కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత బిజెపి కేంద్ర ప్రభుత్వంపై సమరం విషయంలో చల్లబడినట్లు కనిపిస్తున్నారు. నియంత్రిత సాగు విధానాన్ని రద్దు చేసి, పరోక్షంగా వ్యవసాయ బిల్లులకు మద్దతు ప్రకటించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నియంత్రిత సాగుపైనే కాకుండా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లులపై వెనక్కి తగ్గారు. ఒక్క రకంగా యూటర్న్ తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మక రీతిలో నియంత్రిత సాగు విధానాన్ని ప్రకటించిన ఆయన కొద్ది రోజుల్లోనే వెనక్కి తగ్గారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కేసీఆర్ తీవ్రంగా గళమెత్తారు. టీఆర్ఎస్ శ్రేణులు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఆందోళన కూడా చేపట్టాయి.
తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో పాటు మంత్రులు, టీఆర్ఎస్ నేతలు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ధర్నాలు చేశారు. బిజెపి నేతృత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి కేసీఆర్ సిద్ధపడినట్లు కనిపించారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీ వెళ్లారు.
కేంద్ర ప్రభుత్వంపై సమరానికి సిద్ధఫడిన కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత పూర్తిగా సిద్ధపడ్డారు. ఆ తర్వాతే ఆయన నియంత్రిత సాగు విధానాన్ని రద్దు చేశారు. వ్యవసాయ బిల్లులపై మౌనం వహిస్తున్నారు. పైగా, నియంత్రిత సాగు విధానాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం పంటలను కొనుగోలు చేయదని ప్రకటిస్తూ రైతులు తమ పంటలను ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటును కేంద్రం కల్పిస్తోందని ప్రకటించారు. ఆ రకంగా కేసీఆర్ వ్యవసాయ బిల్లులపై వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నారు.
ప్రధాన మోడీతో పాటు కేంద్ర హోం మంత్రి, ఇతర కేంద్ర మంత్రులను కేసీఆర్ ఢిల్లీలో కలిసిన తర్వాత పూర్తిగా తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తున్నారు. కేంద్రంపై యుద్ధం చేసే తన వైఖరి నుంచి వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నారు. ఇందులోని మతలబు ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ కేంద్రంపై యుద్ధం చేయడం నుంచి వెనక్కి తగ్గడం వెనక పెద్ద రాజకీయమే జరిగిందని భావిస్తున్నారు.
కేసీఆర్ మీద బిజెపి పెద్ద యెత్తున రాష్ట్రంలో సమరానికి సిద్ధమైంది. కేసీఆర్ ను రాజకీయంగా అన్నివిధాలుగా ఎదుర్కోవడానికి సిద్ధపడింది. ఈ స్థితిలో ఆయన ఢిల్లీ వచ్చి వచ్చారు. తన వైఖరిని మార్చుకున్నారు. ఈ స్థితిలో తెలంగాణలో బిజెపి కేసీఆర్ సమరం సాగించే విషయంలో వెనక్కి తగ్గుతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి.
గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విషయంలోనూ అదే జరిగింది. సోము వీర్రాజు ఆంధ్రప్రదేశ్ బిజెపి శాఖ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన వెంటనే జగన్ మీద పెద్ద యెత్తున్న ఆందోళనలకు శ్రీకారం చుట్టారు దేవాలయాల్లో విధ్వంసం వంటి అంశాలను తీసుకుని జగన్ ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు. వైఎస్ జగన్ ఆ తర్వాత ఢిల్లీ వెళ్లడంతో బిజెపి ఆంధ్రప్రదేశ్ బిజెపిలో మార్పు స్పష్టంగా కనిపించింది.
వైఎస్ జగన్ ను ఎదుర్కునే తన పోరాట పటిమలో పదునును, వాడినీ వేడినీ తగ్గించింది. జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం వరకు మాత్రమే పరిమితమైంది. ఆందోళనల నుంచి వెనక్కి తగ్గింది. ఇదే తెలంగాణలోనూ కేసీఆర్ విషయంలో జరగబోతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 28, 2020, 4:51 PM IST