అందంగా లేవంటూ భర్త శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేశాడు. సంవత్సరాలపాటు వాటిని భరిస్తూ వచ్చింది. దీంతో మరింత తీవ్రతరం చేశాడు. ఇక వాటిని ఆమె తట్టుకోలేక పోయింది.  దీంతో ఇంట్లోనే ఆ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...ఆళ్లగడ్డ మండలంలోని జి.జంబులదిన్నె గ్రామానికి చెందిన శ్రీనివాసులు కుమార్తె భారతికి శిరివెళ్లకు చెందిన బాలస్వామి కుమారుడు మధుతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. అందంగా లేవని, నువ్వు చనిపోతే వేరే వివాహం చేసుకుంటానని గత కొంత కాలంగా భారతిని ఆమె భర్త శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. దీంతో బాధ భరించలేక జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకుంది. 

భారతి తండ్రి శ్రీనివాసులు  ఆమె భర్త పురుగుల మధు, అత్త పుల్లమ్మ, బావలు బోరెడ్డి, బాలచంద్ర, సురేష్‌పై ఫిర్యాదు చేశాడు. ఎప్పుడూ అందంగా లేవు.. చచ్చిపో అంటూ భారతిని భర్త వేధించేవాడని... నువ్వు చచ్చిపోతే నేను ఇంకో పెళ్లి చేసుకుంటా అని చెప్పేవాడని అందుకే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని భారతి కుటుంబసభ్యులు చెబుతున్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.