Asianet News TeluguAsianet News Telugu

నేడు సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని కేసు విచారణ..

అమరావతి రాజధాని కేసుల మీద ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మూడు రాజధానులతో పాటు రాష్ట్ర విభజన కేసులన్నీ విచారించనున్నారు. 

today amaravati capital cases hearing in supreme court
Author
First Published Nov 14, 2022, 9:15 AM IST | Last Updated Nov 14, 2022, 9:15 AM IST

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టులో సోమవారం అమరావతి కేసుల విచారణ జరగనుంది. రాజధాని కేసులతో కలిపి రాష్ట్ర విభజన కేసులు అన్నింటినీ లిస్ట్ చేసి విచారించనున్నారు. రెండు అంశాలపై 35 కేసులు దాఖలయ్యాయి. ఈ కేసులను జస్టిస్ కే.ఎం. జోసెఫ్, జస్టిస్  హృషికేష్ రాయి ధర్మాసనం విచారణ చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదని హైకోర్టు తీర్పును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్లో కోరింది. రద్దు చేసిన చట్టాలపై తీర్పు ఇవ్వడం సహేతుకం కాదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

రాజ్యాంగం ప్రకారం మూడు వ్యవస్థలు తమ తమ అధికార పరిధుల్లో పని చేయాలి. శాసన, పాలన వ్యవస్థ అధికారంలోకి న్యాయ వ్యవస్థ చొరబడడం రాజ్యాంగ మౌలిక వ్యవస్థకు విరుద్ధం. తమ రాజధానిని రాష్ట్రాలే నిర్ణయించుకోవడం అనేది సమాఖ్య వ్యవస్థకు నిదర్శనమని పిటిషన్లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తమ రాజధానిని నిర్ణయించుకునే సంపూర్ణ అధికారం ఉంది. ఒకే రాజధాని ఉండాలని ఏపీ విభజన చట్టంలో లేనప్పటికీ, చట్టానికి  తప్పుడు అర్థాలు చెబుతున్నారు. రాజధానిపై శివరామ కృష్ణన్ కమిటీ నివేదిక,  జిఎస్ రావు కమిటీ నివేదిక, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు నివేదిక,  హైపవర్డ్ కమిటీ నివేదికలను హైకోర్టు పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాజధానినికేవలం అమరావతిలోనే కేంద్రీకృతం చేయకుండా, వికేంద్రీకరణ చేయాలని ఈ నివేదికలు సూచించాయి. 

‘ఐ లవ్ యూ బంగారం.. నీతో మాట్లాడి…ఎన్నాళ్లయిందో..’ మాజీమంత్రి ముత్తంశెట్టి వాయిస్ తో ఆడియో వైరల్..

2014-19  మధ్య కేవలం అమరావతి ప్రాంతంలో పది శాతం మౌలికవసతుల పనులు మాత్రమే తాత్కాలికంగా జరిగాయి. అమరావతిలో రాజధాని నిర్మాణానికి రూ.1,09,000కోట్లు అవసరం. రాజధాని వికేంద్రీకరణ ఖర్చు కేవలం రూ.2000 కోట్లతో పూర్తవుతుంది. రైతులతో జరిగిన అభివృద్ధి ఒప్పందాల్లో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదు. వికేంద్రీకరణ వల్ల అమరావతి అభివృద్ధి జరగదని భావించడంలో ఎలాంటి సహేతుకత లేదు. రైతుల ప్రయోజనాలన్నీ రక్షిస్తాం. అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుంది. అక్కడ ఆ మేరకు అభివృద్ధి జరుగుతుంది అని పిటిషన్లో పేర్కొన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios