Asianet News TeluguAsianet News Telugu

హిరోయిన్ సమంతనే.. కానీ చిట్టిబాబు ఆమెకన్నా ఎక్కువ ప్రేమించేది మాత్రం వేరే.. (రివ్యూ)

చిట్టిబాబు గుండెలు పిండేశాడు
ramcharan rangasthalam movie review

చిత్రం : రంగస్థలం
తారాగణం : రామ్‌ చరణ్‌, సమంత, ఆది పినిశెట్టి, జగపతి బాబు, ప్రకాష్ రాజ్‌, అనసూయ
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్‌
దర్శకత్వం : బి. సుకుమార్‌
నిర్మాత :  నవీన్‌ ఎర్నెనీ,  వై.రవి శంకర్‌, మోహన్ చెరుకూరి

 

ధృవ సినిమా తర్వాత ఏడాది పైగా గ్యాప్ తీసుకుని రంగస్థలం చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌. క్రియేటివ్‌ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్‌ డ్రామా రంగస్థలం. తమ రెగ్యులర్‌ స్టైల్‌ను పక్కన పెట్టి విభిన్న కథాంశంతో ఈ సినిమా చేశారు సుక్కు, చెర్రీ. ఇన్నాళ్లు కమర్షియల్‌ స్టార్‌గా మాత్రమే ప్రూవ్‌ చేసుకున్న రామ్‌చరణ్‌, ఈ సినిమాతో నటుడిగా తానేంటో నిరూపించే ప్రయత్నం చేశాడు. సుకుమార్‌ కూడా ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా తన చిన్ననాటి అనుభవాలతో 80ల నాటి కాలాన్ని వెండితెర మీద ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. మరి ఈ ప‍్రయత్నం లో సుకుమార్ విజయం సాధించాడా..? కమర్షియల్‌ ఫార్ములాకు భిన్నంగా తెరకెక్కిన రంగస్థలం ప్రేక్షకులను ఆకట్టుకుందా..? రామ్ చరణ్ ఈ సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చాటాడా..

 

కథ :
గోదావరి ఒడ్డున వుండే రంగస్థలం అనే గ్రామం 30 ఏళ్లుగా ఫణీంద్ర భూపతి (జగపతి బాబు) అనే గ్రామ ప్రెసిడెంట్‌ చెప్పు చేతుల్లో పెట్టుకుని అక్రమాలు చేస్తుంటాడు. అధికారం తన చెంత అట్టిపెట్టుకొని గ్రామంలోని ప్రజలను పీడిస్తుంటాడు. ఆ ఊళ్లో టైలర్ కోటేశ్వర్ రావు కుమారులు చిట్టిబాబు(రామ్ చరణ్), కుమార్ బాబు(ఆది పినిశెట్టి). ఊళ్లోనే వుంటూ తన ఆయిల్ ఇంజన్ తో పొలాలకు తడి అందించే మోటర్‌ పెట్టే కుర్రాడు చిట్టిబాబుకు వినికిడి లోపం వుంటుంది. చిట్టిబాబు ఓసారి తనను కరిచిన పామును పట్టుకోబోయి రామలక్ష్మీ(సమంత) స్నానాల గదిలో దూరుతాడు. అక్కడ ఆమెని చూసి ఇష్టపడతాడు. అలా వాళ్ల ప్రేమాయణం సాగుతుంటుంది. మరోవైపు దుబయిలో వుండే.. చిట్టిబాబు అన్న కుమార్‌ బాబు( ఆది పినిశెట‍్టి) ఏడాది తరువాత రంగస్థలం గ్రామంలో అడుగుపెడతాడు. అక్కడ జరుగుతున్న అన్యాయాలను చూసి ప్రెసిడెంటుకు ఎదురుతిరుగుతాడు. ఫణీంద్ర భూపతికి పోటీగా నామినేషన్‌ వేస్తాడు. కానీ గతంలో ఫణీంద్ర భూపతికి వ్యతిరేకంగా పోటి చేయాలనుకున్న వారంత చనిపోయారని తెలుసుకున్న చిట్టిబాబు.. తన అన్నకు ఏమైనా జరుగుతుందేమో భయపడతాడు. అన్నను ఎంతగా గౌరవిస్తాడంటే... తను ప్రేమించే రామలక్ష్మిని కూడా కాదనుకుంతేగా అన్న పై ప్రేమాభిమానాలు కలిగి వుంటాడు చిట్టిబాబు. ప్రెసిడెంటుగా బరిలో నిలిచిన అన్నను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతాడు. కానీ ప్రేమించిన అమ్మాయిని కలిసేందుకు వెళ్లొస్తున్న కుమార్‌ బాబును దారిలోని పొదల్లో చంపేస్తారు. చనిపోయే ముందు కుమార్‌ బాబు, చిట్టిబాబుతో ఎవరు చంపారో చెప్పాలని ప్రయత్నించినా అది చిట్టిబాబుకు వినిపించదు. కుమార్ బాబు, చిట్టిబాబుకు ఏం చెప్పాలనుకున్నాడు..? కుమార్ బాబు చావుకు ప్రెసిడెంటే కారణమా..?  ఈవిషయాలను చిట్టిబాబు ఎలా కనిపెట్టాడు? క్లైమాక్స్ లో అసలు ట్విస్ట్ ఎలా బయటపడింది అన్నదే మిగతా కథ.

నటీనటులు :
సినిమా అంతా చిట్టిబాబు, కుమార్ బాబు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. చిట్టిబాబుగా రామ్‌ చరణ్ అద్భుతంగా నటించాడు. ఇన్నాళ్లు కమర్షియల్ మాస్‌ పాత్రల్లోని కనిపించిన చెర్రీ, చాలెంజిగ్‌ రోల్స్‌ లోనూ మెప్పించగలనని ప్రూవ్ చేసుకున్నాడు. వినికిడి లోపంతో చరణ్ ఇబ్బంది పడే సన్నివేశాల్లో చరణ్ నటన నవ్వుల పూయిస్తుంది. సినిమాలో హాస్యాన్ని పండిచే బాధ్యతను కూడా తానే తీసుకున్నాడు చరణ్‌. లుక్‌ లో విషయంలోనే కాదు యాస, భాషల విషయంలో కూడా క్యారెక్టర్‌ కోసం చరణ్ తీసుకున్న కేర్‌ తెరమీద ప్రతీ ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో సరదాగా కనిపించిన చరణ్‌, సెకండ్‌ హాఫ్‌లో బరువైన ఎమోషన్స్‌ ను పలికించి ఆకట్టుకున్నాడు. ద్వితీయార్థంలో చరణ్ నటన చాలా సన్నివేశాల్లో కంటతడిపెట్టిస్తుంది.

కుమార్ బాబుగా ఆది పినిశెట్టి సరిగ్గా సరిపోయాడు. సినిమా అంతా హుందాగా కనిపించిన ఆది.. ప్రీ క్లైమాక్స్‌ లో వచ్చే సన్నివేశాల్లో సూపర్బ్‌ అనిపించాడు. సమంత రామలక్ష్మి పాత్రలో ఒదిగిపోయింది. గతంలో ఎన్నాడూ కనిపించినంత మాస్ పాత్రలో కనిపించిన సామ్‌ చిలిపి ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. ఎమోషనల్‌ సీన్స్‌ లోనూ తన దైన నటనతో ఆకట్టుకుంది. తన పదివి కోసం ఏమైనా చేసే క్రూరమైన ప్రెసిడెంట్ పాత్రలో జగపతిబాబు మంచి విలనీ పండించాడు. జగపతి బాబు ఆహార్యం కూడా పాత్రకు తగ్గట్టుగా ఉంది. వెండితెర మీద మంచి క్యారెక్టర్‌ కోసం ఎదురుచూస్తున్న అనసూయకు రంగస్థలంలో ఆ ఛాన్స్‌ దక్కింది. రంగమ్మత్తగా కీలక పాత్రలో కనిపించిన అనసూయ, ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఎమోషనల్‌ సీన్స్‌ లోనూ మెప్పించింది. ఇతర పాత్రలో ప్రకాష్ రాజ్, నరేష్‌, రోహిణి, బ్రహ్మాజీ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

విశ్లేషణ :
ఎవరికీ అర్థం కానీ కథనంతో ఇబ్బంది పెడతాడన్న అపవాదు సుకుమార్‌ మీద ఉంది. అందుకే రంగస్థలం సినిమా మొదలైనప్పుడే ఈ సినిమాలో అలాంటి ప్రయోగాలేవి చేయటం లేదని, ఈ సినిమాలో లెక్కల పాఠాలేవి ఉండవని చెప్పేశాడు సుకుమార్‌. రంగస్థలం.. సుకుమార్ గత చిత్రాలకు పూర్తిగా భిన్నమైన సినిమా. 1980ల నాటి కాలాన్ని వెండితెర మీద రీక్రియేట్‌ చేస్తూ సుక్కు చేసిన ప్రయత్నం సూపర్బ్‌. ప్రతీ ఫ్రేమ్‌లో ఆనాటి పరిస్థితులను తెర మీద చూపించేందుకు చిత్రయూనిట్ పడిన కష్టం తెరమీద కనిపిస్తుంది. పూర్తిగా ప్రేక్షకులను దాదాపు 40 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లడంలో సుకుమార్ టీం సక్సెస్‌ అయ్యింది.

పల్లెటూరి ప్రజల సమస్యలు అక్కడి రాజకీయ పరిస్థితులు, పగలు ప్రతీకారాలతో పాటు మనుషుల్లోని అమాయకత్వం, మంచి తనాన్ని కూడా తెర మీద చాలా బాగా ఆవిష్కరించాడు సుకుమార్‌. అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ ఏ మాత్రం మిస్‌ అవ్వకుండా జాగ్రత్తపడ్డాడు. కామెడీతో పాటు యాక్షన్‌, కాస్త రొమాన్స్‌, ఎమోషన్స్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సినిమాను తెరకెక్కించాడు. అయితే తను అనుకున్న కథను సుధీర‍్ఘం చెప్పిన సుకుమార్‌ అక్కడక్కడా కాస్త విసిగిస్తాడు. సినిమాకు మరో ప్రధాన బలం దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం. 80ల నాటి కథకు తగ్గ బాణీలతో సినిమా రిలీజ్‌కు ముందు అంచనాలు పెంచేశాడు. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన సినిమాలోనూ ఏ మాత్రం కమర్షియల్ వాల్యూస్‌ తగ్గకుండా సూపర్బ్‌ సాంగ్స్‌ తో అలరించాడు. నేపథ్యం సంగీతంతోనూ ఆడియన్స్‌ ను ఫ్లాఫ్‌ బ్యాక్‌లోకి తీసుకెళ్లాడు దేవీ. తన శైలికి పూర్తి భిన్నంగా ప్రయత్నించిన దేవీ శ్రీ ప్రసాద్‌ ఆకట్టుకున్నాడు. రత్నవేలు సినిమాటోగ్రఫి సినిమా మూడ్‌ ను క్యారీ చేసింది. కాస్ట్యూమ్స్ విషయంలో కూడా ఆనాటి పరిస్థితులకు తగ్గట్టుగా చూపించేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. 1980ల నాటి కాలాన్ని తెర మీదకు ఆవిష్కరించేందుకు నిర్మాతలు ఖర్చుకు ఏమాత్రం వెనకాడలేదు.

 

చివరగా :

కమర్షియల్ హంగులేమీ లేకున్నా నటనతో సెంటిమెంటుతో గుండెలు పిండేసిన చిట్టిబాబు(రామ్ చరణ్)

ఆసియానెట్ తెలుగు రేటింగ్- 3.75/5

Follow Us:
Download App:
  • android
  • ios