తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక పార్టీ అధిష్టానానికి తలబొప్పి కట్టిస్తున్నట్లే ఉంది. ప్రజలను సమీకరించే నాయకత్వం తెలంగాణలో కాంగ్రెసుకు ఇప్పుడు అవసరం ఉంది. చెప్పాలంటే, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకుడు ఇప్పుడు కావాలి. చాలా కాలంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగించిన ఫలితం ఇప్పటికే కాంగ్రెసు అనుభవిస్తూనే ఉంది. చెప్పాలంటే, ప్రస్తుతం రేవంత్ రెడ్డి వంటి నాయకుడి అవసరమే తెలంగాణకు ఉంది. 

రేవంత్ రెడ్డి స్వయంగా ప్రజల్లోకి దూసుకుని వెళ్లగలరు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ధీటుగా ఎదుర్కోగలిగే వాక్పటిమ ఆయనకు ఉంది. అంతరంలో సెగ ఉంది. దాంతో పాదయాత్ర వంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లోకి చొచ్చుకుని పోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కానీ, కాంగ్రెసు సీనియర్ నేతలు ఆయన అడుగడుగునా అడ్డుపడుతున్నారు. దాంతో అధిష్టానం జీవన్ రెడ్డి వైపు మొగ్గుచూపినట్లు కనిపిస్తోంది. అయితే, అది కూడా సీనియర్ నేత జానా రెడ్డి పుణ్యమా అని వెనక్కి వెళ్లినట్లు కనిపిస్తోంది.

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ముగిసే వరకు పీసీసీ చీఫ్ నియామకాన్ని వాయిదా వేయాలని ఆయన అధిష్టానాన్ని కోరారు. నాగార్జునసాగర్ లో పోటీ చేసేది ఆయనే కాబట్టి ఆయన మాటకు విలువ ఇచ్చినట్లు కనిపిస్తోంది. తద్వారా కాంగ్రెసు మరింత వెనక్కి వెళ్లినట్లు కనిపిస్తోంది. ఓ వైపు బిజెపి దూసుకుని పోతోంది. బండి సంజయ్ ను అధ్యక్షుడిగా నియమించిన తర్వాత బిజెపికి ఊపు వచ్చింది. దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించడంతో పాటు గ్రేటర్ హైదరాబాదు నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో గణనీయమైన ఫలితాలు సాధించింది.

టీఆర్ఎస్ ను ఎదుర్కోగల శక్తి బిజెపికి మాత్రమే ఉందనే అభిప్రాయం ప్రజల్లోకి, నాయకుల్లోకి వెళ్లింది. ఈ తరుణంలో కాంగ్రెసు మరింతగా వెనకంజ వేసే అవకాశమే ఉంది. పీసీసీ అధ్యక్షుడి ఎంపికలో కాంగ్రెసు అధిష్టానం తెగించి నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. ఈ విషయంలో మరింత జాప్యం చేస్తే టీఆర్ఎస్ మాట అటుంచి బిజెపిని అందుకోవడం కూడా కష్టమే అవుతుంది.

తెలంగాణ కాంగ్రెసు నాయకుల మధ్య అనైక్యత ప్రస్తుత పరిస్థితికి కారణంగా చెప్పవచ్చు. పెద్ద తలకాయలు ఎక్కువై పోయి సమస్య ఉత్పన్నమవుతోంది. వి హనుమంతరావు, శ్రీధర్ బాబు, మల్లుభట్టి విక్రమార్క, కోమటిరెడ్డి సోదరులు, జగ్గారెడ్డి వంటి పలువురు నాయకులు పీసీసీ చీఫ్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. వీరిలో ఎవరిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించినా విభేదాలు సమసిపోతాయని చెప్పడానికి వీలు లేదు. అందరూ కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేస్తారని చెప్పడానికి కూడా అవకాశం లేదు.

బిజెపి జాతీయ నాయకత్వం చాలా తెలివిగా, వ్యూహాత్మకంగా వ్యవహరించి పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు ఏ విధమైన అడ్డంకులు లేకుండా చేసింది. సీనియర్ నాయకులను పార్టీలోని వివిధ హోదాల్లో నియమించింది. జి. కిషన్ రెడ్డి కేంద్ర సహాయ మంత్రి కాగా, గత పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ను ఓబీసీ జాతీయాధ్యక్షుడిగా నియమించింది. కాంగ్రెసు నుంచి పార్టీలోకి వచ్చిన డికె అరుణకు జాతీయ స్థాయిలో పదవిని ఇచ్చింది. పైగా నాయకుల్లో సిద్ధాంత నిబద్ధత కూడా ఉంటుంది. కేంద్రంలో పార్టీ అధికారంలో ఉండడం కూడా దానికి కలిసి వస్తోంది.

ఆ రకంగా చూసినప్పుడు కాంగ్రెసు అధిష్టానం తన తెలంగాణ నాయకులకు ఏదో రకంగా నచ్చజెప్పి ప్రజల్లోకి దూసుకుపోవడానికి సిద్ధంగా ఉన్న నాయకుడిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించాల్సి ఉంటుంది. అందుకు కొంత త్యాగం చేయడానికి కూడా సిద్ధపడాలి. ఇప్పటికే కొంత మంది నాయకులు ఇతర పార్టీల్లోకి వెళ్లారు. మరో కొంత మంది వెళ్లినా ఫరవా లేదు, కొత్త రక్తాన్ని ఆహ్వానిద్దామనే ధోరణితో వెళ్తే తప్ప సమస్య పరిష్కారమయ్యేట్లు కనిపించడం లేదు. మొత్తం కాంగ్రెసు జాతీయ స్థాయిలోనే సమస్యలను ఎదుర్కుంటోంది. రాష్ట్రాల స్థాయిలో సర్దుబాట్లు, నిర్ణయాల అమలు అంత సులభం కాకపోవచ్చు. అది ఒక రకంగా స్వయంకృతాపరాధమే.