Asianet News TeluguAsianet News Telugu

మీ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయా? అత్యవసరమా? ఈ నంబర్లకు కాల్ చేయండి

రాష్ట్రంలో తుపాను, వ‌ర‌దల నేప‌థ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు NDRF, SDRF బృందాలను రంగంలోకి దింపింది. అలాగే, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిల్లో అత్యవసర సేవలందించేందుకు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది.

Emergency Contact Numbers Amid Heavy Rains and Floods in Andhra Pradesh: Stay Safe! GVR
Author
First Published Sep 1, 2024, 12:25 AM IST | Last Updated Sep 1, 2024, 12:36 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో వాగులు వంకలు ఏకమయ్యాయి. అనేక జనావాసాలు జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు ప్రజలను హెచ్చరిస్తూ.. క్షేత్రస్థాయిలో అధికారుల ద్వారా సహాయక చర్యలు చేపడుతోంది.

Emergency Contact Numbers Amid Heavy Rains and Floods in Andhra Pradesh: Stay Safe! GVR
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పర్యటనలను రద్దు చేసుకుని.. సహాయక చర్యలపై దృష్టిపెట్టారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితులపై అధికారులతో సమీక్షిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా.. పునరావాస చర్యల్లో ఖర్చుకు ఎక్కడా వెనకాడొద్దని సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులకు సూచించారు. పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు అందేలా చూడాలని ఆదేశించారు. మంచి భోజనం, వసతి ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రస్తుతం జిల్లాకు రూ.3 కోట్లు ఇచ్చామని... అవసరం అయితే ఇంకా ఇస్తామని జిల్లా కలెక్టర్లకు తెలిపారు. 
కాగా, ఎన్టీఆర్ జిల్లాలో పలు గ్రామాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. బుడమేరుకు 30 వేల క్యూసెక్కుల వరద వచ్చే ప్రమాదం ఉండటంంతో.. అధికారులు ఆ ప్రాంత ప్రజలను తరలించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ సందర్భంగా.. బుడమేరు పరిసర ప్రాంతాల్లో ఇప్పటి వరకు 1,500 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామన్న జిల్లా కలెక్టర్ సీఎంకు వివరించారు. అలాగే, ఎన్టీఆర్ జిల్లాలో 15 చెరువులకు గండ్లు పడ్డాయని.... గండ్లు పూడ్చే పనులు చేస్తున్నామని మంత్రి రామానాయుడు వెల్లడించారు. 

Emergency Contact Numbers Amid Heavy Rains and Floods in Andhra Pradesh: Stay Safe! GVR

మరో 24 గంటలు హై అలర్ట్: సీఎం చంద్రబాబు

తెలంగాణలోని సరిహద్దు జిల్లాల నుంచి వచ్చే వరద నీటిని అంచనా వేసుకుని వరద నియంత్రణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రజలు ఉధృతంగా ప్రవహించే వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. ప్రజలు, వాహనదారులు ఈ విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని... అధికారుల సూచనలు ప్రజలు పాటించి.. ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

వర్షాలు తగ్గేవరకు అధికారులు విశ్రమించవద్దని.... మరో 24 గంటలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. భారీ వర్షాలపై సహాయక చర్యలపై జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో శనివారం మూడోసారి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తుఫాను కళింగపట్నం ప్రాంతంలో తీరం దాటిన నేపథ్యంలో ఆదివారం వర్షాల తీవ్రత తగ్గుతుందని అధికారులు సీఎంకు వివరించారు. ఇక, ఆదివారం పల్నాడు, ఎన్టీఆర్, కర్నూల్, నంద్యాల జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. 

అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి: హోం మంత్రి 

మరోవైపు ఏపీలో వర్షాలపై రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌, రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) శాఖ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా, సీసీఎల్‌ఏ చీఫ్‌ కమిషనర్‌  జి.జయలక్ష్మి, సీఎల్‌ఏ సెక్రటరీ ఎన్ ప్రభాకర్ రెడ్డి,  పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది డైరెక్టర్ కృష్ణాతేజ, విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి నిరంతరం పర్యవేక్షించారు. హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత కలెక్టర్లతో భారీ వర్షాలు/ వరదలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆదివారం చాలాచోట్ల మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నందున అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి అధికారులతో కలసి ఎప్పటికప్పుడు వర్షాభావ పరిస్థితులు, వాగులు,కాలువలు,రోడ్ల మీద వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ సంబంధిత జిల్లాల కలెక్టర్లకు సూచనలు జారీ చేశారు. సహాయక చర్యల్లో  నిర్లక్ష్యం లేకుండా వ్యవహరించాలన్నారు. విద్యుత్ శాఖ అధికారులు పవర్ రిస్టోరేషన్ సంబంధించిన పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.

ఇరిగేషన్ , ఆర్ డబ్ల్యూ ఎస్, హెల్త్, ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి  ప్రాణ నష్టం జరగకుండా, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని కలెక్టర్లకు హోం మంత్రి అనిత సూచించారు. ప్రమాదకరంగా ఉన్న హోర్డింగ్స్ , పడిన చెట్లు వెంటనే తొలగించాలన్నారు. ప్రభావిత మండలాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెంటనే తరలించాలని అలాగే ప్రజలు సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని కోరారు. 
రానున్న రెండు రోజులు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొంగిపొర్లే రోడ్లు, కాలువలు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు, పడిపోయిన విద్యుత్ లైన్లకు, స్తంభాలకు దూరంగా ఉండాలన్నారు. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దని కోరారు. రోడ్లపై వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నందున పూర్తిస్థాయిలో తగ్గేవరకు రోడ్ల మీదకు రాకుండా సహకరించాలన్నారు.

Emergency Contact Numbers Amid Heavy Rains and Floods in Andhra Pradesh: Stay Safe! GVR

అందుబాటులో 4 ఎన్డీఆర్ఎఫ్,  6 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ... స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఆర్&బి, పంచాయతీ రాజ్  గ్రామీణాభివృద్ది, విద్యుత్, హెల్త్ & మెడికల్,  వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖ, మత్స్య, సివిల్ సప్లై, ఇతర శాఖలతో సమన్వయ పరుచుకొని జిల్లాల్లో క్షేత్రస్థాయిలో సహాయక చర్యలకు ఎటువంటి అటంకం లేకుండా చూడాలన్నారు. అత్యవసర సహాయక చర్యల్లో 4 ఎన్డీఆర్ఎఫ్,  6 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నట్లు తెలిపారు. గోదావరి, కృష్ణా, తుంగభద్ర ఇతర నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా  ఉండి... తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు విపత్తుల నిర్వహణ సంస్థ మేసేజ్లను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర సహాయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, 112, 18004250101 ను సంప్రదించాలని సూచించారు. 

వైద్య శాఖ సంసిద్ధం...

ఇక, రాష్ట్రంలో తుపాను, వ‌ర‌దల నేప‌థ్యంలో అత్య‌వ‌స‌ర వైద్య సేవ‌లందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ‌ సిద్ధమైంది. రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ‌తో  స‌మ‌న్వ‌యం చేసుకునేలా ఈ కంట్రోల్ రూం ప‌నిచేస్తుంది. ముఖ్యంగా గ‌ర్భిణులకు, పాము కాటుకు గురైన వారికి, విద్యుతాఘాతాల‌కు గురైన వారికి రాష్ట్ర కంట్రోల్ రూం అందుబాటులో ఉంటుంది. అత్య‌వ‌స‌ర వైద్య సేవ‌ల కోసం రాష్ట్ర కంట్రోల్ రూం ఫోన్ నంబ‌రు 90323 84168కు ఫోన్ చేయవచ్చు. ఇ-మెయిల్ ఐడీ... epeidemics.apstate@gmail.com ద్వారా ఎమర్జెన్సీ సమాచారం అందించవచ్చు. ఇక, కంట్రోల్ రూం ఇంచార్జి డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యేస్వ‌రి (73864 51239), హెడ్‌గా స్టేట్ హెల్త్ ఆఫీస‌ర్ - ఐడీఎస్పీ డాక్ట‌ర్ ఎంవీ ప‌ద్మ‌జ‌ (83748 935490) అందుబాటులో ఉంటారు. వీరిద్ద‌రి ఆధ్వ‌ర్యంలో మూడు షిఫ్టుల వారీగా ముగ్గురు స‌భ్యుల బృందం సెప్టెంబ‌ర్ 3వ తేదీ వ‌ర‌కు కంట్రోల్ రూంలో నిరంత‌ర‌ం అత్య‌వ‌స‌ర వైద్య సేవ‌ల్ని ప‌ర్య‌వేక్షిస్తారు.

రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ‌తో స‌మ‌న్య‌యం చేసుకుని ప‌నిచేందుకు వైద్య ఆరోగ్య శాఖ మొద‌టి షిఫ్ట్‌కు ( ఉద‌యం 6 నుండి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు) టీబీ, జేడీ డాక్ట‌ర్ టి.ర‌మేష్‌-98499 09911, రెండో షిఫ్ట్‌కు (మ‌ధ్యాహ్నం 2 నుండి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు) ఐడీఎస్పీ జేడీ డాక్ట‌ర్ మ‌ల్లేశ్వ‌రి -94914 23226, మూడో షిఫ్ట్‌కు (రాత్రి 10 నుండి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు) ట్రైబ‌ల్ హెల్త్ పీఓ డాక్ట‌ర్ ఎం.ర‌మేష్ బాబు-99597 27979ను వైద్య ఆరోగ్య శాఖ నియ‌మించింది. అలాగే, భారీ వర్షాలు కురుస్తున్న అన్ని జిల్లాల్లోనూ ఎక్కడికక్కడ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios