విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు. వైయస్ జగన్ ఎక్కడికి వెళ్లినా తమ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రభుత్వమని, దళితుల పక్షపాతి ప్రభుత్వమని పదేపదే చెప్పే జగన్ దళితులకు ఎక్కడ న్యాయం చేశారో చెప్పాలని నిలదీశారు. 

దేవస్థానాల్లో 50శాతం రిజర్వేషన్ల ప్రకారం దళితులకు, బడుగు బలహీన వర్గాలకు అవకాశం ఇవ్వాలని జీవో విడుదల చేసిన జగన్ ఆ జీవోను తుంగలో తొక్కారని విమర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 50 శాతం రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. 

38 మందితో పాలకవర్గం ఏర్పాటు చేసిన సీఎం జగన్ కేవలం ఒక దళితుడుకే ఎందుకు అవకాశం ఇచ్చారని ప్రశ్నించారు. 50 శాతం రిజర్వేషన్లు అంటూ నానా హంగామా చేసి మీరే దానికి తూట్లు పొడిస్తే ఎలా అని నిలదీశారు. 

తిరుమల తిరుపతి దేవస్థానం తమ దృష్టిలో దేవస్థానం కాదా లేకపోతే దళితులకు, బడుగు బలహీన వర్గాలకు టీటీడీ బోర్డులో సభ్యత్వం కల్పించకూడదనుకున్నారా అంటూ నిలదీశారు. మీరు ఇచ్చిన హామీలకు మీరే నీళ్లొదిలిస్తే ప్రజలకు ఏం సమాధానం చెప్తారని కడిగిపారేశారు మాజీమంత్రి అచ్చెన్నాయుడు. 

ఈ వార్తలు కూడా చదవండి

టీటీడీ బోర్డులో క్రిమినల్స్, జగన్ పై రూ.100కోట్లు పరువు నష్టం దావా వేస్తాం: అచ్చెన్నాయుడు