Asianet News TeluguAsianet News Telugu

క్రికెట్ టోర్నీలపై గంగూలీ టీమ్ ఖేల్: క్రికెటర్లలో మహిళలు, పురుషులు వేరయా....

ఇప్పుడిప్పుడే ప్రజాదరణ పట్టాలెక్కుతున్న మహిళల క్రికెట్‌కు కరోనా వైరస్‌ మహమ్మారి అడ్డుగా నిలిచింది. ఇంగ్లాండ్‌ పర్యటనకు బీసీసీఐ నో చెప్పింది. సీనియర్‌ సెలక్షన్‌ కమిటీపై స్పష్టత లేదు. అసలు అమ్మాయిలు మళ్లీ ఎప్పుడు మైదానంలోకి వస్తారనే అంశంపై స్పష్టత లేదు. కరోనా కష్టకాలంలో భారత మహిళల క్రికెట్‌ ఏ దిశగా పయనిస్తోందనేది అందరి మెదళ్లలోనూ మెదులుతున్న ప్రశ్న. 

BCCI Chief Ganguly And Co's Gender Discrimination: Women's Cricket Taking A blow
Author
Mumbai, First Published Jul 27, 2020, 1:44 PM IST

2020 మార్చ్. వరల్డ్ కప్ జరుగుతుంది. ప్రతిసారి లాగానే ఈసారి కూడా అంచనాలు పెద్దగా లేని టీం ఇండియా రంగంలోకి దిగింది. టీం ఇండియా సెమిస్ కి చేరుకోవడంతో క్రికెట్ ని మతంలా అభిమానించే భారతీయులు అప్పుడు క్రికెట్ ని చూడడం జట్టుకు మద్దతు ఇవ్వడం ప్రారంభించారు. 

క్రికెట్ ప్రపంచ కప్ ఏమిటి, మార్చ్ 2020 ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా? మనకు దాని గురించి అంతలా తెలియకపోవడానికి కారణం అది మహిళల క్రికెట్ టీం. సెమిస్ కి చేరడంతో టీం ఇండియాకు స్టేడియాల్లో కూడా మద్దతు పెరిగింది. 

మార్చి 8, 2020 టీ20 మహిళల ప్రపంచకప్‌ ఫైనల్స్‌ టైటిల్‌ పోరులో టీమ్‌ ఇండియా ఓడినా.. భవిష్యత్‌పై మాత్రం భరోసా కల్పించింది. మూడేండ్లలో రెండు ఐసీసీ వరల్డ్‌కప్‌ల ఫైనల్లోకి ప్రవేశించిన భారత జట్టు ప్రపంచ క్రికెట్‌లో సరికొత్త పవర్‌హౌస్‌గా ఎదిగేందుకు గట్టి పునాది వేసుకుంది. 

నిజానికి 2020 భారత మహిళల క్రికెట్‌కు ఎంతో బిజీగా ఉండాల్సిన ఏడాది. ఏడాది ఆరంభంలో టీ20 వరల్డ్‌కప్‌, అనంతరం నాలుగు జట్లతో కూడిన మహిళల చాలెంజ్‌ ట్రోఫీ, ఇంగ్లాండ్‌లో ముక్కోణపు వన్డే సిరీస్‌, ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ సన్నాహకంలో భాగంగా మరికొన్ని ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లతో మహిళల క్రికెట్‌ జట్టు ఎన్నడూ లేనంత బిజీగా గడిపేది. 

కోహ్లిసేన చివరి ద్వైపాక్షిక సిరీస్‌ రద్దు అయ్యింది. ఐపీఎల్‌ నిరవధిక వాయిదా పడింది. అయినా బయో బబుల్‌లో ఐపీఎల్‌కు రంగం సిద్ధమవుతోంది. ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటన ఖరారు. మెన్స్‌ క్రికెట్‌కు సింపుల్‌గా కాస్త విరామం వచ్చిందంతే. కానీ మహిళల క్రికెట్‌ పరిస్థితి పూర్తి భిన్నం. ఎక్కడ ఆగిందో, ఎప్పుడు మొదలైతుందో ఎవరికీ తెలియన దుస్థితి!.

ఇప్పుడిప్పుడే ప్రజాదరణ పట్టాలెక్కుతున్న మహిళల క్రికెట్‌కు కరోనా వైరస్‌ మహమ్మారి అడ్డుగా నిలిచింది. ఇంగ్లాండ్‌ పర్యటనకు బీసీసీఐ నో చెప్పింది. సీనియర్‌ సెలక్షన్‌ కమిటీపై స్పష్టత లేదు. అసలు అమ్మాయిలు మళ్లీ ఎప్పుడు మైదానంలోకి వస్తారనే అంశంపై స్పష్టత లేదు. కరోనా కష్టకాలంలో భారత మహిళల క్రికెట్‌ ఏ దిశగా పయనిస్తోందనేది అందరి మెదళ్లలోనూ మెదులుతున్న ప్రశ్న. 

మహిళల టీ20 ఛాలెంజ్ ట్రోఫీ ఎప్పుడు..?

పూర్తి స్థాయి మహిళల ఐపీఎల్‌పై డిమాండ్లు పెరుగుతున్నా 2-3 ఏండ్లు నాలుగు జట్లతో కూడిన ఐపీఎల్‌కే ఓటేయాలని బీసీసీఐ భావించింది. ఎగ్జిబిషన్‌ మ్యాచుల తరహాలో కాకుండా నాలుగు జట్లతో మినీ ఐపీఎల్‌కు ప్రణాళిక రచించింది. గతంలో మాదిరి ఆరంభంలో కాకుండా, ప్రేక్షకులు ఎక్కువగా చూసేందుకు వీలుగా నాకౌట్‌ దశలో మహిళల చాలెంజ్‌ ట్రోఫీ మ్యాచులను షెడ్యూల్‌ చేశారు. 

కరోనా కారణంగా ఐపీఎల్‌ 2020 భారత్‌ నుంచి తరలిపోతుంది. బయో సెక్యూర్‌ బబుల్‌ వాతావరణంలో యుఏఈలో నిర్వహించేందుకు అనధికారికంగా అంతా సిద్ధమైపోయింది. కానీ ఎక్కడా మహిళల చాలెంజ్‌ ట్రోఫీ ప్రస్తావన రాలేదు. 

బయో బబుల్‌ వాతావరణంలో మహిళల చాలెంజ్‌ ట్రోఫీ నిర్వహణకు బీసీసీఐ ఆసక్తిగా ఉన్నట్టు కనిపించటం లేదు. త్వరలో జరుగనున్న ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌ షెడ్యూల్‌తో మహిళల చాలెంజ్‌ ట్రోఫీ ఢకొీట్టే అవకాశం సైతం ఉంది. దీంతో బీసీసీఐ పలు కారణాల సాకుతో ఈ ఏడాది మహిళల చాలెంజ్‌ ట్రోఫీకి మంగళం పాడేందుకు సదా సిద్ధంగా ఉంది.

ఇంగ్లాండ్ పర్యటనకు ఎందుకు పంపలేదు..?

దక్షిణాఫ్రికా, భారత్‌లతో ఇంగ్లాండ్‌ ఆగస్టులో ముక్కోణపు వన్డే సిరీస్‌కు ప్రణాళిక వేసింది. కానీ బీసీసీఐ నుంచి ఈసీబీకి తిరస్కారం ఎదురైనట్టు సమాచారం. బయో బబుల్‌ సిరీస్‌కు వెస్టిండీస్‌, పాకిస్థాన్‌లకు పంపినట్టే భారత మహిళల జట్టుకూ ప్రత్యేక విమానం ఏర్పాటు చేసేందుకు ఈసీబీ ఆఫర్‌ చేసింది. 

ఇంగ్లాండ్‌లో బస, ప్రయాణ ఖర్చులు సైతం భరించేందుకు సిద్ధమని తెలిపింది. అయినా, భారత క్రికెట్‌ బోర్డు ఎందుకు విముఖత వ్యక్తం చేసిందో అర్థం కావటం లేదు. సుదీర్ఘ విరామం వచ్చిన మహిళల క్రికెటర్లకు బీసీసీఐ, ప్రత్యేకంగా శిక్షణ శిబిరం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనికి బీసీసీఐ సిద్ధంగా ఉన్నట్టు లేదు. 

మిథాలీరాజ్‌, జులన్‌ గోస్వామి వంటి వన్డే క్రికెటర్లు క్రికెట్‌కు దూరమై చాలా కాలమైంది. 2021 వన్డే వరల్డ్‌కప్‌ సన్నాహకానికి ఇంగ్లాండ్‌ పర్యటన భారత్‌కు గొప్పగా ఉపయోగపడేది. కానీ గంగూలీ సారథ్యంలోని బీసీసీఐ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో తెలియటం లేదు. 

ఇక మహిళల క్రికెట్‌ పర్యవేక్షణకు బీసీసీఐ యంత్రాంగంలో ప్రత్యేక అధికారి సైతం లేడు. ఎం.వీ శ్రీధర్‌, రత్నాకర్‌ శెట్టిలు అనంతరం సబా కరీం మహిళల క్రికెట్‌ వ్యవహరాలను చూశారు. ఇప్పుడు సబా కరీం వైదొలిగాడు. క్రికెట్‌ అభివృద్దికి జనరల్‌ మేనేజర్‌గా బీసీసీఐ తాజాగా దరఖాస్తులు ఆహ్వానించింది. మహిళల క్రికెట్‌ పురోగతికి తీసుకోవాల్సిన నిర్మాణాత్మక చర్యలపైఇప్పటికైనా బీసీసీఐ ఆలోచన చేస్తుందని ఆశించడం తప్ప ఏమీ చేయలేని దుస్థితి..!

Follow Us:
Download App:
  • android
  • ios