కూన శ్రీశైలం గౌడ్ తో కాంగ్రెస్ నేతల భేటి: పార్టీలోకి ఆహ్వానం
పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీస్తుంది. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యేను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించింది.
హైదరాబాద్: కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కు కాంగ్రెస్ పార్టీ గాలం వేస్తుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు కూన శ్రీశైలం గౌడ్ ను కలిసి తమ పార్టీలో చేరాలని కోరారు. ఇవాళ కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది.
గతంలో కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు.అయితే రాజకీయ పరిస్థితుల్లో మార్పుల కారణంగా ఆయన బీజేపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడ కూన శ్రీశైలం గౌడ్ బీజేపీని వీడుతారనే ప్రచారం సాగింది. కానీ ,కూన శ్రీశైలం గౌడ్ మాత్రం బీజేపీలోనే కొనసాగారు.
కాంగ్రెస్ పార్టీ నేతలు మైనంపల్లి హనుమంతరావు, పట్నం మహేందర్ రెడ్డి తదితరులు కూన శ్రీశైలం గౌడ్ ను ఈ నెల 4వ తేదీన కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సూచన మేరకు కాంగ్రెస్ పార్టీ నేతలు కూన శ్రీశైలం గౌడ్ తో భేటీ అయ్యారు. కూన శ్రీశైలం గౌడ్ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం సాగుతుంది.
మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుండి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి పట్నం సునీతా మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపుతుంది. 2019 ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా అనుముల రేవంత్ రెడ్డి విజయం సాధించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ స్థానం నుండి రేవంత్ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో కనీసం 14 స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలను సిద్దం చేస్తుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. బీఆర్ఎస్ 9 స్థానాల్లో గెలుపొందింది.