బిజెపి వ్యతిరేక వైఖరి తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చిన్న లాజిక్ ను మిస్సవుతున్నారా అనే సందేహం కలుగుతోంది. కాంగ్రెసుకు తాను దగ్గరవుతున్నట్లు వస్తున్నట్లు విమర్శలకు ఆయన సమాధానం చెప్పలేకపోవడం వల్ల ఆ సందేహం కలుగుతోంది. 

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో కాంగ్రెసు అభ్యర్థి బికె హరిప్రసాద్ ను సమర్థించడానికి తెలుగుదేశం పార్టీ వంకర దారి వెతుక్కోవాల్సి వచ్చింది. హరిప్రసాద్ బీసీ కాబట్టి సమర్థించామని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి చెప్పారు. కాంగ్రెసు అభ్యర్థికి ఎందుకు ఓటు వేశామనే విషయాన్ని సమర్థించుకోవడానికి అంతకు మించిన కారణం టీడీపీ ఎందుకు చెప్పలేకపోతుందనేది పెద్ద ప్రశ్న

ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని కాంగ్రెసుకు వ్యతిరేకంగా స్థాపించారనే విషయం అందరికీ తెలుసు. కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఆవిర్భవించిన టీడీపీ ఎల్లకాలం అదే వైఖరికి కట్టుబడి ఉండాలా, అలా కట్టుబడి ఉండాల్సిన అవసరం లేకుండా పోవడానికి జాతీయ స్థాయిలో సంభవించిన పరిణామాలు ఏ విధమైన దోహదం చేస్తున్నాయనే ఆలోచన టీడీపీ మేధావి వర్గానికి రావడం లేదా అనేది ప్రశ్న.

ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత జాతీయ స్థాయిలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జాతీయ రాజకీయ కూటములు కూడా వచ్చాయి. కాంగ్రెసు ఆధిపత్యాన్ని నిలువరించడంలో తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాల్లో ఆ ఫ్రంట్స్ ద్వారా నిరంతరం పాటు పడుతూ వస్తోంది. 

అయితే, ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెసు ఆధిపత్యం కొనసాగుతూ వచ్చింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెసుకు ప్రత్యామ్నాయం లేదు. కాంగ్రెసు ఆధిపత్యాన్ని, ఏకఛత్రాధిపత్యాన్ని ఎదిరించడం అప్పుడు ఎన్టీఆర్ తన కర్తవ్యంగా భావించారు. 

ప్రస్తుతం కాంగ్రెసు క్రమంగా బలహీనపడుతూ బిజెపి బలమైన శక్తిగా ఎదిగింది. సంకీర్ణ లక్షణాన్ని కాపాడుకోవడంలో కాంగ్రెసు విఫలం కావడం కారణంగా కూడా బిజెపి బలపడింది. ప్రాంతీయ పార్టీలతో సంకీర్ణం ఓ అంశం కాగా, భిన్న సామాజిక శ్రేణుల సంకీర్ణం మరో అంశం. కాంగ్రెసు పార్టీ భిన్న సామాజిక శ్రేణుల కూడలిగా ఉంటూ వచ్చింది. ఆ భిన్న సామాజిక శ్రేణుల కూడలిని ప్రాంతీయ పార్టీలు విచ్ఛిన్నం చేస్తూ వచ్చాయి. ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చడంలో కాంగ్రెసు చెందిన వైఫల్యం ప్రాంతీయ పార్టీల ఆవిర్భావానికి పురుడు పోసింది. 

ప్రాంతీయ పార్టీలతో యుపిఎ వంటి ప్రయోగాలను కాంగ్రెసు చేసినప్పటికీ మిత్రధర్మాన్ని పాటించడంపై పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. అదే ఫార్ములాతో వచ్చిన బిజెపి జాతీయ రాజకీయాల్లో ఎదుగుతూ వచ్చి, ఇప్పుడు ఏకఛత్రాధిపత్యం వహించే స్థాయికి ఎదిగింది. చంద్రబాబు దృష్టితో చూసినా, ఎన్డీఎ నుంచి తప్పుకున్న ఇతర ప్రాంతీయ పార్టీల దృష్టితో చూసినా గతంలో కాంగ్రెసు వ్యవహరించిన తీరులోనే దాదాపుగా బిజెపి వ్యవహరిస్తోందని చెప్పడానికి వెనకాడాల్సిన అవసరం లేదు.

అయితే, ఎన్టీఆర్ సిద్దాంత బలాన్ని కాంగ్రెసు వ్యతిరేకత అనే అంశానికి పరిమితం చేసి చూడడం వల్ల చంద్రబాబుకు కాంగ్రెసు దోస్తీని సమర్థించుకునే వాదన లభించడం లేదు. కేంద్రంలో ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ పోరాటం చేశారని, కేంద్రీకృత అధికారానికి వ్యతిరేకంగా ఎన్టీ రామారావు పోరాటం చేశారని అర్థం చేసుకుంటే చంద్రబాబుకు సమాధానం దొరికే అవకాశం ఉంది. 

కమ్యూనిస్టులతో స్నేహం చేసిన చంద్రబాబుకు ఆ లాజిక్ దొరకలేదంటే ఆశ్చర్యమే. కేంద్రంలో అధికారంలో ఉండి, ప్రాంతీయ శక్తులను అణచివేతకు పాల్పడుతున్న ఆధిపత్యానికి వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తామని, కేంద్రంలో ఆధిపత్యం చేలాయిస్తున్న బలమైన శక్తిపై పోరాడడానికి బలహీమైన శక్తితో జత కడుతామని చెప్పుకోవడానికి తగిన హేతుబద్ధత ఎన్టీఆర్ పార్టీ సిద్ధాంతంలోనే ఉందనేది గుర్తించాల్సి ఉంటుంది.

- కె. నిశాంత్

(ఈ వ్యాసంలో రచయిత వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఏసియానెట్ న్యూస్ కు సంబంధం లేదు. అందులో వ్యక్తం చేసిన అభిప్రాయాలకు రచయిత వ్యక్తిగతమైనవేనని గమనించాలని మనవి)