Tramadol Injection: ఆంధ్రప్రదేశ్‌లో ట్రామాడోల్‌ మందుల దుర్వినియోగంపై ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. వైద్య అవసరాల కోసం ఉపయోగించాల్సిన ఈ మందు నిబంధనలకు విరుద్ధంగా చేతులు మారుతున్నట్లు సమాచారం రావ‌డంతో చ‌ర్య‌లు మొద‌లుపెట్టారు.

మంత్రి ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు

ప్రభుత్వానికి అందిన సమాచారాన్ని పరిశీలించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయన ఆదేశాలతో ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ డైరెక్టర్‌ జనరల్‌ అరుణ్‌బాబు పర్యవేక్షణలో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. ట్రామాడోల్‌తో పాటు కఠిన నిబంధనల పరిధిలోకి వచ్చే ఇతర మందుల కొనుగోలు, నిల్వ, విక్రయాలపై అధికారులు రికార్డులను పరిశీలించారు. తనిఖీల్లో బయటపడిన అంశాలను క్రోడీకరించిన అధికారులు పూర్తి వివరాలతో మంత్రికి రిపోర్ట్ అందించారు. నిబంధనలను ఉల్లంఘించే వ్యాపారులపై చర్యలు తీసుకునేందుకు శాఖ తదుపరి ప్రక్రియను ప్రారంభించింది.

జంగారెడ్డిగూడెం ఘటనతో బయటపడిన అక్రమాలు

రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలకు ప్రధాన కారణంగా నిలిచిన ఘటన జంగారెడ్డిగూడెం ప్రాంతంలో వెలుగుచూసింది. జీలుగుమిల్లి గ్రామంలోని ఆయిల్‌పామ్‌ తోటలో భారీగా ఖాళీ ఇంజెక్షన్‌ సీసాలు, పగిలిన వైల్స్‌, ఉపయోగించిన సిరంజీలు కనిపించాయి. దీంతో డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ పి. మల్లికార్జున్‌ అక్కడికి వెళ్లి పరిశీలించగా.. అవి ట్రామాడెక్స్‌, ట్రామెక్‌ పేర్లతో ఉన్న ట్రామాడోల్‌ ఇంజెక్షన్లకు సంబంధించినవిగా గుర్తించారు.

తీవ్రమైన నొప్పి నియంత్రణకు వైద్య రంగంలో ట్రామాడోల్‌ను ఉపయోగిస్తారు. అయితే దీనివల్ల మత్తు ప్రభావం కలిగే అవకాశం ఉండటంతో వైద్యుల సూచనతోనే వినియోగించాల్సిన అవసరం ఉంది. ఈ మందును కొందరు మాదక పదార్థాలకు ప్రత్యామ్నాయంగా దుర్వినియోగం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సరైన ప్రిస్క్రిప్షన్‌, బిల్లులు, రికార్డులు లేకుండా మందులను విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు.

వేలాది ఇంజెక్షన్ల నిల్వ.. 7,550 స్వాధీనం

జంగారెడ్డిగూడెం ఘటన అనంతరం అధికారులు ట్రామాడోల్‌ తయారీ సంస్థల నుంచి ఏపీ, తెలంగాణ ప్రాంతాలకు జరిగిన సరఫరా వివరాలను సేకరించారు. ఈ పరిశీలనలో జంగారెడ్డిగూడెం పరిధిలోని కొన్ని మెడికల్‌ ఏజెన్సీలు పెద్ద మొత్తంలో ట్రామాడోల్‌ ఇంజెక్షన్లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. దీంతో శ్రీ లక్ష్మీ శ్రీనివాస మెడికల్‌ ఏజెన్సీ, డి. రూప పెడ్డింటి మెడికల్‌ ఏజెన్సీల్లో తనిఖీలు నిర్వహించారు.

శ్రీ లక్ష్మీ శ్రీనివాస మెడికల్‌ ఏజెన్సీ ఈ ఏడాది రెండు బిల్లుల ద్వారా 20 వేల ట్రామాడోల్‌ ఇంజెక్షన్లు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. అయితే వాటి విక్రయాలకు సంబంధించిన బిల్లులు, నిల్వకు సంబంధించిన వివరాలు సమర్పించలేదు. విచారణలో భాగంగా నాలుగు పెట్టెల ట్రామాడెక్స్‌ ఇంజెక్షన్లను ఓ స్నేహితుడి చెక్కపనుల దుకాణంలో దాచినట్లు గుర్తించారు. అక్కడ తనిఖీ చేయగా 7,550 ఇంజెక్షన్లు లభించడంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెం, మేడ్యానపు వరిగూడెం, వేగవరం, కుక్కునూరు తదితర ప్రాంతాలకు వీటి సరఫరా జరిగినట్లు విచారణలో వెల్లడైంది.

నకిలీ బిల్లుల వ్యవహారం.. ఐదుగురి అరెస్టు

మరో మెడికల్‌ ఏజెన్సీకి సంబంధించిన తనిఖీల్లోనూ అనుమానాస్పద లావాదేవీలు బయటపడ్డాయి. డి. రూప పెడ్డింటి మెడికల్‌ ఏజెన్సీ గత రెండేళ్ల వ్యవధిలో 5,200 ట్రామెక్‌ ఇంజెక్షన్లు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. అందులో 3,930 ఇంజెక్షన్లను తెలంగాణలోని ఒక మెడికల్‌ షాపునకు విక్రయించినట్లు రికార్డుల్లో చూపించారు. అయితే తెలంగాణ ఔషధ నియంత్రణ అధికారులు పరిశీలించగా ఆ లావాదేవీ నకిలీదిగా తేలింది.

వాస్తవానికి ఇతర దుకాణాలకు మందులను సరఫరా చేస్తూ, వాటికి బదులుగా నకిలీ బిల్లులను సృష్టించినట్లు విచారణలో బయటపడింది. దీనిపై ఔషధ నియంత్రణ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జంగారెడ్డిగూడెం పోలీసులు కేసు నమోదు చేసి ఐదుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో మెడికల్‌ షాపుల యజమానులతో పాటు ఒక ఉద్యోగి ఉన్నారు.

లైసెన్సుల రద్దుకు చర్యలు.. మరింత కఠినంగా పర్యవేక్షణ

జంగారెడ్డిగూడెం ఘటనతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో తనిఖీల సందర్భంగా గుర్తించిన ఉల్లంఘనలపై ఔషధ నియంత్రణ శాఖ తదుపరి చర్యలకు సిద్ధమవుతోంది. పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు తేలిన మందుల దుకాణాల లైసెన్సులను రద్దు చేసే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ట్రామాడోల్‌ వంటి నియంత్రిత మందులను అనధికారికంగా నిల్వ చేయడం, రికార్డులు లేకుండా తరలించడం లేదా బిల్లులు లేకుండా విక్రయించడం వంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తామని అధికారులు తెలిపారు.

పోలీసులు, ఇతర అమలు సంస్థల సహకారంతో దర్యాప్తును కొనసాగించనున్నట్లు ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ డైరెక్టర్‌ జనరల్‌ అరుణ్‌బాబు వెల్లడించారు. మందుల కొనుగోలు, నిల్వ, విక్రయాలకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఉల్లంఘనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ట్రామాడోల్‌ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యవేక్షణను మరింత పటిష్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.