రాజాసింగ్ వివాదం : మొదటినుంచీ రెచ్చగొట్టే వ్యాఖ్యలే, ఇప్పటివరకు 42 కేసులు, ప్రమాదకరమైన వ్యక్తిగా ఎఫ్బీ లేబుల్
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆయన కెరీర్ ప్రారంభం నుంచి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో తరచూ వివాదాస్పదం అవుతుండేవాడు. హిందువాహిని సభ్యుడిగా మొదలైన ఆయన కెరీర్ లో ఇప్పటివరకు 42 కేసులున్నాయి.
హైదరాబాద్ : మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన రాజాసింగ్.. ఆదినుంచీ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్నారు. హిందు వాహిని సభ్యుడిగా, గోసంరక్షణ, శ్రీరామనవమి శోభాయాత్రల నిర్వహణతో ప్రచారంలోకి వచ్చి.. కార్పొరేటర్ గా రాజకీయ ప్రవేశం చేసి.. ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన రాజా సింగ్.. తన వ్యాఖ్యలతో తరచూ వివాదాస్పదం అవుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై పలుకేసులు నమోదై పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 42 కేసులు నమోదు కాగా అత్యధికం రెచ్చగొట్టే వ్యాఖ్యలు సంబంధించినవే కావడం గమనార్హం. తెలంగాణతో పాటు యూపీ, కర్ణాటకలోనూ కేసులు నమోదయ్యాయి.
విచారణ తరువాత కోర్టులు 36 కేసును కొట్టివేశాయని రాజాసింగ్ తరఫు న్యాయవాది ఒకరు తెలిపారు. కాగా, హిందూ ధర్మం కోసం పాటుపడతానని, అందుకోసం దేనికైనా సిద్ధంగా ఉంటానని ఆయన చెబుతుంటారు. గతంలో టీడీపీ, బిజెపి పొత్తులో టీడీపీ అభ్యర్థిగా mangalhat నుంచి పోటీ చేసి కార్పొరేటర్గా ఎన్నికైన రాజాసింగ్ ఆ తర్వాత బీజేపీలో చేరారు. 2014, 2018లో మంగళ్ హాట్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్, దీంతో శాసనసభాపక్ష నాయకుడిగానూ ఎన్నికయ్యారు.
పాతబస్తీలో ఉద్రికత్త.. భారీగా పోలీసుల మోహరింపు.. రాజాసింగ్ ప్రవక్తపై వ్యాఖ్యల ఎఫెక్ట్..
మరోవైపు రాజాసింగ్ ను రెండేళ్లక్రితం ప్రమాదకరమైన వ్యక్తిగా ఫేస్బుక్ లేబుల్ చేసింది. ఫేస్బుక్ ప్లాట్ఫామ్ నుంచి తొలగించింది. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన స్టాండ్ ఆఫ్ కమెడియన్ మునావర్ ఫారూఖీ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి రాజాసింగ్ ఆందోళన నిర్వహించారు. దీంతో ఆయనను అరెస్టు చేసి, తర్వాత విడుదల చేశారు.
41(ఏ)... విషయంలో తరచూ పప్పులో కాలు...
రాజా సింగ్ అరెస్టుకు ముందు 41(ఏ) క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ( సిఆర్ పిసి) ప్రకారం నోటీసులు ఇవ్వలేదని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ఈ వాదనతో ఏకీభవించిన కోర్టు రాజాసింగ్ ను విడుదల చేసింది. దీంతో41(ఏ) సిఆర్ పిసితోపాటు ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది. ఫిర్యాదు అందిన కొంత సమయానికే.. పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే, నిబంధనల ప్రకారం ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి 41(ఏ) సిఆర్ పిసి కింద పోలీసులు నోటీసులు జారీ చేయాలి.
నిర్ధిష్ట సమయంలో, నిర్దిష్ట ప్రాంతంలో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని దర్యాప్తు అధికారి పేర్కొనాలి. అప్పుడే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్టు చేయాల్సి ఉంటుంది. రాజాసింగ్ విషయంలో ఈ నిబంధనలు పాటించలేదని ఆయన తరఫు న్యాయవాదులు ప్రస్తావించారు. ఇటీవల పలు కేసుల్లోనూ పోలీసులు 41(ఏ) నిబంధనలు పాటించడం లేదంటూ కోర్టులు నిందితులకు రిమాండ్ విధించడం లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు.
చర్చనీయాంశంగా పోలీసుల తీరు..
రాజాసింగ్ కేసులో ఆయన వివాదాస్పద వ్యాఖ్యల కంటే అరెస్టు, తదుపరి పరిణామాలపైనే ఎక్కువ ప్రచారం జరిగింది. అయితే, ఇలాంటి కేసులో పోలీసులు వ్యవహరించిన తీరుపై చర్చనీయాంశం అవుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేపై ఫిర్యాదు నుంచి.. విడుదల వరకు గంటల వ్యవధిలో జరిగిన పరిణామాలను పోలీసు ఉన్నతాధికారులు న్యాయ నిపుణులతో కలిసి సునిశితంగా పరిశీలిస్తున్నారు. ఇకపై ఈ తరహా కేసుల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని భావిస్తున్నట్లు తెలిసింది.