కొమురంభీమ్ జిల్లాలో ఏనుగుదాడిలో ఇద్దరి మృతి: అప్రమత్తమైన అధికారులు
కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు దాడిలో ఇద్దరు రైతులు మృతి చెందారు.ఈ ఏనుగును బంధించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆదిలాబాద్: కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఒంటరి ఏనుగును బంధించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఏనుగు సంచారం నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇప్పటికే ఇద్దరు రైతులు ఏనుగు దాడిలో మృతి చెందారు.
మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుండి ఏనుగు దారి తప్పి సిర్పూర్ కాగజ్ నగర్ ప్రాంతంలోకి ప్రవేశించినట్టుగా అటవీశాఖాధికారులు అనుమానిస్తున్నారు.చింతలమానేపల్లి, పెంచికల్ పేట, బెజ్జూరు తదితర మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.ఈ నెల 3న చింతలమానేపల్లి మండలం బూరెపల్లి గ్రామానికి చెందిన అల్లూరి శంకర్ ను, ఈ నెల 4న కొండపల్లి గ్రామానికి చెందిన కారు పోశయ్యను ఏనుగు చంపింది. దీంతో ఈ ప్రాంత ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
ఈ ఏనుగును బంధించేందుకు అటవీశాఖాధికారులు చర్యలు ప్రారంభించారు. మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అటవీశాఖాధికారుల సహాయం తీసుకుంటున్నారు తెలంగాణ అధికారులు.
ఒంటరి ఏనుగును ప్రాణహిత నది పరిసరాల్లో పయనిస్తుందని అటవీశాఖాధికారులు గుర్తించారు. ఈ ఏనుగును బంధించేందుకు అధికారులు ప్రణాళికలను సిద్దం చేస్తున్నారు. ఏనుగు సంచరిస్తున్న నేపథ్యంలో ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లవద్దని స్థానికులకు అటవీశాఖాధికారులు సూచిస్తున్నారు.