రవాణా శాఖ మహిళా ఉద్యోగినిపై హోంగార్డు అత్యాచారం... వీడియోలు తీసి నాలుగేళ్లుగా బ్లాక్ మెయిల్, అరెస్ట్..
హైదరాబాద్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మత్తుపానీయం ఇచ్చి మహిళా ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడిన హోంగార్డు... అవి వీడియోలు తీసి.. నాలుగేళ్లుగా చిత్రహింసలు పెడుతున్నాడు.
హైదరాబాద్ : హైదరాబాద్ లో రవాణాశాఖలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగిపై అత్యాచారానికి పాల్పడిన.. అదే శాఖకు చెందిన హోంగార్డు అరెస్టయ్యాడు. నాలుగేళ్ల కిందట ఆమెపై అత్యాచారానికి పాల్పడిన హోంగార్డు.. దాన్ని వీడియోలు తీసి.. ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. తరచూ లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా డబ్బులు తీసుకుంటున్నాడు. ఆ హింసను భరించలేని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సోమవారం నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం హైదరాబాదులోని రవాణా శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగిని ఒకరు కాపురంలో గొడవల కారణంగా భర్తతో విడిపోయింది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ ఉద్యోగినిని ఖమ్మంలోని రవాణా శాఖ కార్యాలయానికి 2018లో ఉన్నత అధికారులు బదిలీ చేశారు.
తల్లీ, బిడ్డలకు అక్కడి రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లగా.. అక్కడ హోంగార్డ్ గా పనిచేస్తున్న స్వామి పరిచయమయ్యాడు. ఇల్లు చూపించడంతో పాటు, పిల్లలకు స్కూల్లో అడ్మిషన్ ఇప్పించాడు. కొద్ది రోజుల్లోనే ఆ కుటుంబానికి బాగా దగ్గరయ్యాడు. ఆపద్బాంధవుడిగా మారాడు. దీంతో ఆమె తన కుటుంబ విషయాలు హోంగార్డ్ తో పంచుకున్నారు. ఒక రోజు ఓ జ్యూస్ ను శక్తినిస్తుందని చెప్పి తాగించాడు. అది తాగిన ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో.. అత్యాచారం చేసి వీడియోలు, ఫోటోలు తీశాడు. మరుసటి రోజు నుంచి వాటిని చూపించి బెదిరిస్తూ.. అత్యాచారానికి పాల్పడడంతో పాటు డబ్బులు తీసుకొనేవాడు. ఈ క్రమంలో ఆమెకు హైదరాబాద్ బదిలీ అయ్యింది. కొద్ది రోజులు మౌనంగా ఉన్న నిందితుడు మళ్లీ వేధించడం మొదలుపెట్టాడు.
హైదరాబాద్ లో దారుణం.. మత్తు మందు ఇచ్చి, వివాహితపై ప్రభుత్వ ఉద్యోగి అత్యాచారం..
రాత్రిపూట వీడియో కాల్ చేసి నగ్నంగా మాట్లాడాలని కోరేవాడు.. అది రికార్డు చేసేవాడు. దీంతో బాధితురాలు అతడి మొబైల్ నెంబర్ ను బ్లాక్ చేసింది. రెండు నెలల క్రితం హైదరాబాద్ లోని కార్యాలయానికి వచ్చి రూ.50 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేయడంతో.. ఇక భరించలేని బాధితురాలు తన తల్లి, నిందితుడి భార్యకు ఈ విషయం వివరించారు. దీంతో మరింత కక్ష పెంచుకున్న స్వామి.. బాధితురాలు వదిలేసిన భర్త, అత్తామామలకు వీడియోలు పంపించాడు. డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా అంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. అతడి వేధింపులు భరించలేని బాధితురాలు ఈ నెల 22న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు ipc 376, 354d, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని సోమవారం రాత్రి అరెస్టు చేశారు.