Asianet News TeluguAsianet News Telugu

ఏపీకి 'విశాలాంధ్ర' దౌర్భాగ్యం: 60 ఏళ్ల నాటి దుస్థితి రిపీట్

రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాదు వారసత్వంగానే తెలంగాణకు సంక్రమించింది. దాంతో పాత ఆంధ్ర రాష్ట్రం గతంలో ఎదుర్కున్న సమస్యనే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కుంటోంది. 

Capitals: AP faces the same trouble after 60 years
Author
Amaravathi, First Published Jan 22, 2020, 3:35 PM IST

'If history repeats itself, and the unexpected always happens, how incapable must Man be of learning from experience' - George Bernard Shaw
 
అమరావతి: మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర విడిపోయి ఆరు దశాబ్దాలకుపైగానే గడిచింది. తెలంగాణతో సీమాంధ్ర కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడి కూడా 6 దశాబ్దాలకుపైగానే అయింది. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏ విధమైన పరిస్థితిని ఎదుర్కుందో ఆరు దశాబ్దాలు గడిచిన తర్వాత కూడా అదే సమస్యను ఎదుర్కుంటోంది. అది రాజధాని సమస్య.

విశాలాంధ్ర నినాదంతో తెలంగాణతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి, రాజధాని కర్నూలు నుంచి హైదరాబాదుకు మారడానికి ఆంధ్ర రాజకీయాలే కారణం. ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత శ్రీబాగ్ ఒడంబడిక మేరకు కర్నూలును రాజధానిగా చేశారు. కొద్ది కాలం మాత్రమే కర్నూలు రాజధానిగా ఉంది. ఆ  తర్వాత తెలంగాణను కలుపుకుని విశాలాంధ్రను ఏర్పాటు చేయడానికి ఆంధ్ర రాజకీయాలు చురుగ్గా పనిచేశాయి. 

తెలంగాణ రాజకీయ నాయకులు వ్యతిరేకించినప్పటికీ, అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు ఇష్టం లేకపోయినప్పటికీ ప్రెషర్ పొలిటిక్స్ ద్వారా ఆంధ్ర రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. అప్పటికే అన్ని రకాలుగా అభివృద్ధి చెంది, ప్రపంచ పటం మీద నిలిచిన హైదరాబాదు రాష్ట్రానికి ఏ మాత్రం శ్రమ లేకుండా రాజధానిగా మారిపోయింది. 

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న కుల రాజకీయాలు, కమ్యూనిస్టులూ కాంగ్రెసు పార్టీల మధ్య ఆధిపత్య పోరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణకు కారణం. అప్పట్లో తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ బలంగా ఉండేది. ఈ బలంతో విశాలాంధ్రలో తాము అధికారంలోకి రాగలమని భావించి కమ్యూనిస్టులు విశాలాంధ్ర నినాదాన్ని అందుకున్నారు. మరోవైపు ఆంధ్రలోని కుల రాజకీయాలు కూడా ఇందుకు కారణమయ్యాయి. అయితే కాంగ్రెసు పార్టీ తన సహజసిద్దమైన రాజకీయ నాటకాలతో అధికారంలోకి వచ్చింది. గౌతమ్ పింగ్లే రాసిన పడిలేచిన తెలంగాణ పుస్తకం చదివితే ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం ఆంధ్రలో కుల రాజకీయాలు ఎలా పనిచేశాయో అర్థమవుతుంది. 

ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత హైదరాబాదు రాజధానిగా ఏర్పడడంతో సీమాంధ్ర రాజకీయ నాయకులు సమస్య లేకుండా పోయింది. వారంతా హైదరాబాదును కేంద్రంగా చేసుకున్నారు. ఆ కారణంగా సీమాంధ్రలోని నగరాలు విస్మరణకు గురయ్యాయి. నిజానికి తెలంగాణలో కన్నా సీమాంధ్రలోనే అభివృద్ధి చెందిన నగరాలు ఆ కాలంలో ఉన్నాయి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు లాంటి నగరాలు వారికి ఉన్నాయి. హైదరాబాదు రాజధాని అయిన తర్వాత తిరుపతి పర్యాటక కేంద్రంగా మారిపోయింది. మిగతా నగరాలు తమ వైభవాన్ని కోల్పోతూ వచ్చాయి.

ఆంధ్రప్రదేశ్ అవతరణ సందర్భంంగా ఆంధ్ర, తెలంగాణ రాజకీయల నాయకుల మధ్య జరిగిన పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వచ్చారనే ఆరోపణ ఉంది. తాము విస్మరణకు గురవుతున్నామని, తాము అవకాశాలను కోల్పోతున్నామని భావించిన తెలంగాణ ప్రజలు 1969లో ఒకసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమించారు. ఆ తర్వాత మలి దశ ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. 

రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాదు వారసత్వంగానే తెలంగాణకు సంక్రమించింది. దాంతో పాత ఆంధ్ర రాష్ట్రం గతంలో ఎదుర్కున్న సమస్యనే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కుంటోంది. రాజధానిని ఎంపిక చేసుకోవాల్సిన అనివార్యతలో ఆ ప్రాంత రాజకీయ నాయకులు పడ్డారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకుని, భారీ నగరాన్ని అన్ని హంగులతో నిర్మించడానికి పూనుకుంది. అయితే, టీడీపీ ఐదేళ్ల పాలనలో అమరావతి నిర్మాణం విషయంలో జరిగింది తక్కువ, చెప్పింది ఎక్కువ. 

అమరావతి అనేది చిన్న పట్టణం. దానికి చారిత్రక ప్రాధాన్యం ఉంది. దాంతో వెంటనే అది అందరి నోళ్లలో నానడానికి మాత్రమే కాకుండా నిధుల సమీకరణకు కూడా ఉపయోగపడింది. అయితే, వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనా వికేంద్రకరణ పేరుతో దానికి ఎసరు పెట్టింది. కేవలం శాసనసభను మాత్రమే అమరావతిలో ఉంచి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను విశాఖగా చేయడానికి సిద్ధపడింది. హైకోర్టును కర్నూలుకు తరలించడానికి సిద్ధపడింది. 

అమరావతిని పూర్తి స్థాయి రాజధానిగా కొనసాగించకూడదనే జగన్ నిర్ణయం వెనక కారణాలు చాలానే ఉన్నాయి. ఆ కారణాల వెనక కూడా కుల, ప్రాంతీయ రాజకీయాలు పనిచేస్తున్నాయి. చంద్రబాబు రాయలసీమకు చెందినప్పటికీ అసలు సిసలు రాయలసీమగా ఆయన లేరు. ఆయన కోస్తాంధ్ర పెట్టుబడిదారులు, రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్నారు. ఆయన నిర్ణయాలు అందుకు అనుగుణంగానే ఉన్నాయి.

వైఎస్ జగన్ వచ్చేసరికి ఫక్తు రాయలసీమగా జీవిస్తూ అందుకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటారనేది కాదనలేని విషయం. శ్రీబాగ్ ఒడంబడికను ఆసరా చేసుకుని ఆయన పాలనా వికేంద్రీకరణకు పాదులు వేశారు. జగన్ తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తమేమీ ఆందోళనకు దిగడం లేదు.  దక్షిణ, మధ్య కోస్తా ప్రాంతాలు రగులుతున్నాయి. ఇందులో నెల్లూరు జిల్లాను మినహాయించాల్సి ఉంటుంది. నెల్లూరు జిల్లాలో జగన్ నిర్ణయానికి వ్యతిరేక ఎదురు కాకపోవడానికి కుల సమీకరణాలు కూడా కావచ్చు. అమరావతి నిర్మాణంలో కుల సమీకరణాల్లో ఓ సామాజిక వర్గానికి ఫలితం అందలేదు.

మొత్తం మీద, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1950 దశకం ప్రారంభంలో ఎదుర్కున్న సమస్యనే ప్రస్తుతం ఎదుర్కుంటోంది. ఇందుకు ప్రధాన కారణం సీమాంధ్ర రాజకీయ నాయకులు హైదరాబాదును కేంద్రంగా చేసుకుని పనిచేయడం వల్లనే. హైదరాబాదు తమ చేతుల్లోంచి జారిపోదనే అతి విశ్వాసం వల్లనే. అయితే, చరిత్ర పునరావృతమవుతుందని వారికి తెలియదు.

'Those who do not learn history are doomed to repeat it'-George Santayana

- కె. నిశాంత్

Follow Us:
Download App:
  • android
  • ios