-జాన్‌సన్ చోరగుడి

రంగు రుచి వాసన కంటికి కనిపించే రూపము లేని కరోనా వైరస్ – ‘కోవిడ్ 19’ కాలంలో చిత్రంగా ‘రంగులు’ వార్తల్లో అంశం అయింది! ఆంధ్రప్రదేశ్ లో 2019 జూన్ లో అధికారంలోకి వచ్చిన వై.ఎస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, గ్రామ పంచాయతీల్లో కొత్తగా ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ భవనాలకు తెలుపు, నీలం, ఆకుపచ్చ రంగులు వేసింది. కొందరు అవి పార్టీ రంగులని కోర్టులో సవాలు చేసిన మీదట, కోర్టు ప్రభుత్వాన్ని తప్పు పట్టింది. మూడు నెలల్లో వాటి రంగులు మార్చాలి అని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో ప్రభుత్వం 2020 ఏప్రిల్ చివరి నాటికి సవరణ చర్యలు మొదలుపెట్టింది. ఇందుకోసం ఒక అధికారుల కమిటీని నియమించి వారిని ‘నేషనల్ బిల్డింగ్ యాక్ట్ -2016’ ప్రకారం తదుపరి చర్యలకు ఆదేశించింది. దాంతో ఇప్పటికే ఆ భవనాలకు ఉన్న రంగులతో పాటుగా అదనంగా ‘టెర్రా కొట్ట’ (ఎర్ర మట్టి కుండ) రంగు కూడా వేయాలని నిర్ణయించినట్టుగా వార్తలు వస్తున్నాయి.

 

 

భవనాలు - రంగులు అనగానే మన దేశంలో ముందుగా గుర్తుకు వచ్చేది ఎర్రకోట. ఎందుకంటే, మన దేశం గర్వంగా ఒక రంగు పేరుతో పిలుచుకునే మొఘలాయి చక్రవర్తుల కాలం నాటి ‘హెరిటేజ్’ భవనం ఇది. మరిక్కడి శీతోష్ణ స్థితులు దృష్ట్యా తీసుకున్ననిర్ణయమో ఏమో (ఇంజనీరింగ్ సంబంధిత సాంకేతిక వివరాలు తెలియదు) కానీ, మనకు స్వాత్యంత్రం వచ్చేవరకు కూడా ‘ఎర్ర కోట’ కు కొనసాగింపుగా ఎర్ర జేగురు రంగు (టెర్రా కొట్ట) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన భవనాల రంగుగా వుండేది. బ్రిటిష్ కాలంలో కట్టిన మన జిల్లా కలక్టర్ ఆఫీసులు కూడా ఇప్పటికీ మొఘలాయిల కాలం నాటి భవన నిర్మాణం వర్ణశైలి లోనే ఉన్నాయి. అయితే గడచిన ఏడు దశాబ్దాల్లో సివిల్ నిర్మాణ అంశంలోకి అదనంగా పర్యావరణం, ‘ఈస్తటిక్’ అంశాలు కూడా జత కలిసి క్రమంగాఇప్పటి మన ‘భవన ఆహార్యాల్లో’ మార్పులు మొదలయ్యాయి. ఈ నేపధ్యంలో అధికారంలోకి వచ్చిన వెంటనే వై.ఎస్.ఆర్. పార్టీ ప్రభుత్వం రంగుల్లోకి దిగింది.

 

(ఫోటో: ఎర్రకోట, న్యూఢిల్లీ)

అయితే ఇటువంటి నిర్ణయానికి తమ అంతర్యం ఏమిటి అనేది ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. ఏదేమైనా, ప్రభుత్వ భవనాలకు - రంగులు చర్చ కావడం మాత్రం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటి సారి. వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘ఇందిరమ్మ’ గృహాలకు మూడు రంగుల పట్టీ వేసేవారు. అయితే ఆ రంగులకు ఉన్న సౌలభ్యం వేరు, కాంగ్రెస్ పార్టీ ముందు చూపు కారణంగా ఇటువంటి సమయాల్లో తరచూ అవి జాతీయ జెండా రంగుల్లో కలిసిపోతూ ఉంటాయి. దాంతో మళ్ళీ అదొక పార్టీ రంగుగా ప్రత్యేకం మనకు గుర్తుకు రాదు. రాష్ట్ర విభజన తర్వాత, సదరు మూడు రంగుల పట్టీకి కొనసాగింపుగా తెలుగు దేశం ప్రభుత్వం కట్టిన కొత్త కాలనీలకు - ‘ఎన్టీ. ఆర్. నగర్’ అని పేరు పెట్టారు. కానీ కార్పోరేట్ భవన శైలితో గత ప్రభుత్వం నిర్మించిన ‘అన్న క్యాంటీన్’ భవనాల విషయంలో మాత్రం రంగు పడింది! అయితే అప్పటి ప్రతిపక్షం వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ దాన్ని పట్టించుకోలేదు. అయినా ఇటువంటివి మనకు కొత్త కాదు. అయితే ఇప్పుడు ఇక్కడ విషయం లబ్దిదారుల గృహాలు కాదు. ఇవి గ్రామ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామ సచివాలయ భవనాలు. ప్రభుత్వ కార్యాలయాలు అన్న తర్వాత అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు తమ అవసరార్ధం అక్కడికి వస్తారు.

 

(ఫోటో: పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఏలూరు)

అటువంటప్పుడు మరి ఆ భవనాలకు ఒక పార్టీ రంగు ఉండడం ఎలా ఆమోదయోగ్యం అవుతుంది? ఆ పార్టీ కానివారు పరిస్థితి ఏమిటి? వారు దాన్ని ఆమోదిస్తూనే, సరే గవర్నమెంట్ ఆఫీస్ లోకి కదా మనం వెళుతున్నది అనుకోవాలా? త్వరపడి ఇటువంటి నిర్ణయం తీసుకుని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిన వారి ‘కామన్ సెన్స్’ కు మనం వదిలి పెట్టవలసిన విషయమిది. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ ఎన్.టి.రామారావు కొత్తగా ప్రాంతీయ పార్టీ పెట్టినప్పుడు, తన పార్టీ జెండా రంగులు - ‘తెలుగింటి గుమ్మం గడప’ నుంచి ఆయన తీసుకున్నారు. అదే మాట కొత్తలో ఆయన ఎంతో ‘డ్రమాటిక్’ గా బహిరంగ సభల్లో కూడా చెప్పేవారు. తెలుగువారు గుమ్మానికి పులిమే పసుపు, దాని పైన పెట్టే ఎర్రటి కుంకుమ బొట్లు తన జెండా రంగుకు ఆయనకు స్పూర్తి అయ్యాయి. అలా ఎంపిక చేసిన ఆ రంగుల ‘కెమిస్ట్రీ’ ఆపార్టీ జనం మనస్సులో స్థిరపడడానికి తొలి నాళ్లలో నిశబ్దంగా ఉపకరించింది. అయితే, దాన్ని గోడల మీదికి తీసుకురావాల్సిన అవసరం అప్పట్లో ఎన్టీఆర్ కు లేకపోయింది. ఎందుకంటే, అప్పట్లో ప్రభుత్వ భవనాలు రోడ్లు - భవనాలు శాఖ కట్టేది, వాటి గోడలు (అప్పటికే) ‘గోబీ’ రంగు అనబడే ‘పేల్ ఎల్లో’ రంగుల్లోనూ, గోడలకు నేల నుంచి కిటికీ ఎత్తు వరకు జేగురు ఎరుపు రంగు ఉండేవి. దాంతో ప్రచార యావ ఆపార్టీకి కొంచెం ఎక్కువున్నప్పటికీ అప్పట్లో వాళ్లకు ఆ అవసరం పడలేదు. 

 

(ఫోటో: గతంలో ఆర్ అండ్ బీ శాఖ నిర్మించిన ప్రభుత్వ కార్యాలయం)

ప్రజాజీవితంలోకి మనం ఒక ‘నిర్మాణం’ ‘ఫ్లోట్’ చేయాలని అనుకున్నప్పుడు, దాని లక్ష్యం ఏమైనప్పటికీ తొలుత కమ్యునికేషన్ పరంగా దానికి ఒక ‘కలర్ థీం’ ప్రాధమిక అవసరం, ఇది కొత్త ఏమీ కాదు. అయితే నలభై ఏళ్ళనాటి పసుపు-ఎరుపు రంగులు గురించి మళ్ళీ ఇప్పుడు మాట్లాడుకోవడం - చరిత్ర. అప్పుడున్న తెలంగాణ ఇప్పుడు మనతో లేదు. రాష్ట్ర విభజనకు ముందు ఏ.పి. నుంచి మరొక ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించి గత ఏడాది అది ప్రభుత్వ పగ్గాలు కూడా చేపట్టింది. అది తన పరిపాలనా సంస్కరణలో భాగంగా రాష్ట్రంలో గ్రామ సచివాలయలను ప్రారంభించింది. తెలుగునాట ప్రాంతీయ పార్టీల ‘ఎరా’ ప్రారంభం అయిన ఇన్నేళ్ళ తర్వాత మరొక కొత్త పార్టీ వచ్చి అది గోడలకు - తెలుపు, నీలం, ఆకూ పచ్చ రంగులు వేసింది. అయితే మరి అప్పట్లో తన పార్టీ రంగులు గురించి ఎన్టీఆర్ చెప్పినంత ‘డ్రమాటిక్’ శైలిలో కాకపోయినా, ఇప్పుడు కూడా ఎవరో వొకరు ఈ ప్రభుత్వం రంగుల తాత్పర్యం ఇది అని చెప్పాలి కదా, మరి ఈ నిశబ్ధం ఏమిటి? చెప్పిన తర్వాత దానితో అందరూ ఏకీభవిస్తారా లేదా అనేది వేరే సంగతి.

 

(ఫోటో: సీఎం జగన్ ఆశీస్సులు అందుకుంటున్న విలేజ్ వాలంటీర్)

కనీసం అటువంటి నిర్ణయం తీసుకోవడానికి, దాని వెనుక ఉన్న తమ ఉద్దేశ్యం చెప్పడానికి ముందుగా ఒక ప్రయత్నం ఏది? అది జరిగితే కొంత ‘టైం’ పట్టొచ్చు కానీ, అందుకు ఆమోద దిశలో ఒక ‘ప్రాసెస్’ ఐతే నెమ్మదిగా మొదలవుతుంది. కానీ అటువంటి ప్రయత్నం ఇప్పటికీ జరుగుతున్నట్టు లేదు. ఇందుకు అవసరమైన ‘థింక్ ట్యాంక్’ కసరత్తులోనే ఎక్కడో ఏదో అస్పష్టత ఉన్నట్టుగా ఉంది. ‘లైవ్ మింట్’ ఆంగ్ల పత్రిక దీనిపై గత ఏడాది ఒక కధనం రాస్తూ పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం గురించి వివరణ కోరినప్పుడు సంబంధిత అధికారులు దీనిపై స్పందించడానికి నిరాకరించారు అని రాసింది. ఈ సందర్భంగా ఇటీవలి విషయం ఒకటి చెప్పాలి. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ 2015 అక్టోబర్ లో అమరావతిలో రాజధాని శంఖుస్థాపన చేయడానికి వస్తున్నారు. అందుకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రధాన కార్యక్రమం మొత్తం నిర్వహిస్తున్న సి.ఆర్. డి.ఏ. (క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ) కార్యాలయంలో ప్రతి రోజు ఏర్పాట్లు గురించి సమీక్షా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధాన మంత్రి సభ జరిగే గ్రామం గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంది.

 

(ఫోటో: క్షేత్రస్థాయి విధుల్లో విలేజ్ వాలంటీర్లు)

ఆ ఎం.పి. డిల్లీ నుంచి ఒకరోజు సి.ఆర్.డి.ఏ. మీటింగ్ కు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ... ‘ప్రధాని శంఖుస్థాపన చేయగానే గాల్లోకి వందల కొద్దీ... నీలి రంగు, ఆకుపచ్చ రంగు బెలూన్లను మనం ఆకాశంలోకి వదలాలి. ‘బ్లూ & గ్రీన్ క్యాపిటల్ మన సి.ఎం. గారి కాన్సెప్ట్’ అన్నారు. వెంటనే మళ్ళీ ఆయనే – ‘వద్దులెండి అది వేరే పార్టీ రంగు...’ అన్నారు. ఐదేళ్ళ తర్వాత అదే పార్టీ ప్రభుత్వ భవనాల గోడలకు వేయించిన అవే రంగులు ఇప్పుడు వివాదమయింది. రంగులకు మనకు ప్రాకృతిక మూలం ఇంద్రధనుస్సు. అందులోని సప్తవర్ణాలను ఆయా రంగుల ఆంగ్ల నామం మొదటి అక్షరాలతో ‘విబ్జియార్’ (VIBGYOR) అంటారు. ‘వైలెట్’ – ‘ఇండిగో’ – ‘బ్లూ’ – ‘గ్రీన్’ – ‘ఎల్లో’ – ‘ఆరేంజ్’ – ‘రెడ్’ ఇదీ వరస. ఎటువంటి ‘థీం’ కోసం అయినా ఏ కొత్త రంగుల ‘షేడ్స్’ అవసరం అయినా అందరూ వాటిని ఈ ఏడు రంగులు నుంచి తీసుకోవాల్సిందే.

 

ఇండియాలో 20 వ శతాబ్దిలో ప్రజాబాహుళ్యంలోకి ప్రతీకాత్మక సందేశం కోసం మనం తెచ్చుకున్న రంగులైన – ఎరుపు, నీలం, అరేంజ్, గ్రీన్ ‘విబ్జియార్’ లోని డైరెక్ట్ రంగులు కావడం విశేషం. పై నాలుగు రంగులు నాలుగు వేర్వేరు ‘పొలిటికల్ ఫిలాసఫీ’ లకు ప్రతీకాత్మకం అని కనుక మనం అనుకుంటే, అందుకు మనం ఎంపికచేసుకున్న రంగులు ప్రకృతిలోని సహజ వర్ణాలు కావడం ఇక్కడ విశేషం. ఆయా వర్ణాలు వాటి చుట్టూ వచ్చిన సాహిత్యం ప్రభావంతో వాటి తాత్వికత సాంద్రత ప్రజల మనసుల లోతుల్లోకి ఇంకడాన్ని కూడా ఇక్కడ తక్కువ చేసి చూడలేము. ఇక ఏడు రంగులు కలిస్తే - అది తెలుపు కావడం దానికి తార్కిక ముగింపు!

స్థూల అర్ధంలో దక్కన్ పీఠభూమిలో భాగమైన తెలంగాణ మననుండి విడిపోయాక, ఆంధ్రప్రదేశ్ ఆత్మను మున్ముందు మనం వెతుక్కోవలసింది తూర్పుకనుమలలోనే. ఇక 970 కి.మీ. పొడవున్న సముద్ర తీరం, నెల్లూరు వద్ద ఉన్న పెన్నా నుంచి... శ్రీకాకుళం వద్ద మహేంద్ర తనయ వరకు ప్రవహించే పలు జీవనదులు, ఈ ప్రాంతానికి జీవాధారమైన పాడిపంటలు, పండ్లతోటలు, సముద్ర ఉత్పత్తులు ఈ మొత్తాన్ని తమ జీవికగా మలుచుకున్న పాత తరాలు క్రమక్రమంగా అంతరించిపోతున్న కాలమిది.

 

 

గడచిన పాతికేళ్లలో క్రియాశీలంగా మారిన ఆధునిక యువత జీవన శైలి వేర్వేరు ప్రభావాల కారణాలతో ఈనాడు నేల విడిచి సాము చేయడం మనకు తెలుసు. ‘కరోనా’ కష్ట కాలంలో కూడా ఎన్ని వొడుడుకులు వచ్చినప్పటికీ, నికరంగా నిబ్బరంగా నిలబడి దేశ అర్దికతను ఆదుకుంటున్నది మన గ్రామీణ వ్యవసాయ ఉత్పత్తులే. అదే విషయాన్ని రేపటి తరానికి దృశ్యమాన సందేశంగా చెబుతాయి ఈ గోడల మీది నాలుగు వర్ణాల్లోని - మట్టి (భూమి) ఆకుపచ్చ (పంటలు) నీలం (చేపలు) తెలుపు (పాలు) వర్ణాలు. ఇక ఇప్పటికే ఉన్న పాత మూడు రంగులకు కొత్తగా ‘మట్టి రంగు’ వచ్చి చేరడంతో, గ్రామీణ జీవన శైలి చక్రం సంపూర్ణం అయినట్టయింది. తొలి కాన్పు వేళ తల్లి పడకగది గోడ మీద పండంటి బిడ్డ బొమ్మలు ఉంచుతారు. రాష్ట్ర ప్రజానీకం మనోనేత్రాల ముందు మరి ఈ వర్ణ చిత్రం కూడా అటువంటిదేనా?

ట్యాగ్ లైన్: ‘కోవిడ్ 19’ – నరేంద్ర మోడీ - ఎన్టీఅర్ – వై.ఎస్. రాజశేఖర రెడ్డి – గ్రామ సచివాలయాలు