Asianet News TeluguAsianet News Telugu

Breaking: లైంగిక వేధింపుల ఆరోపణలు.. తెలుగుదేశం ఎమ్మెల్యేపై వేటు

తెలుగుదేశం పార్టీ సంచలన ప్రకటన చేసింది. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. 

TDP Suspends Satyavedu MLA Koneti Adimulam Over Harassment Allegations GVR
Author
First Published Sep 5, 2024, 2:26 PM IST | Last Updated Sep 5, 2024, 3:15 PM IST

లైంగిన వేధింపుల ఆరోపణల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సంచలన ప్రకటన చేసింది. చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై వేటు వేసింది. తనను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని మహిళ బహిరంగంగా ఆరోపణలు చేసింది. తనకు న్యాయం చేయాలని కోరింది. 

ఈ ఫిర్యాదుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం కోనేటి మూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

‘‘తిరుపతిలోని +++ హోటల్‌కి రమ్మని కోరగా.. ఎమ్మెల్యే గారు రమ్మన్నారని కార్‌ బుక్‌ చేసుకొని వెళ్లాను. రూమ్‌ నంబర్‌ 109.. జులై 6వ తారీఖు రోజు అక్కడికి వెళ్లడం జరిగింది. అక్కడ ఎవరూ లేరు. ప్రశాంతంగా ఉంది. ఎమ్మెల్యేగారు మాత్రమే ఉన్నారు. నేను రూమ్‌లోకి వెళ్లగానే.. నాపైన బలాత్కారానికి పాల్పడ్డాను. ఆ తర్వాత నేను అతనికి లొంగిపోయాను. ఇది జరిగిన తర్వాత ఎమ్మెల్యే నన్ను బెదిరించాడు. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే నీ కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు. అందువల్ల నేనెవరికీ చెప్పుకోకుండా ఉండిపోయాను.

మరోసారి ఫోన్‌ చేసి.. నువ్వు రాకపోతే నీ కుటుంబాన్ని, నీ భర్తను చంపేస్తానని బెదిరించడం జరిగింది. దీంతో నేను మళ్లీ అదే హోటల్‌కి వెళ్లాను. వెళ్లిన తర్వాత నేను పూర్తిగా ఆయన్ను అవాయిడ్ చేస్తూ వచ్చాను. నేను అవాయిడ్ చేస్తున్న విషయాన్ని తెలుసుకొని పదేపదే సైకోలా నిమిషానికోసారి ఫోన్ చేయడం జరిగింది. అది గుర్తించిన నా భర్త.. ఎమ్మెల్యే నీకెందుకు పదేపదే కాల్ చేస్తున్నాడని.. నా మొబైల్ విరిచేశాడు. నన్ను కొట్టడం, బెదిరించడం చాలా చేశాడు.

ఆ బాధను భరించలేక నాకు జరిగిందంతా నా భర్తకు వివరించాను. అప్పుడు నా భర్త.. ఇలా నీకే జరిగిందా? ఇంకెవరైనా ఉన్నారా? అని అడిగారు. చాలా మంది మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు బలైపోతున్నారని నేను చెప్పాను.

మహిళలను కాపాడి మనమూ బతకాలని అప్పుడాయన సూచించారు. ఒక పెన్‌ కెమెరా అరేంజ్‌ చేసి ఇచ్చారు. ఆగస్టు 10వ తారీఖు 1.30 గంటలకు హోటల్‌‌కి వెళ్లాను. అక్కడ జరిగిందంతా రికార్డు చేసి నా భర్తకు ఇచ్చాను. అటు తర్వాత, మంగళగిరి పార్టీ ఆఫీసుకు వెళ్లి.. పెద్దబాబు, చిన్నబాబుకు ఫిర్యాదు చేశాం. వాళ్ల ద్వారా పిలుపు వస్తుందని వెయిట్‌ చేశాం.

ఈ విషయం తెలుసుకొని ఎమ్మెల్యే నన్ను బ్లాక్‌ చేయడం, మా ఇంటి చుట్టూ నలుగురైదుగురిని పంపి నన్ను వెతకడం చేశాడు.

నాకు ప్రాణ హాని ఉంది. ప్రాణ భయంతో ఇక్కడికి వచ్చా. ఇలాంటి చీడపురుగులు తెలుగుదేశం పార్టీలో ఉన్నన్ని రోజులు తెలుగుదేశం పార్టీకి మంచి రోజులు రావని బాబుగారికి తెలియజేస్తున్నా.

అయ్యా బాబు గారూ... నేను పార్టీని కించపరచాలని ఇక్కడికి రాలేదు. అతని వల్ల నాకు ప్రాణ హాని ఉంది.. నన్ను నేను కాపాడుకోవాలని నేనిక్కడికి వచ్చాను.

ఇతన్ని వెంటనే సస్పెండ్‌ చేయకపోతే నాలాంటి అమ్మాయిలు, మహిళలు కుంగిపోతారు. మీరది గుర్తించి వెంటనే అతన్ని సస్పెండ్‌ చేయాలి. మాకు మీరే దిక్కు బాబు’’ అని బాధిత మహిళ కోరారు. 

ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.  ఈ మేరకు అధికారికంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios