజూ ఎక్కువ దూరం ప్రయాణించేవాళ్లు, ఒకే స్కూటర్‌ను చాలా ఏళ్లు వాడాలనుకునే వాళ్లకు ఈ ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది.
మొత్తానికి రూ.1 లక్ష లోపు ప్రారంభ ధర, 200 కి.మీ వరకు రేంజ్ ఆప్షన్లు, బలమైన బాడీ, 10 ఏళ్ల వరకు వారంటీని పొడిగించుకునే సౌలభ్యం.. ఇవన్నీ ఏథర్ కోనార్క్‌ను మార్కెట్లో ఓ మంచి ఆప్షన్‌గా నిలుపుతున్నాయి. కానీ కొనేముందు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి: 10 ఏళ్ల వారంటీ అనేది అదనపు ప్లాన్ మాత్రమే, బేసిక్ వారంటీ కాదు.

