- జాన్ సన్ చోరగుడి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులు పరిశీలించడానికి 2020 శివరాత్రికి ముందురోజు నల్లమల అడవుల ముఖద్వారం డోర్నాల వద్దకు వెళ్లారు. ‘ఈస్ట్రన్ ఘాట్స్’ గా వ్యవహరించే తూర్పు కనుమల పాదాల వద్ద ఉన్న ఈ ప్రాంతం విభజిత ఆంధ్రప్రదేశ్ నడుమ ఉన్న అతి సున్నితమయిన ప్రదేశం. ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి ప్రమాదవశాత్తు నల్లమల అడవుల్లో మరణించిన కర్నూలు జిల్లా వెలిగోడు మండలంలోని రుద్రకొండ వద్ద ఉన్న పావురాలగుట్టకు ఈ వెలిగొండ ప్రాజెక్టు సమీప ప్రాంతం.

 

 

అయితే, ముఖ్యమంత్రిగా శ్రీ వై.ఎస్. రాజశేఖర రెడ్డి జీవించివున్న రోజుల్లో నక్సలైట్లుతో ప్రభుత్వం చర్చలకు సిద్దం అన్నప్పుడు, ‘మీడియా’ సాక్షిగా వాళ్ళు అడివిలో నుండి బయటకు వచ్చింది, చర్చలు ముగిసాక, వాళ్ళు తిరిగి ‘లోపలికి’ వెళ్ళింది ఆ ప్రాంతంలోనే. మా ప్రభుత్వం మీతో మాట్లాడుతుంది అని నక్సలైట్లను ఆహ్వానించింది, ఆ ప్రాంతాన్ని ప్రధాన స్రవంతితో కలపడానికి వెలుగొండ ప్రాజెక్టుకు ఆయన శంఖుస్థాపన చేసింది; ఇవి రెండూ జరిగింది, 2004 లో వై.ఎస్. ముఖ్యమంత్రి అయిన మొదటి ఆరు నెలల్లోనే.

 

 

‘యాటిట్యూడ్ ఈజ్ ఎవ్విరీథింగ్’ (మన దృక్పధమే సమస్తమూ...) అనే ఆంగ్ల నానుడిని ఇక్కడ గుర్తుచేసుకోవడానికి, ఇంతకంటే మంచి సందర్భం ఏముంటుంది? నిజానికి ఈ ప్రాజెక్టును 1996 మార్చి 5 న అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొదటిసారి శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టును 5 సంవత్సరాలలో పూర్తి చెయ్యాలని అప్పట్లో లక్ష్యం పెట్టారు, కాని 2000 మే చివరి వరకు కనీసం అనుమతులు కూడ రాలేదు.

 

 

చివరికి 2001 లో సాంకేతిక సలహా కమిటీ వేశారు. ఇంతలో 2004 ఎన్నికలలో తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయింది. వై.యస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, 2004 అక్టోబరు 27న నల్లమల ముఖద్వారం గొట్టిపడియ దగ్గర దీనికి శంకుస్థాపన చేసి, వెంటనే ఆయన నిధులు విడుదల చేశారు. అప్పటికి 1996 లో 980 కోట్ల అంచనాగా ఉన్న ప్రాజెక్టు విలువ 2005 నాటికి 5,500 కోట్లకు చేరింది. అయినప్పటికీ వై. ఎస్. చొరవతో 2014 నాటికి 5 ప్రధాన కాలువలు 80% పూర్తి అయ్యాయి. మూడు ఆనకట్టలు పూర్తి చేశారు. కాని నీటిని నది నుంచి అడవిని దాటి మైదానానికి తీసుకు రావలసిన సొరంగాల పనులు ఇంకా పూర్తి కాలేదు.

 

 

అప్పట్లో వై.ఎస్. రాజశేఖర రెడ్డి చొరవతో కేంద్ర నీటి సంఘం అనుమతి ముందుగా తీసుకోకుండానే ఈ ప్రాజెక్టు మొదలు పెట్టారు. ఆ తర్వాత వాళ్ళ అభ్యంతరాలు అన్నిటికీ వివరణ ఇచ్చి, ఆయన పని వేగవంతం చేసారు. అదే ఏడాది వెలుగొండ కంటే ముందే, పులిచింతల ప్రాజెక్టుకు వై.ఎస్. శంఖుస్థాపన చేసారు. గుంటూరు జిల్లాలో మైదాన ప్రాంత నక్సలిజానికి ఈ పులిచింతల ప్రాజెక్టు ప్రాంతం ప్రధాన ఆవాసం. కృష్ణా నదికి కుడివైపున గుంటూరు జిల్లాలో వై.ఎస్. భూమి పూజ చేసిన రోజున, నదికి ఎడమ వైపు సూర్యాపేట సరిహద్దుల్లో ప్రాజెక్ట్ కంట్రాక్టర్ పాకల్ని తెలంగాణ ఉద్యమ ఆందోళనకారులు సభ జరుగుతూ ఉండగానే తగలబెట్టారు. అటువంటి ఉద్రిక్తతలు మధ్య 2013 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు ప్రారంభం కూడా పూర్తి అయింది. మన ‘దృక్పధమే సమస్తం’ అంటున్న కారణమిదే.

 

 

మధ్య కోస్తాలో తూర్పుకనుమల పాదాలవద్ద నల్లమల అడవుల అంచుల్లో గుంటూరు, నెల్లూరు, కర్నూలు, జిల్లాల్లోని కరువు ప్రాంతాల్ని కలుపుకుని, 1970లో ‘ప్రకాశం’ ఒక జిల్లా అయింది. జిల్లాకు తూర్పున ఉన్న సముద్ర తీరం, మెడ్రాస్-  కలకత్తా జాతీయ రహదారి, రైల్వే లైన్ కారణంగా కొంత భాగానికి మేలు జరిగినప్పటికీ, ప్రకాశం జిల్లా పశ్చమ ప్రాంతం పెద్దగా మెరుగుపడిన పరిస్థితి అయితే ఇప్పటికీ లేదు. మన మేలుకు పరిస్థితులు అన్నీ కలిసొచ్చి 2014 లో రాష్ట్ర విభజన జరిగాక, ఇప్పుడు ఈ ప్రాంతం మీద ప్రభుత్వం ‘ఫోకస్’ పడింది గానీ, లేకుంటే ఈ ప్రాంత పరిస్థితిని వూహించడం కష్టం. 

విభజన జరగడానికి పదేళ్ళ ముందు ప్రభుత్వం నక్షలైట్లతో చర్చలు అంటే, వాళ్ళు ఎక్కణ్ణించి బయటకు వస్తారో, అని సర్వత్రా ఉత్సుకత నెలకొన్న పరిస్థితుల్లో, అందరి అంచనాలకు భిన్నంగా (అప్పటికి తెలంగాణ మనతో కలిసి ఉంది) రాష్ట్రానికి మధ్య ఉన్న ఆత్మకూరు - డోర్నాల ప్రాంతం వాళ్ళ రాక - పోకలతో ఉలిక్కిపడింది అంటే, ఆ ప్రాంత ఆర్ధిక-సామాజిక పరిస్థితి తీవ్రత లోతులు మనకు అవగతం కావాలి. రాష్ట్ర విభజన తర్వాత, ఏర్పడ్డ తొలి ప్రభుత్వం ఆ సమీపానే ‘టవర్ల’ రాజధాని నగరం నిర్మించాలి అనుకున్నది.

 

(ప్రతీకాత్మక చిత్రం)

చర్చల కోసం పదిహేను ఏళ్ల క్రితం ఆ ప్రాంతం నుండి బయటకు వచ్చిన వాళ్ళు తిరిగి అక్కడే ‘లోపలికి’ వెళ్ళాక, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అక్కడే ‘లోపలికి’ వెళ్ళడం అనేది ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్న అంశం. ఏ.బి. వాజపేయి ప్రధానిగా ఉండగా 2000 సం. నాటి నుండి హిందీ బెల్ట్ కు పెడగా దేశానికీ ఆగ్నేయాన ఉన్న రాష్ట్రాలు, ఒక్కొక్కటీ చిన్నవిగా అవుతున్న క్రమంలో, జరుగుతున్న ప్రక్రియను కనుక మనం దగ్గరిగా పరిశీలిస్తే; తధ్యం అది రాజ్యం తనకి తానుగా ‘లోపలికి’ వెళ్ళడమే. 

నిజమే, తండ్రి శంఖుస్థాపన చేసిన ప్రాజెక్టు వద్ద, ఇప్పుడు కుమారుడు ముఖ్యమంత్రి హోదాలో ప్రాజెక్టు సొరంగం ‘లోపలికి’ వెళ్ళడం అనేది, దృశ్యమానంగా మనకు అక్కడ కనిపిస్తూ ఉండవచ్చు. కానీ చూడ్డానికి అక్కడ అంతకు మించి ఇంకా ఎంతో వుంది. ఇప్పటివరకు రాజ్యం ‘లోపలికి’ వెళ్ళక, ‘ఓపెన్’ కాని చాలా కొత్త ప్రాంతాలను, ఈ ప్రభుత్వం విద్య, వైద్యం, పేదలకు గౌరవ ప్రదమైన జీవనం ఇస్తూ, చేస్తున్న ‘ఓపెన్’ కు ఇదొక ఆరంభం మాత్రమే.

 

 

అధికారంలోకి వచ్చిన వెంటనే, తూర్పు కనుమల్లో బాక్సైట్ తవ్వకాల మీద ఈ ప్రభుత్వం నిషేధం విధించింది.రాజమండ్రి జంక్షన్ నుండి రంపచోడవరం, కొయ్యూరు, చింతపల్లి, లంబసింగి, పాడేరు, అరకు, బౌదర, తాడిపూడి, విజయనగరం చేరుకునేట్టుగా రూ.1,500 కోట్లతో 406 కిమీ. మేర 516 – E పేరుతో జాతీయ రహదారి రాబోతున్నాయి. తూర్పు కనుమల గర్భంలోకి ప్రవేశిస్తున్న జాతీయ రహదారి ఇది. ఇక అరుకులో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రతిపాదన ఇప్పటికే పరిశీలనలో ఉంది. 

 

 

కాగా పిబ్రవరిలో లక్నోలో జరిగిన ‘వరల్డ్ డిఫెన్స్ ఇండస్ట్రీ సమ్మిట్’ తర్వాత వెలిగొండ ప్రాజెక్టు ప్రాంతానికి సమీపాన, దొనకొండ వద్ద ఉన్న ప్రభుత్వ భూముల్లో ‘డిఫెన్స్ ఇండస్ట్రి క్లస్టర్’ ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. ఇక్కడే ఉన్న బ్రిటిష్ కాలం నాటి ‘ఎయిర్ స్ట్రిప్’ సమీపాన రానున్న ఏయిరో స్పేస్ ఇండస్ట్రీ, త్వరలో వినియోగంలోకి రానున్న 309 కి.మీ. నడికుడి – శ్రీకాళహస్తి కొత్త రైల్వే లైన్, విజయవాడ- నంద్యాల మధ్య రైల్వే లైన్ డబ్లింగ్ పూర్తికావడం, నిర్మాణంలో ఉన్న అమరావతి – అనంతపూర్ రోడ్డు మార్గం, ఇవన్నీ కూడా ‘వెలుగొండ’ ప్రాజెక్టు పూర్తి అయ్యాక, సాగులోకి రానున్న 4,47,300 ఎకరాల సాగు భూముల్లో పండే వ్యవసాయ ఉత్పత్తులకు ఇకముందు వొక ‘వాల్యు ఎడిషన్’ అవుతుంది. కృష్ణా నది సహజ ప్రవాహాన్ని శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువన దారి మళ్ళించి (అమెరికా, జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న యంత్రాలతో) నల్లమల అడవుల గర్భంలోపల నుండి కొండకు వేసిన సొరంగ మార్గం ద్వారా, త్వరలో నదీ జలాలు ఇకముందు రాష్ట్రం నడిబొడ్డున ఉన్న నిత్య కరువు ప్రాంతానికి తరలివస్తాయి.

 

(ప్రతీకాత్మక చిత్రం)

తూర్పు కనుమల్లో నల్లమల అరణ్యం అంచుల్లో ఇప్పటివరకు సాగు జలాలు అందని ఇంత పెద్ద విస్తీర్ణం ఇకముందు సాగులోకి వస్తుంది. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలలోని 30 మండలాలోని 15.25 లక్ష మంది ప్రజలకు తాగునీరు సాకర్యం లభిస్తుంది. ఈ ప్రాంతంలో ఫ్లోరోసిస్ సమస్య తీవ్రంగా ఉంది. పైన ప్రస్తావించుకున్న 15 ఏళ్ల కాలానికి, ‘విభజన’ అనంతరం పెరిగిన ‘రాజ్యం’ దృష్టి వల్ల ఏకకాలంలో ఈ ప్రాంతంలో జరిగే అభివృద్ధి మధ్యకోస్తా ప్రాంతానికే కాకుండా రాయలసీమ జిల్లాలను కూడా ప్రభావితం చేస్తుంది. ప్రతిపాదిత ‘మెరైన్ బోర్డ్’ కూడా వచ్చాక రామాయపట్టణం, దుగ్గరాజపట్టణం,  పోర్టులతో నౌకా రవాణా కోసం అనుసంధానం అయ్యే ఈ ప్రాంతం రూపురేఖలు చాలా తక్కువ కాలంలో మారిపోతాయి అనడంలో ఎంతమాత్రం ఆశ్చర్యం లేదు.