Pegasus Spyware: మీ ఫోనులు సేఫెనా..?
పెగాసస్ స్పైవేర్ గురించి ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతుంది. దీని మీద పార్లమెంటులో చర్చ జరగాలని విపక్ష ఎంపీలు డిమాండ్ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ స్పైవేర్ ఎలా పనిచేస్తుంది, మీకు జరిగే నష్టం ఏమిటో తెలుసుకోండి
ఇజ్రాయెల్ కి చెందిన నిఘా కంపెనీ ఎన్ఎస్ఓ గ్రూప్ తాయారు చేసిన పెగాసస్ స్పైవేర్ మరోసారి వార్తల్లో నిలిచింది. 2019లో ఏకంగా వాట్సాప్ మాతృ సంస్థ ఫేస్ బుక్ ఈ సంస్థపై కోర్టులో కేసు కూడా వేసిన సంగతి తెలిసిందే. ఫోన్లలో ఈ స్పైవేర్ ని జొప్పించడంద్వారా ఆ ఫోనులోని పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడంతో పాటుగా కాల్స్ ని రికార్డు చేయడం, మైక్,కెమెరాలను కంట్రోల్ చేస్తూ... ఆ డేటాను సర్వర్ కి పంపే వీలవుతుంది. ఇప్పుడు మరోసారి భారతదేశంలో ఈ విషయమై చర్చ జరుగుతుంది.
పెగసస్ అనేది గ్రీకు పురాణాల్లో మనకు కనపడే ఒక రెక్కల గుర్రం. దీనిపైన బెలెరోఫోన్ అనే యోధుడు ఒక బల్లెం పట్టుకొని మనకు కనపడతాడు ఇలా తన చేతిలోని బల్లాన్ని ఇంగ్లీషులో స్పియర్ అంటారు. స్పియర్ పేరు మీదనే ఈ సదరు స్పైవేర్ ద్వారా చేసే ఫిషింగ్ కి స్పియర్ ఫిషింగ్ అని పేరు పెట్టడం జరిగింది.
ఇక దీన్ని తయారు చేసిన కంపెనీ విషయానికి వస్తే ఎన్ఎస్ఓ అనే ఒక ఇజ్రాయిల్ సంస్థ ఈ స్పైవేర్ తయారుచేసింది. ప్రపంచంలో శాంతి భద్రతలను కాపాడడానికి, తీవ్రవాదం నుంచి సామాన్య ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఈ కంపెనీని ఏర్పాటు చేసినట్లుగా ఆ సదరు కంపెనీ తమ వెబ్సైట్లో పేర్కొంటుంది.కేవలం ప్రభుత్వాలు లేదా ప్రభ్హుత్వా నిఘా సంస్థలకు మాత్రమే తాము స్పైవేర్లను అమ్ముతామని కూడా వారు అందులో పొందుపరిచారు.
ఇజ్రాయిల్ నిఘా వర్గానికి చెందిన యూనిట్ 8200 లో పనిచేసిన కొందరు అధికారులు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీరంతా సిగ్నల్ ఇంటలిజెన్స్ విభాగానికి చెందినవారు. 2012లో ఈ సదరు కంపెనీ మెక్సికో ప్రభుత్వంతో తొలి కాంట్రాక్టును చేయడం జరిగింది. 20 మిలియన్ డాలర్లకు ఈ స్పైవేర్ ను అమ్మారు. దాని తరువాత పనామా ప్రభుత్వానికి అమ్మడం జరిగింది. ఈ విధంగా ప్రపంచంలోని అనేక దేశాలకు వీరు తాము తయారు చేసినటువంటి స్పైవేర్ ను అమ్ముతూ వచ్చారు.
సౌదీ ప్రభుత్వం ఈ స్పైవేర్ ద్వారా జమాల్ ఖషోగ్గి పై నిఘా ఉంచింది. కాషోగి హత్యానంతరం ఎన్ఎస్ఓ కంపెనీ సౌదీ ప్రభుత్వం తోటి తమ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీనికి ఒక బలమైన కారణం ఉంది. సౌదీకి చెందినటువంటి అహ్మద్ మన్సూర్ అనే సామాజిక కార్యకర్త వాట్సాప్ సంస్థకు ఒక ఫిర్యాదు చేశాడు.
ఎవరో తన పైన గూఢచర్యం చేస్తున్నట్టు, తన ఫోన్ ద్వారా తన విషయాలన్నీ తెలుసుకుంటున్న అనుమానాలున్నాయని వాట్సాప్ కు తెలిపాడు. మన్సూర్ ఇచ్చిన ఫిర్యాదుతో వాట్సాప్ సిటిజన్ ల్యాబ్ అనే సంస్థను రంగంలోకి దింపి దీనిపైన పూర్తి విచారణ జరపాలని ఆదేశించింది. అలా తొలిసారి ఈ పెగసస్ స్పైవేర్ గురించి ప్రపంచానికి తెలిసింది.
స్పైవేర్ ఏమేం పనులు చేయగలుగుతుంది అంటే కేవలం మన కాల్స్, మెసేజ్ లు వినడం, చదవడం మాత్రమే కాకుండా, పూర్తి ఫోన్ ని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. మన ప్రమేయం లేకుండా మన ఫోన్ని స్విచ్ ఆన్ చేయడం కానీ స్విచ్ ఆఫ్ చేయడం కానీ చేస్తుంది. అంతే కాకుండా దానికి ఇష్టం వచ్చినప్పుడు మైక్రోఫోన్ ని గాని కెమెరాని గాని ఆన్ చేయగలుగుతుంది. ఈ స్పైవేర్ కేవలం వాట్సాప్ ద్వారా మాత్రమే కాకుండా, మిస్డ్ కాల్ ద్వారా కూడా ఫోన్ లోకి చొరబడే ప్రమాదం ఉంది.