కాశిలో ఒక పూజారి “మీరేక్కడినుంచి వచ్చారూ?” అన్న ప్రశ్నకు జవాబువ్వడంతో నా నగరం, రాష్ట్రం వైద్య పరంగా ఎంత ప్రాముఖ్యత  గలదో గుర్తు చేసుకునేలా చేసింది. ఆదాబ్ హైదరాబాద్. మన భాగ్యనగరానికి వందనం. 

-కందుకూరి రమేష్ బాబు  

+++

గతనెల కాశీకి వెళ్లి, అక్కడి మహిమ గురించి తెలుసుకుని విస్మయానికి లోనవుతుండగా, సుందరమైన ఆ కాశి ఘాట్స్ పై నడుస్తూ ఆ స్థలమహత్యం గురించిన ఆలోచనల్లో ఉండగా ఒక పూజారి దగ్గరకు రమ్మని సైగ చేశాడు. వెళ్లాను. వారు స్థానికులే.. నా రూపురేఖలను బట్టి తాను నన్ను కేరళ వాసి అనుకున్నారు. కాదని తెలిశాక “మీ హైదరాబాద్ గురించి నాకు తెలుసు” అన్నారు. “మీ దగ్గరి ప్రత్యేకత లేమిటో చెప్పాలా?” అని కూడా అన్నారాయన. వారి కుతూహలం ఎంత ఆసక్తిని రేకెత్తించిందీ అంటే, ఒక్కొక్కటిగా వారు చెబుతుంటే, ‘వారుణ’, ‘అసి’ నదులు గంగలో సంగమించే స్థలి ఐన వారణాశి ప్రత్యేకతల నుంచి మూసి నది ఒడ్డున నిర్మాణమైన మన హైదరాబాద్ గొప్పతనం దాకా, ఇంకా ఆ విశిష్టతల మధ్య ఉన్నట్టే ఉన్నది, ఇప్పటికీనూ. 


మొట్ట మొదలు “మీ హైదరాబాద్ లో విష జ్వరాలు తగ్గించేందుకు కోరంటి హాస్పిటల్ ఉంది కదా“ అన్నారాయన. అవునన్నాను. “టీబీ కోసం చెస్ట్ హాస్పిటల్ ఉన్నది కదా” అన్నారు. అవునన్నాను. “అక్కడే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఉంది కదా” అన్నారు. “నిజమే” అన్నాను. అలాగే, “పెద్ద క్యాన్సర్ హాస్పిటల్ ( బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ ) కూడా ఉంది కదా” అన్నారు. అవునన్నాను. “మంచి కంటి ఆసుపత్రి ( ఎల్వీ ప్రసాద్ ) కూడా మీ దగ్గర ఉంది కదా” అన్నారు. వీటితో పాటు, పాతబస్తీలో ఉన్న యునాని ఆస్పత్రిని కూడా అయన గుర్తు చేశారు. అంతేకాదు, “ఉబ్బసానికి చేప మందు కూడా మీ దగ్గర ఇస్తారు కదా” అన్నారు. అయన ధోరణి విస్మయమానికి గురి చేసింది. విచిత్రంగానూ అనిపించింది.  

నిజానికి తాను చెప్పిన ఆస్పత్రులన్నీ చాలా కీలకమైన సేవలు అందించేవే. అవన్నీ కూడా దీర్గకాలికంగా ఎంతగానో బాధపెట్టే వ్యాధులకు సంబంధించినవే. ఆయా వ్యాధులు మానసికంగానూ, శారీరకంగానూ మనిషిని ఎంతగానో భాధించేవే. దురదృష్టవశాత్తూ ఆయా రోగాల బారిన పడిన వారు ఎంతగానో కృంగిపోతారు. నిరాశా నిస్పృహల బారిన పాడుతారు. “ఏం పాపం చేశామని మాకీ వేదన” అని ఎంతగానో పరితపిస్తారు. ఆవేదనకు గురవుతూనే ఆరోగ్యం కోసం ఎక్కడ మంచి చికిత్స లభిస్తుందా అని అన్వేషిస్తారు.  అక్కడకు వెళతారు.

వైద్యపరమైన చికిత్స తీసుకుని ఆయా వ్యాధుల నుంచి భయట పడేవాళ్ళు పడతారు. మరికొందరు ఏ విధంగానూ కోలుకోలేక అనారోగ్యంతో ప్రాణాలు విడుస్తారు కూడా.

ఐతే, అటు వైద్యం చేయించు కొంటూనే దేశంలోని వివిధ ఆలయాలను దర్శించి తమను ఈ శారీరక మానసిక వ్యాధుల నుంచి స్వస్థత పొందేందుకు భగవత్ కృపకోసం ప్రార్థించడమూ ఉన్నదే. ఇక హిందువులకైతే కాశి ఉండనే ఉన్నది. తమ పాపాలను కడిగేసుకునేందుకు పవిత్ర గంగకు రావడమూ ఉంది. ఇక్కడ మరు జన్మ లేకుండా చూడమని ఆ కాశీ విశ్వేశ్వరుడిని ప్రార్థించడమూ తెలిసిందే. చివరగా అక్కడే ప్రాణాలు విడవాలని కోరుకునే వారూ ఉంటారని మనకు తెలుసు.  

ఇన్ని కారణాల వల్ల కాశీలోని ఆ పూజారికి వైద్యం కోసం ఆశ్రయించే అందులో స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో  తెలుసు.  మానవ ప్రయత్నం విఫలమైతే ఆశ్రయించే చివరాఖరి స్థలమూ తెలుసును. అందుకే అన్నాను, ‘మీ ప్రత్యేకతలు మాకు తెలుసు” అని, చిన్నగా నవ్వుతూ చెప్పారాయన. 

నిజానికి హైదరాబాద్ ఆరోగ్య విషయంలో ఎంత ముఖ్యమైనదో అప్పటిదాకా ఎన్నడూ పెద్దగా ఆలోచించలేదు. పాత్రికేయుడిగా దీన్ని ‘మెడికల్ టూరిజం హబ్’ గా, ‘క్యాపిటల్ అఫ్ హెల్త్ టూరిజం’గా అనుకోవడం తెలుసు గానీ, ఎక్కడెక్కడి నుంచో చవకగా వైద్యం చేయించుకోవాడానికి ఇక్కడకు వస్తారని వినడమే గానీ అతడు చెప్పినది విన్నాక గానీ నన్ను నా నగరం వైపు తిరిగి చూసుకోలేదు.

చూస్తుంటే మెల్లగా ఒక్కోక్కటి కానవస్తోంది. ముఖ్యంగా కరోనా తాకిడి నేపథ్యంలో ఈ నగరంలో చార్మినార్ మొదలు ఉజ్జయిని మహంకాళి ఆలయం దాకా, గతంలో ప్లేగు మహమ్మారి బారిన పడిన వైనం, ఆ వ్యాధులను అధిగమించే క్రమంలో జనజీవితాన అల్లుకున్న స్మారక చిహ్నాలు, ఆలయాలూ కూడా గుర్తుకు వస్తున్నాయి.

1590లో కలరా మహమ్మారి సోకినప్పుడు ఆ వ్యాధి బెడద తగ్గాక నిర్మించిన చార్మినార్ నిజానికి ఈ నగరం నిర్మాణానికి నాలుగేళ్ల ముందు నిర్మాణమైంది. ఒకరకంగా వ్యాధి నివారణ అనంతరం నిర్మించిన అపురూప కట్టడం అది. అలాగే దాదాపు రెండు శాతాభ్దాల ముందు నిర్మించిన శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయం వెనకాల కూడా ప్లేగు వ్యాధి నేపథ్యం ఉన్నది.  ఆ తర్వాత కాశీలోని పూజారి  పేర్కొన్న ‘ఫీవర్ ఆసుపత్రి’ మలేరియా వ్యాధి కారకాన్ని కనుగొన్న సర్ రోనాల్డ్ రాస్ పేరిట ఉన్నదే. అది అంటువ్యాధుల నుంచి రక్షించడానికి ఏర్పాటు చేసిందే. 1915లో ప్లేగు వ్యాధి తిరిగి హైదరాబాద్ ను చుట్టేసినప్పుడే దాని పేరు ‘కోరంటి’ అయింది. నిజానికి నేడు కరోనా కారణంగా వాడుకలోకి వచ్చిన Quarantine దాని అసలు నామం. అది వాడుకలో ‘కోరంటి ఆసుపత్రి’గా మారిందని నేడు గుర్తు చేసుకోవాలి.

ఇట్లా - హైదరాబాదులో ఎన్నో ఉన్నాయి. దగ్గు, అస్తమా వంటి వ్యాధుల నివారణకే కాక జీవ సాంకేతిక పరిశోధనా రంగలో ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ కూడా ఇక్కడే ఉంది. అంతే కాదు, యునాని ఆసుపత్రి సరే, ఈ ఏటికి సరిగ్గా వందేళ్ళు పూర్తి చేసుకుంటున్న ‘జిందా తిలిస్మాత్’ ఇక్కడే తయారవడం మనకు తెలుసు. సామాన్యులకు అందుబాటులో ఉండే ఈ సర్వరోగ యునాని మందు లోగోలో ఆఫ్రికన్ నీగ్రో బొమ్మ ఉంటుంది. అప్పట్లో నిజాం ఆర్మీలో ఆఫ్రికన్లు ఉండేవారు. వాళ్ళు ఆరోగ్యంగా దృడంగా ఉంటారని, ఆరోగ్యా సూచికగా ఆ బొమ్మను వాడటం విశేషం.

ఇట్లా - అన్ని కాలాల్లోనూ హాయిగా జీవించడానికి అనువైన వాతావరణం దక్కనీ పీటభూమి సొంతం. అందులో భాగంగా ఉన్న మన హైదరాబాద్  దేశంలోని పేరొందిన ప్రసిద్ద సంస్థలెన్నిటికో కేంద్రంగా ఉండటం మరో విశేషం. అంతేకాదు, పరిపాలనా విషయంగానూ ఇది దేశానికి రెండో రాజధానిగా ఉండ తగినదని పలుసార్లు ప్రస్తావనకు రావడం కూడా మనకు తెలిసిందే.

‘కరోనా’ కట్టడి విషయంలో అందరం జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ గొప్పతనం గురించి ఎన్నో విషయాలు ఇలా యాదికి రావడం ఒకటైతే, మన రాజధాని నగరం  ఆ మహమ్మారి విషయంలో తీసుకుంటున్న మందు జాగ్రత్త చర్యలతోనూ, అవసరమైన పర్యవేక్షణతోనూ దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుండటం కూడా ఎంతో బాగున్నది.

ప్రజల ఆయురారోగ్యాలకు కేంద్రంగా భాగ్యనగరం ఎల్లప్పుడూ ఇలాగే విలసిల్లాలని కోరుకుందాం. ఈ సందర్భంగా ప్రాణాలు ఫణంగా పెట్టి సేవలు అందిస్తున్న మన వైద్య సిబ్బందికి, ముందు చూపుతో అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రువర్యులకు, స్వచ్చంద సేవలో తమ వంతు కృషి చేస్తూ సామాన్యుల అవసరాలు తీరుస్తున్న వారికీ - పేరు పేరునా వందనం. కృతాజ్ఞతా పూర్వకంగా అభివందనం.

(వ్యాసకర్త ఇండిపెండెంట్ జర్నలిస్టు, ఫోటోగ్రాఫర్)