అప్పటి నుంచి ఆంధ్రకు రాజధాని సమస్యే: తెలంగాణతో చెదిరిన కలలు

తమిళనాడు రాష్ట్రం నుంచి విడిపోయినప్పటి నుంచి కూడా ఆంధ్రను రాజధాని సమస్య వెంటాడుతూనే ఉంది. హైదరాబాదు తమకు శాశ్వతంగా ఉంటుందని భావించిన ఆ ప్రాంత నాయకులు ఆంధ్రలోని నగరాలను విస్మరించారు.

Capital issue haunts Andhra from bifurcatiing from Tamil Nadu

అమరావతి: ఆంధ్ర రాష్ట్రాన్ని, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తొలి నుంచి రాజధాని సమస్య వెంటాడుతూనే ఉంది. తమిళనాడు రాష్ట్రంలో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు ఉండేవి. దాంతో ఆంధ్ర ప్రత్యేక రాష్ట్రం కోసం పెద్ద యెత్తున ఉద్యమం తలెత్తింది. ఆ ఉద్యమ ఫలితంగా 1953లో అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అయితే, ఆంధ్ర ప్రాంత నాయకులు మద్రాసు నగరం కోసం పట్టుబట్టారు. మద్రాసు నగరం తమకు కావాలని డిమాండ్ పెట్టారు. మద్రాసును వదులుకుంటే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సమ్మతమేననే అభిప్రాయం తమిళనాడు నాయకుల నుంచి వ్యక్తమైంది.

అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కుమారస్వామి రాజా మద్రాసును వదులుకోవడానికి ఇష్టపడలేదు. చివరకు ఓ ఒప్పందం కుదిరి మద్రాసు లేని ఆంధ్ర రాష్ట్ర అవతరణకు మార్గం ఏర్పడింది. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ తర్వాత అది జరిగింది. అయితే, రాయలసీమ నాయకుల అసంతృప్తిని తొలగించడానికి ఆంధ్ర, రాయలసీమ నేతల మధ్య శ్రీబాగ్ ఒడంబడిక జరిగింది. దాంతో రాయలసీమ నేతలు ఆంధ్ర నేతలతో కలిసి వచ్చారు. 

శ్రీబాగ్ ఒడంబడిక మేరకు కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అయితే, కర్నూలు రాజధానికి అవసరమైన వసతులు లేవు. అది రాజధాని నగరంగా 1956 నవంబర్ 1వ తేదీ వరకు కొనసాగింది. విశాలాంధ్ర ఉద్యమంలో భాగంగా తెలంగాణ ప్రాంతంతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించింది. దాంతో రాజధానిగా కర్నూలు కథ ముగిసింది. అప్పటికే అన్ని విధాలుగా ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందిన హైదరాబాదు రాజధానిగా ఏ మాత్రం అభ్యంతరాలు లేకుండా ఆంద్రప్రదేశ్ అవతరణ జరిగింది. 

హైదరాబాదు రాజధానిగా మారడంతో రాయలసీమకు, ఆంధ్రకు చెందిన నాయకులు, పారిశ్రామికవేత్తలు, చెప్పాలంటే సంపన్న వర్గాలకు చెందినవారు హైదరాబాదును కేంద్రంగా చేసుకున్నారు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, జై ఆంధ్ర ఉద్యమం ముగిసిన తర్వాత తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ లో అంతర్భాగంగానే ఉంటుందనే నమ్మకం వారికి మరింతగా బలపడింది. దాంతో మరింతగా హైదరాబాదుపై వారు దృష్టి కేంద్రీకరించారు. 

ఎక్కువ కాలం ఆంధ్ర, రాయలసీమకు చెందినవారే ముఖ్యమంత్రులుగా ఉన్నప్పటికీ హైదరాబాదు మీదనే దృష్టి పెట్టారు. అటు రాయలసీమ, ఆంధ్ర నగరాలపై, ఇటు తెలంగాణ నగరాలపై వారు దృష్టి పెట్టలేదు. హైదరాబాదు క్రమంగా విస్తరిస్తూ వెళ్లింది. పలు అంతర్జాతీయ సంస్థలకు హైదరాబాదు పెట్టుబడులకు కేంద్రంగా మారింది. హైటెక్ సిటీలాంటిది అభివృద్ధి చెందడంలో రాయలసీమకు చెందిన ప్రస్తుత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి పాత్ర గణనీయంగా ఉంది. రాయలసీమకు, ఆంధ్రకు చెందిన బడా రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు హైదరాబాదులో భారీ నివాస భవనాలు నిర్మించుకున్నారు. 

ఆంధ్ర ప్రాంతానికి చెందినవారి ఆధిపత్యం ఉన్నప్పటికీ తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాదు నుంచి కదలలేని పరిస్థితి ఏర్పడింది. సినీ ప్రముఖులు చాలా మంది హైదరాబాదులో, దాని చుట్టుపక్కల పెద్ద యెత్తున ఆస్తులు కూడబెట్టుకున్నారు. ఆంధ్రకు చెందిన పారిశ్రామికవేత్తలు కూడా అంతే. చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాతనే హైదరాబాదులో నివాస భవనాన్ని నిర్మించుకోవడం చూస్తే హైదరాబాదు నుంచి కదలలేని స్థితిలో ఎలా ఉన్నారనేది అర్థమవుతుంది. వైఎస్ జగన్ నివాస గృహం కూడా ఇక్కడ ఉంది. 

అయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం బలంగా ముందుకు వచ్చి, అది ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో కూడా ఆంధ్ర నాయకులు ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు కావాల్సినవి ఏమిటనే విషయంపై దృష్టి పెట్టకుండా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపించారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో రాష్ట్ర విభజనను అడ్డుకోగలమని భావించారు. చివరగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్పదనే విషయం స్పష్టమైన తర్వాత హైదరాబాదుపై పట్టుబట్టారు. హైదరాబాదును చివరకు కేంద్ర పాలిత ప్రాంతంగానైనా చేయించాలని పట్టు బిగించారు. కానీ, అది సాధ్యం కాలేదు. తెలంగాణ ఏర్పాటుతో ఆంధ్ర నాయకుల కలలు చెదిరిపోయాయి.

గతంలో మద్రాసు లేకుండానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినట్లుగానే, హైదరాబాదు లేకుండా తెలంగాణను వదలుకుని ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. దాంతో రాజధాని సమస్య మళ్లీ ముందుకు వచ్చింది. ఎన్నికల్లో రాజధానిపై, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై భరోసాను కల్పిస్తూ, తన అనుభవాన్ని ముందు పెడుతూనే కాకుండా బిజెపిని, జనసేనను కలుపుకుని చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేసి విజయం సాధించారు. 

తెలంగాణలేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత 29 గ్రామాలను కలుపుకుని అమరావతి అని పేరు పెట్టి దాన్ని రాజధానిగా చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. బెంగళూరు, హైదరాబాదులకు ధీటుగా దాన్ని నిర్మిస్తానని హామీ ఇచ్చారు. పదేళ్ల పాటు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా కొనసాగడానికి వీలున్నప్పటికీ ఆ లోపలే అనివార్య కారణాల వల్ల రాజధానిని చంద్రబాబు అమరావతికి మార్చుకోవాల్సి వచ్చింది. తాత్కాలిక కట్టడాల్లో అమరావతి రాజధానిగా ఆయన అధికారంలో ఉన్నంత వరకు కొనసాగింది. ఇప్పుడు కూడా కొనసాగుతోంది. 

కానీ, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని తిరగదోడారు. మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయంతో మళ్లీ రాజధాని సమస్యను ముందుకు తెచ్చారు. దాంతో న్యాయపోరాటాలు, రాజకీయ పోరాటాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని సమస్య ఎప్పటి పరిష్కారమవుతుందనే చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇదంతా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నేతల స్వయంకృతాపరాధమే తప్ప మరోటి కాదు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios