-జాన్‌సన్ చోరగుడి

(క్రిస్మస్ ప్రత్యేక వ్యాసం)

మళ్ళీ పండగ సీజన్ మొదలయింది. ‘క్రిస్మస్’ ఆ తర్వాత ‘న్యూ ఇయర్’ కూడా అయ్యాక వచ్చేది పంటల పండగ  ‘సంక్రాంతి’... ఇలా ఇవి వొక వరస. మునుపటికి భిన్నంగా ఇప్పుడు వచ్చేది 2020 కనుక ఈ ఏడు అదొక ప్రత్యేక ఆకర్షణ! అయితే క్రైస్తవుల పండగలు అవి ఉండేది రెండు ‘కేలండర్ ఇయర్స్’ లో వెంటవెంటనే అయినప్పటికీ, ఆ రెండు కూడా భిన్నమైన భావోద్వేగాలతో ఉండడం వొక విశేషం. కొన్ని చోట్ల క్రిస్మస్ కు పెట్టిన భారీ ‘కాలనీ స్టార్స్’ ను ఇంకా అక్కణ్ణించి తీయకుండానే... వాటి పక్కనుంచి ‘గుడ్ ఫ్రైడే’ దీక్షాధారులు తెల్ల బట్టలు ధరించి మెడలో నీలి రంగు కండువాలతో తిరుగుతూ కనిపిస్తుంటారు. అది - బయట నుంచి చూసేవారికి, ఇదేంటీ జీసస్ పుట్టిన వెంటనే మరణమా అన్నట్టుగా ఉంటుంది.

క్రైస్తవులు ఈ పండగ సీజన్ తర్వాత, ఉన్నట్టుండి ఒక్కసారిగా గంభీరంగా అయిపోతారు. ఏవండీ ఏమయింది అంటే, ‘లెంట్ డేస్’... అనేది వారి జవాబు! ఈ కొత్త ధోరణి మొదలైన తర్వాత, ఇప్పుడు వీళ్ళు పెళ్ళిళ్ళు, గృహ ప్రవేశాలు వంటివి ‘లెంట్ డేస్’ కు ముందు గాని లేదా తర్వాత గాని ‘ప్లాన్’ చేస్తున్నారు. ప్రభువు పుట్టిన దినం... అయితే డిసెంబర్ లో సంతోషం ‘సెలెబ్రేట్’ చేసుకుందాం. ప్రభువు సిలువ మరణం విషాదం... అయ్యో, అయితే ఏప్రెల్ లో సంతాపం పాటిద్దాం. ఇదీ ఇప్పుడు సరికొత్త ధోరణి. ఇలా...’క్రిస్మస్’ మాదిరిగానే ‘గుడ్ ఫ్రైడే’ కూడా ఇప్పుడు కొత్తగా క్రైస్తవుల ప్రదర్శన పండగ అయింది. నిజానికి  ఇది తప్పేమీ కాదు. విశ్వాసంలో ఇంకా ప్రాధమిక దశలో ఉన్నవారు ఏదో ఒక దీక్ష పేరుతో, తమ వ్యసనాలకు కొన్నాళ్ళు దూరం కావడం మంచిదే. నిబ్బరం కనుక ఉంటే ఆ నియంత్రణ కొనసాగించవచ్చు. ఆ మేరకు అది ఆ కుటుంబానికి కూడా మంచిదే.

 

ఇదంతా ఒక అంశమైతే, ఇక ‘చర్చి’ విషయం – ఇటీవలి కాలంలో క్రైస్తవ సంఘాలకు ఆదాయం పెరిగింది. విదేశీ విరాళాలు రాక పోతే ఏమి, భూముల విలువ పెరిగి ఒకనాటి చర్చి ఆస్థులు ఇప్పుడు సంపదగా మారింది. చర్చి బిల్డింగ్స్ రీ మోడల్ చేస్తున్నారు. చర్చి చుట్టూ ఉన్న చెట్లు కొట్టేసి షాపింగ్ కాంప్లెక్సులు కట్టి చర్చిల్లో కొత్తగా ఏ.సి.లు పెడుతున్నారు. చర్చికి కార్లలో వచ్చేవారు పెరిగి చర్చి వద్ద ‘పార్కింగ్’ సమస్య పెరిగింది. ప్రతి ఏడు పోయిన ఏడాది కంటే భారీగా పండగ ‘సెలబ్రేట్’ చేయాలని చర్చి కమిటీలు ప్లాన్ చేస్తున్నాయి. ఇదంతా సరే, ఇంతున్నా... మనం సంతోషంగా ఎందుకు లేము, ఉన్నామా? మన జవాబు కనుక... ‘లేదు’ అయితే, ఎందుకని? అనేది ఇప్పటికైనా మన అందరి ప్రశ్న కావాలి. 

మనం సంతోషంగా ఉన్నామా? ప్రతి ‘చర్చి’ ప్రతి క్రైస్తవుని ఇంటా ఇప్పుడు తొలుస్తున్న ప్రశ్న ఇదే. చెట్టుకు పట్టిన మంచులా... మనిషికి పట్టిన చెద మాదిరిగా, నిత్యం మనల్ని ఆనుకుని ఉండే శీతోష్ణ స్థితిలా, ఈ ప్రశ్న వొక కొడవలి మాదిరిగా మన వెన్నంటి ఉంటున్నది. సరే సంపద కూడా సంతోషాన్ని ఇవ్వదు, అనుకొని ఆ విషయాన్ని అక్కడితో ముగిద్దామా? అది ఎలా కుదురుతుంది - ఇప్పటికే ఇదంతా దేవుడు నన్నునా కుటుంబాన్ని ఆశీర్వదించి ఇచ్చింది, అని క్రైస్తవులు నమ్మకంగా చెబుతున్నారు. తమ భౌతిక అభివృద్ధి మొత్తానికి ఆయన్నే వీరు బాధ్యుణ్ణి చేస్తారు. ఇంతా చేస్తే మరి ఆయన ‘ఇచ్చిన’ ఈ సంపద ఇప్పుడు మనల్ని ఇలా ఆత్మవిమర్శ కోర్టు బోనులో, ముద్దాయిగా నిలబెట్టడం ఏమిటి! పోనీ ఈ సంపద విషయం కాస్సేపు పక్కనుంచి, మన కుటుంబ సంబంధాలు విషయం చూద్దాం. 

 

ఏదో తాతల నాటివో తండ్రుల నాటివో ఆస్థుల విలువ పెరిగి, ఎవరి ప్రమేయం లేకుండానే ఇప్పుడు అది కోట్లాది రూపాయలకు చేరింది... అనుకుందాం. మరి ఇవే ఆస్థులు ‘సంపద’ గా మారక ముందు ఉన్న సంతోషాలు సంతృప్తులు ఇప్పుడు రెట్టింపు కావాలి. కదా? మరి కాకపోగా, ఉన్న కుటుంబ సంబంధాల ఆనందం ఆవిరి ఎలా అవుతున్నది! కుటుంబ సంపద సివిల్ వివాదాలకు ఎందుకు దారి తీస్తున్నది? ఇదంతా చూసాక, వొకటి మాత్రం స్పష్టం అవుతున్నది, మన భౌతిక సంపదకు దేవుడు కారణం కాదని. 

మరి మన ‘ఆనందం’ మనం ఎప్పుడు మిస్ అయ్యాం, ఎలా మిస్ అయ్యాం! కనీసం ఆ విషయం కూడా మనం గమనించనంత నిశబ్దంగా అది ఎలా జరిగింది? ఒక సారి వెనక్కి తిరిగి చూసుకోవడానికి, మన వెనక ఇప్పుడు నికరంగా ఇరవై ఏళ్ళు కనిపిస్తున్నాయి. డెబ్బై ఏళ్ళు పైగా బ్రతికే మనిషి వయస్సులో ఇరవై తక్కువ కాలం ఏమీ కాదు. ఇప్పుడు 40 – 60 మధ్య ఉన్న ప్రతి ఒక్కరు గత ఇరవై ఏళ్లలో ఎన్నో కఠిన పరీక్షలకు గురైయ్యారు. ఇంకా చెప్పాలంటే పుటం వేయబడ్డారు... అనడం సరైన మాట. కొందరు అప్పటివరకు తమ ‘చర్చి’ చెప్పిన లేదా తమకు అర్ధమైన విశ్వాసం తమ నిజజీవితానికి అన్వయంకాక తికమక పడ్డారు.

 

గడచిన రెండు దశాబ్దాల్లో యువత ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపించడంలో భారతీయ ‘చర్చి’ ది ఘోర వైఫల్యం. వేలకొద్దీ వీరి ‘పరిశుద్ద వివాహాలు’ ఈనాడు ‘ఫ్యామిలీ కోర్టు’ ఫైళ్ళల్లో మగ్గుతున్నాయి. ఈ కాలంలో ‘చర్చి’ బయట వారితో పాటు ‘చర్చి’ లోపలి వారివి కూడా ఎంతో మంది ముసుగులు తొలిగాయి. మరెంతో మంది ముఖాలకు సరికొత్త ‘మాస్క్’ లు వచ్చాయి. మారుతున్న కాలానికి, అది మన ముందుకు తెస్తున్న సరికొత్త సవాళ్ళను ఎదుర్కోవడానికి తగిన  ‘దృక్పధం’ కొరవడి, ఎంతోమంది క్రైస్తవ బోధకులు వాడకం తేదీ దాటిన మందుల్లా (ఎక్సపైరీ మెడిసిన్) క్రమంగా ‘షెల్ఫ్’ లో నుంచి ‘డస్ట్ బిన్’ కు చేరారు. ఈ ‘కన్ఫ్యూజన్’ మొత్తానికి మన హైదరాబాద్ అప్పట్లో ఒక ‘హాబ్’ అయింది. అప్పటి మన ముఖ్యమంత్రి గెస్టులుగా - బిల్ క్లింటన్, బిల్ గేట్స్ వంటి ప్రపంచ ప్రముఖులు వచ్చిపోతుండేవారు! అది చూసి హైదరాబాద్ కు దూరంగా ఉన్నవారు, అక్కడ ఏదో జరిగిపోతున్నది, మనం దాన్ని ‘మిస్సు’ అవుతున్నామా... అని బెంగ పెట్టేసుకునేవారు.

అప్పుడే 2004 ఫిబ్రవరిలో వరల్డ్ ఎకనమిక్ ఫోరం అధ్యక్షుడు క్లావ్ శ్వాబ్ హైదరాబాద్ వచ్చి - “మనం ఉన్నది చిన్నవాణ్ణి పెద్దవాడు మింగే ప్రపంచంలో కాదు, నెమ్మదిగా మింగేవాణ్ణి వేగంగా మింగేవాడు ఉన్న ప్రపంచంలో” అని ఒక కొత్త మాట అన్నాడు! ఇలా అప్పట్లో మనకు ఏమి కావాలి అనేదానికంటే, మనకు ఏమి అక్కరలేదు, అనేది అర్ధం కావడం కష్టమయింది.  పరుగు సరే, ఆగడం ఎక్కడ? అనేది ఎక్కువ మందికి అర్ధం కాలేదు. ఎందుకంటే ఈ సరళీకరణ కాలంలో అన్నీ వచ్చి మన వొళ్ళో పడ్డాయి. లేకపోవడం వల్ల వచ్చే సమస్య కంటే, అన్నీ అందరికీ అవసరానికి మించి అందుబాటులో ఉండడం ఇప్పుడు సరి కొత్త ప్రమాదమైంది. ‘వాడు నీ కంటే ఎక్కువ తింటున్నాడు, వాడితో సమానంగా తినడం నీ హక్కు’ అనే పిలుపుకుమన చుట్టూ ‘సౌండ్’ ఎక్కువైంది. ‘అందరికీ అన్నీ’ నినాదం అయింది. అయితే ఇదంతా కలిసి మరొక రకమైన వివక్షకు దారి తీసింది. కానీ దీనికి పరిష్కారానికి తెలివి చాలదు, జ్ఞానం అవసరం. ఇప్పుడు అది ఉన్నవాడే ఈ కఠోర పరీక్షలో నెగ్గుకు రాగలుగుతున్నాడు.

(ఫోటో: వరల్డ్ ఎకనమిక్ ఫోరం మాజీ అధ్యక్షుడు క్లావ్ శ్వాబ్)

ఎలాగంటే - వంద వస్తువులు ఉన్న వొక పెద్ద పెట్టె నీ ముందు ఉంచి, అందులోనుంచి నీకు కావలసినవి నువ్వు తీసుకుని వెళ్ళవచ్చు అంటే, వొకడు - వాటిలో నుంచి వొక పది ఎంపిక చేసుకుని వాటిని తీసుకుని ఇవతలికి వచ్చాడు. అతడు లేక ఆమె ఆ పది వస్తువుల్ని వాడుకోవడం మొదలు పెట్టారు, క్రమంగా వాళ్ళు వాటిని పూర్తిగా ఆస్వాదించారు. మరొకరు ఆ పెట్టే నుంచి వొక డెబ్భై తీసుకుని ఇవతలకు వస్తూ... మిగిలిన ముప్పై పెట్టెలోనే వదిలి వచ్చినందుకు ఎంతో చింతించాడు. ఆ వదిలి వచ్చిన ‘ముప్పై’ దిగులు అతణ్ణి ఎప్పుడూ తినేసేది. తెచ్చుకున్న డెబ్బైలో కొన్ని వాడుతూ వుంటే, ఇంతలో మిగతావి కొన్ని పాడయ్యాయి. అన్నిటినీ కాపాడుకోవడం కష్టమైంది. కొన్ని దొంగిలించ బడ్డాయి. కొన్నాళ్ళకు అటు ‘పది’ ఇటు ‘డెబ్బై’ ఇద్దరూ ఒకే ఏడాది కన్నుమూసారు! వొకరు ఆనందంగా... మరొకరు ఆక్రోశంతో... ఇలా ఇక్కడ మన ప్రాధాన్యతల ఎంపిక సంక్లిష్టమయింది. అవి - తెలిసిన వారు, తెలియని వారు అనేది, ఇప్పుడు గ్రహించడం సాధ్యం కాని సరికొత్త విభజన గా మారి చివరికి అదొక రకం ‘వివక్ష’ అయికూర్చుంది! అయితే అది మన దృష్టికి రావడానికి అనేకమైన అడ్డుగోడలు ఉన్నాయి. 

వేద మూలాల్లోకి వొకసారి చూస్తే - “ సమాజంలోని మిగిలిన అన్ని తెగలు మిమ్మల్ని పోషిస్తాయి. మీరు నా ఆలయంలో నా ఆరాధన క్రతువు నిర్వహించండి” అని ‘బైబిల్’ పాత నిబంధనలో జెహోవా లేవీ తెగకు చెప్పాడు. అప్పటి నుంచి వారు జెహోవాకు మానవ సమాజానికి మధ్య వారధి పాత్రకే పరిమితం అయ్యారు. స్వీయ భౌతిక సంపద పట్ల వారికి శ్రద్ద లేకపోయింది. ఆ క్రమంలో ‘మినిమల్’ జీవన శైలి వారికి ‘అక్యుపేషనల్ కంపల్స్హన్’ (వృత్తి పరమైన అనివార్యత) అయింది. 

(చిత్రం: జాన్)

అప్పటి నుంచి, వేలాది ఏళ్ల తర్వాత కూడా ఇదే నియమాన్ని పాటించిన మరో వ్యక్తి ‘బైబిల్’ కొత్త నిబంధన లో మనకు కనిపిస్తాడు. ఆయన జీజస్ కు బాప్టీజం ఇచ్చిన జాన్. అడవి మిడతలు, కొండ తేనే ఆహారంగా... చర్మపు వస్త్రం ధరించిన వాడు జాన్. అందుకే ‘మినిమల్ లివింగ్’ ధోరణిని ఇప్పటికీ ‘జాన్ స్కూల్’ అంటారు. బైబిల్ గ్రంధంలో జీసస్ మరణం – పునర్థానం తర్వాత ‘యాక్ట్స్’ గ్రంధం (4.34-35) లో కార్ల్ మార్క్స్ ఆలోచనల బీజాలు మనకు కనిపిస్తాయి. There were no needy persons among them... who owned land or houses sold them, brought the money from the sales and put it at the apostles’ feet, and it was distributed to anyone who had need.

ఇప్పటకీ తెలుగునాట సామాజిక రంగంలో ఎస్.ఆర్. శంకరన్, కె. బాలగోపాల్ వంటి వారు ‘బైబిల్’ కు ఒక కొనసాగింపుగా మనకు కనిపిస్తారు. సమాంతరంగా అదే బైబిల్ పేరుతో కె.ఏ.పాల్ వంటి వారు కూడా ఇప్పుడు ఉన్నారు. అయితే, గత ఇరవై ఏళ్లలో తెలుగునాట ‘సువార్త’ పేరుతో జరుగుతున్న ఫక్తు వ్యాపార హోరులో- “మీ ప్రతి అవసరానికి మా మందిరాల్లో జరిగే ప్రార్ధనలు పరిష్కారం” అనడం మాత్రం బైబిల్ సిద్దాంతానికి పూర్తిగా విరుద్దం.