అవును ట్రాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరి చావుకు కారణమయ్యాననే వేదనతో బలవనర్మరణానికి పాల్పడింది. ఎక్కడో కాదు... మన రాష్ట్రంలోని మెదక్ జిల్లాలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.

 

శివంపేట మండలం చండి గ్రామంలో కరెంటు స్తంభాల లోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీ కొట్టింది. అందులో ఉన్న నలుగురిలో ఇద్దరు మరణించగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ట్రాక్టర్ ట్రైలర్ కూడా రోడ్డుపై తిరగబడింది.

దీంతో రహదారిపై వాహనాలు ప్రయాణించకుండా అయిపోయింది. రంగంలోకి దిగిన స్థానికులు ఒక ప్రొక్లెయినర్ తో ట్రైలర్‌ను సరి చేయించారు.

 

ట్రైలర్ మళ్లీ యథాస్థానానికి రాగానే ట్రాక్టర్ రోడ్డును వారగా ఉన్న వైపు వేగంగా వెళ్లిపోయింది. అక్కడున్న వాళ్లు పట్టుకునేలోపే దగ్గర్లో ఉన్న బావిలో పడిపోయింది.

 

దీంతో అక్కడున్నవారంతా అవాక్కైయ్యారు. పాపం ఇద్దరిని చంపాననే బాధతో ట్రాక్టర్ బావిలో పడి ఆత్మహత్య చేసుకుందని కొందరు వాపోయారు.