- Home
- Andhra Pradesh
- Weather Update : బంగాళాఖాతంలో అల్పపీడనం రెడీ... తెలుగు రాష్ట్రాలపై స్ట్రాంగ్ ఎఫెక్ట్, ఈ జిల్లాల్లో ఇక వర్షబీభత్సమే
Weather Update : బంగాళాఖాతంలో అల్పపీడనం రెడీ... తెలుగు రాష్ట్రాలపై స్ట్రాంగ్ ఎఫెక్ట్, ఈ జిల్లాల్లో ఇక వర్షబీభత్సమే
కొద్దిరోజులుగా మొఖం చాటేసిన మేఘాలు మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు షురూ అయ్యాయి. మరి ఏఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
Heavy Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మెల్లిగా మారుతోంది. వర్షాలు లేకపోవడమే కాదు అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో సతమతం అవుతున్న తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ (IMD) గుడ్ న్యూస్ తెలిపింది. బంగాళాఖాతంలో ఇప్పటికే ఓ అల్పపీడనం ఏర్పడింది... దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు పెరిగే అవకాశాలున్నాయని ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తాతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్, మరికొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్‌లు జారీ అయ్యాయి.
భారత వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం... ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారింది. దీంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండుమూడు రోజులు ( సెప్టెంబర్ 10 నుంచి 12 వరకు) మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయట.
ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు
అల్పపీడనం ప్రభావం ముందుగా ఉత్తరాంధ్రపై కనిపించే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ పరిసర ప్రాంతాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, అరకు, తిరుపతి, మార్కాపురం ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రానున్న కొద్దిగంటల్లో వర్ష తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. తీర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకారం... ఇవాళ (గురువారం) సాయంత్రం లేదా రాత్రి విశాఖపట్నం, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వర్షంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది. ఇక నర్సీపట్నం, తుని, అన్నవరం, ఎలమంచిలి, కోటనందూరు, కోటవురటు, ఏటికొప్పాక, రాజయ్యపేట పరిసర ప్రాంతాల్లోనూ ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటోంది.
తెలంగాణలోనూ భారీ వర్షాలకు ఛాన్స్
బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుందని హెదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుందట... అందుకే జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది.
ఇక ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందట. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రేపు ఈ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు
సెప్టెంబర్ 11న (శుక్రవారం) తెలంగాణలో వర్షాల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అదే సమయంలో నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయంటోంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.
వర్షాలతో పాటు ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే సమయంలో చెట్ల కింద నిలబడటం ప్రమాదకరం. భారీ హోర్డింగులు, విద్యుత్ స్తంభాలు, నిర్మాణంలో ఉన్న భవనాలు, శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలకు దూరంగా ఉండాలి. అత్యవసరం కాని సమయంలో వర్షంలో ప్రయాణాలు చేయకుండా ఉండటమే మంచిది. ద్విచక్ర వాహనదారులు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
అల్పపీడనం ప్రభావం ఎంతకాలం ఉంటుంది?
ప్రస్తుతం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ వ్యవస్థపై వాతావరణ శాఖ నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తోంది. అల్పపీడనం కదలిక, బలం ఆధారంగా వర్షాల తీవ్రత, విస్తృతి మారే అవకాశం ఉంటుంది. అందువల్ల జిల్లాల వారీగా జారీ చేసే తాజా హెచ్చరికలను ప్రజలు గమనిస్తూ ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మొత్తంగా చూస్తే రానున్న రెండు మూడు రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు వర్షాల పరంగా కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వాతావరణ పరిస్థితుల్లో మార్పులను బట్టి హెచ్చరికలు కూడా మారే అవకాశం ఉన్నందున అధికారిక వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థల తాజా సూచనలను అనుసరించడం అవసరం.

