Asianet News TeluguAsianet News Telugu

ఆదివాసీ వర్సెస్ లంబాడాలు: తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్

తెలంగాణాలో ఆదివాసీలు, లంబాడా వర్గాల మధ్య కొనసాగుతున్న వివాదం మరోసారి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసేలా పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పుడు కొత్తగా రాజకీయ రంగును పులుముకున్నాయి. 

Adivasis vs Lambadas: new political twist in telangana
Author
Hyderabad, First Published Nov 20, 2019, 5:55 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

తెలంగాణాలో ఆదివాసీలు, లంబాడాల మధ్య 40 సంవత్సరాలుగా రగులుతున్న చిచ్చు 2017 సంవత్సరం చివరినాటికి తారాస్థాయికి చేరి ఇరు వర్గాల మధ్య ఘర్షణలకు దారి తీసింది. గత కొంత కాలంగా ఒకింత స్తబ్దుగా వాతావరణం ఉన్నప్పటికీ, ఇప్పుడు జరుగుతున్న తాజా పరిణామాలు మరోమారు ఉద్రిక్తతలకు దారి తీసే విధంగా కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు తాజా పరిణామాలేంటి, గతంలో ఎందుకు ఇరు వర్గాల మధ్య వైరం ప్రారంభమైంది, ఇరు వర్గాల మధ్య చిచ్చుకు కారణాలేంటనేది తెలుసుకుందాం. 

ఇరు వర్గాలకు చెందిన నాయకులు తమ వర్గాలతో బల ప్రదర్శనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మరోమారు ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తికర పరిస్థితులు తలెత్తే ఆస్కారం కనపడుతుంది. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసీ నాయకుడు, ప్రస్తుత ఎంపీ సాయం బాపూరావు చలో ఢిల్లీ కి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లంబాడాల నాయకుడు, లంబాడా హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు తేజావత్ బెల్లయ్య నాయక్ నవంబర్ 24న చలో అమరావతికి పిలుపునిచ్చారు. 

ఇలా ఆదివాసీలేమో లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని పట్టుబడుతుంటే, లంబాడాలేమో తమ హక్కులను త్యజించేందుకు సిద్ధంగా లేమని అంటున్నారు. 2017 జూన్లో లంబాడా తెగకు చెందిన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ చంపాలాల్  తీసుకున్న ఒక నిర్ణయం వివాదాస్పదంగా మారింది. కొమరం భీం వర్ధంతి సందర్భంగా అతను సెలవు ప్రకటించలేదు. ఆదివాసీల్లో ఈ చర్య తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. 

తమ అస్థిత్వాన్ని లంబాడాలు తొక్కిపెడుతున్నారని వారు వీధుల్లోకొచ్చారు. జోడేఘాట్ లోని లంబాడాలకు చెందిన ఒక పవిత్ర విగ్రహాన్ని కొందరు ఆదివాసీలు తగలబెట్టడంతో, తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. ఎందరో గాయపడ్డారు. ఇదొక్కటే ఘటనతోని ఆగకుండా వరసగా ఇరువర్గాల మధ్య అనేక సంఘటనలు జరిగాయి. కొమరం భీం విగ్రహాన్ని కూల్చడం, సమ్మక్క సారలమ్మల జాతర నిర్వహణ కమిటీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి చందూలాల్ తనయుడిని చేయడంతో, వారు మరింత కోపోద్రిక్తులయ్యారు. ఆదివాసీల పండగైన సమ్మక్క సారలమ్మల జాతరకు ఇలా ఒక లంబాడాను నిర్వహణ కమిటీకి అధ్యక్షుడిని చేయడమేంటనీ వారు రగిలిపోయారు. 

అసలు వివాదానికి కారణం... 

ప్రస్తుతం జరుగుతున్న వివాదం ఇప్పటిదైతే కాదు. లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చినప్పటినుండి ఇరు వర్గాల మధ్య వివాదం సాగుతూనే ఉంది. ఆదివాసీలేమో జాబితాలో చేర్చిన లంబాడాలను తొలగించాలని ఉద్యమిస్తుంటే, తమకు కల్పించిన రేజర్వేషన్లను రక్షించుకునేందుకు లంబాడాలు పోరాడుతున్నారు. 

లంబాడాలను, సుగాలీలు లేదా బంజారాలుగా కూడా పిలుస్తారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1976లో లంబాడాలను షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చింది. 2014 లో ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయిన తెలంగాణ కూడా ఈ వర్గీకరణను కొనసాగిస్తోంది. దీనికి విరుద్ధంగా, కర్ణాటకలో  లంబాడాలను షెడ్యూల్డ్ కులాలుగా వర్గీకరించగా, మహారాష్ట్ర వారిని ఇతర వెనుకబడిన తరగతుల్లో (ఓబీసీల్లో)చేర్చారు.

"లంబాడాలను షెడ్యూల్డ్ తెగగా గుర్తించిన తరువాత, సుగాలి, లంబాడా తెగకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుండి ఆంధ్రప్రదేశ్‌లోకి వలస వచ్చారు" ,అని కేంద్ర ప్రభుత్వ షెడ్యూల్డ్ ప్రాంతాలు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ 2004 లో తయారుచేసిన ఒక నివేదికలో పేర్కొంది. సుగాలీల  జనాభా 1971 లో 1,32,464 ఉండగా; 1981 నాటికి, సుగాలి, లంబాడాల జనాభా 11,58,342 కు పెరిగింది.  కేవలం 10 సంవత్సరాల కాలంలోనే 777.4% పెరుగుదల నమోదయ్యింది. లంబాడాలను, సుగాలీలను చేర్చిన 5 సంవత్సరాల్లోనే ఇంత పెరుగుదల నమోదయ్యింది అనేది ప్రభుత్వ నివేదిక. 

2011 నాటికి, తెలంగాణలోని ఎస్టీ జనాభా 3.2 మిలియన్లు. షెడ్యూల్డ్ తెగల జనాభాలో లంబాడాలు 64% గా ఉన్నారు. రాష్ట్రంలోని 33 తెగలను షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించబడ్డాయి.

ఆదిలాబాద్ ప్రాంతంలో, ప్రభుత్వ ఉద్యోగాలలో 6% షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్లలో లంబాడాలు అత్యధికంగా లాభం పొందారని, తమ అవకాశాలకు గండి కొట్టి, అన్ని ప్రయోజనాలను వారు లాగేసుకుపోతున్నారనేది ఆదివాసీల ఆరోపణ. 

ఆర్టికల్ 342 ప్రకారం కేవలం 9 ఆదివాసీ తెగలను మాత్రమే ఎస్టీలుగా గుర్తించారని కోయ, గోండ్ (లేదా రాజ్ గోండ్), కొండ రెడ్డి, చెంచు, పర్దాన్, కోలం, నాయక్‌పోడ్, తోట్టి మన్నెవవార్లు మాత్రమే ఆదిమతెగలని  ఆదివాసులు చెబుతారు. 1976 లో షెడ్యూల్డ్ తెగల జాబితాలో లంబాడాలను ఆర్డినెన్స్ ద్వారా ఈ జాబితాలో చేర్చడం జరిగింది. 

ఇక ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు ఈ సమస్య రాజకీయ రంగు కూడా పులుముకుంటుంది. ఇరు వర్గాల మధ్య ఉన్న వివాదాలను తమకు అనుకూలంగా మలచుకోవాలని బీజేపీ ప్రయత్నాలు సాగిస్తుంది. ఇందుకు తగ్గట్టుగానే చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వంలో ఒక్క ఆదివాసీ కూడా మంత్రిగా కొలువుదీరకపోవడంతో తమకు కావలిసినంత గుర్తింపును తెరాస ప్రభుత్వం కల్పించడం లేదని వారు అభిప్రాయపడుతున్నారు. 

తాజా కేబినెట్ విస్తారనప్పుడు కూడా మంత్రిగా సత్యవతి రాథోడ్ ను తీసుకోవడంతో ఆదివాసీ నేతలు నిరసనలకు దిగారు. సత్యవతి రాథోడ్ లంబాడా సామాజికవర్గానికి చెందిన నేత. తమ సామాజికవర్గం వారికి తగినంత ప్రాధాన్యం కల్పించడంలేదని వారు బహిరంగంగానే ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 

రానున్న రోజుల్లో ఈ అంశం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios