టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడిపై నిర్భయ కేసు..
మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుపై విశాఖ జిల్లా పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.
మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుపై విశాఖ జిల్లా పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. తనను ఉద్దేశించి అయ్యన్నపాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కృష్ణవేణి మంగళవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయ్యన్నపాత్రుడు తాత, మాజీ ఎమ్మెల్సీ రుత్తల లచ్చాపాత్రుడు ఫోటో మున్సిపల్ కార్యాలయం నుంచి తొలగించారంటూ గవిరెడ్డి వెంకటరమణ సారధ్యంలో సోమవారం ఉదయం అనుమతి లేకుండా బహిరంగ సమావేశం నిర్వహించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమావేశంలోనే అయ్యన్నపాత్రుడు తనను అవమానపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆమె ఆరోపించారు. దీంతో పోలీసులు మాజీమంత్రి అయ్యన్నపాత్రుడుపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.