చెన్నై: ప్రేయసిపై అత్యాచారం చేసి ఆమెను ఓ యువకుడు హత్య చేశాడు. మరో యువకుడితో సన్నిహితంగా ఉంటుందనే కోపంతో ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశాడు. నిందితుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. 

తమిళనాడులోని తిరుచ్చి ప్రాంతానికి చెందిన రాజగోపాల్ కూతురు కవిప్రియ (16) ప్లస్ వన్ చదువుతోంది. ఆమె గత నెల 31వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆ తర్వాత తిరిగి రాలేదు.

కాగా, సమీపంలోని అటవీ ప్రాంతంలో చేతులు, కాళ్లు కట్టేసిన స్థితిలో కవిప్రియ మృతదేహం కనిపించింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను హత్య చేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానించారు. దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఇనాంమత్తూరు ప్రాంతానికి చెందిన మదికుమార్ (22)తో కవిప్రియ ప్రేమించుకున్నట్లు తేలింది. 

దాంతో మదికుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. కవిప్రియను అతనే హత్య చేసినట్లు విచారణలో తేలింది. కవిప్రియ మరో యువకునితో సన్నిహితంగా మెలగడం మదికుమార్ కు నచ్చలేదు. దీంతో ఆమెను అటవీ ప్రాంతానికి తీసుకుని వెళ్లి గొడవ పడ్డాడు. 

కోపంతో మదికుమార్ కవిప్రియపై అత్యాచారం చేసి ఆ తర్వాత ఆమెను హత్య చేశాడు. తలపై బండరాయి వేయడంతో కవిప్రియ అక్కడికక్కడే మరణించింది. ఆ తర్వాత ఆమె ముఖాన్ని చున్నీతో కప్పేసి అక్కడి నుంచి పారిపోయాడు.