టీడీపీలోనో, బీజేపీలోనో చేరి వుంటే పవన్ మంత్రి అయ్యేవాడు .. కానీ : నాగబాబు వ్యాఖ్యలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు మెగా బ్రదర్ నాగబాబు. తన తమ్ముడు టీడీపీలోనో, జనసేనలోనో చేరి వుంటే మంత్రి పదవి వచ్చేదన్నారు. కోట్లాది మందికి సాయం చేయగలననే ఉద్దేశంతోనే పవన్ పార్టీ పెట్టాడని నాగబాబు తెలిపారు.

మెగా బ్రదర్ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తమ్ముడు పవన్ కల్యాణ్ టీడీపీలోనో, జనసేనలోనో చేరి వుంటే మంత్రి పదవి వచ్చేదన్నారు. కానీ పవన్ పదవులపై మక్కువ చూపకుండా ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే పార్టీ ఏర్పాటు చేశారని నాగబాబు పేర్కొన్నారు . జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై గణ రాసిన ‘‘ ద రియల్ యోగి’’ అనే పుస్తకాన్ని నాగబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోట్లాది మందికి సాయం చేయగలననే ఉద్దేశంతోనే పవన్ పార్టీ పెట్టాడని అన్నారు. పవన్ మా ఇంట్లో పుట్టాడు కాబట్టి అతని గురించి ఎక్కువ చెప్పలేకపోతున్నానని నాగబాబు పేర్కొన్నారు.
ఇదిలావుండగా.. కొద్దిరోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గత నెలలో తాను చదువుకున్న వైఎన్ మూర్తి కాలేజ్ పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరు మాట్లాడుతూ... పవన్ కల్యాణ్ అనుకుంటే చేస్తాడన్నారు. తాను అనుకున్నవి అన్నీ చేసేశానని.. తనకు కష్టాన్ని, పనితనాన్ని నేర్పించి ఎన్‌సీసీనే అని ఆయన గుర్తుచేసుకున్నారు. కాలేజీలో వేసిన నాటకంతో సినీ పరిశ్రమలోకి వచ్చానని.. అప్పటి నుంచి అనుకున్న దాన్ని అంతుచూడటం నేర్చుకున్నానని చిరంజీవి చెప్పారు.
Also Read: నేను మాటలు అనలేను, పడలేను.. పవన్ ఆ టైపు కాదు : చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు
కానీ ఒక్క దాంట్లో మాత్రం అంతుచూడలేకపోయానన్నారు. రాజకీయాల్లో రాణించాలంటే రాటు తేలాలని, మాటలు అనాలి, మాటలు పడాలి, నాకు అవసరమా అంటూ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం అలా కాదని.. ఆయన మాటలు అంటాడు, పడతాడని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్‌కు మీరంతా వున్నారని.. ఏదో ఒకరోజు అత్యున్నత స్థానంలో పవన్‌ని చూస్తామని చిరంజీవి జోస్యం చెప్పారు.
అంతకుముందు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి చిరంజీవి మద్దతు ఉంటుందా? లేదా అనే విషయంపై ఆయన ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. పూర్తి స్పష్టత ఇవ్వకున్నప్పటికీ చిరంజీవి తన అభిప్రాయం తెలియజేశారు. రాజకీయాలకు దూరంగా నేను ఇలా సైలెంట్ గా ఉండటమే పవన్ కళ్యాణ్ కి మేలు చేయొచ్చని ఆయన అన్నారు. ఎందుకంటే పాలిటిక్స్ లో నేనొక వైపు తానొకవైపు ఉండటం సరికాదు. నా నిష్క్రమణ పవన్ నాయకుడిగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. జనసేనకు స్ట్రాంగ్ గా నా మద్దతు తెలపలేదు. అయితే భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేను. ఎందుకంటే పవన్ నా తమ్ముడు. నిబద్ధత, ఆశయాలు కలిగిన అలాంటి నాయకుడు రావాలని కోరుకుంటాను. పవన్ ఇంత వరకు పొల్యూట్ కాలేదు. కాబట్టి ప్రస్తుతానికి నేను రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చారు.