Inheritance Tax: మన దేశంలోనూ వారసత్వ పన్ను.. ఎందుకు రద్దు చేశారంటే..?

Inheritance Tax Row: దేశ రాజకీయాల్లో వారసత్వ పన్ను (Inheritance Tax Row)అనే అంశం చర్చనీయంగా మారింది. ఇంతకుముందు భారతదేశంలో కూడా వారసత్వపు పన్ను వసూలు చేశారని తెలుసు. దాని తొలగింపు వెనుక చాలా ఆసక్తికరమైన కథ ఉంది. ముందుగా వారసత్వపు పన్ను అంటే ఏమిటో తెలుసుకుందాం ?  

What Is Inheritance Tax? How It Worked And Why India Abolished It In 1985? KRJ

Inheritance Tax Row: రాజకీయాల్లో వారసత్వ పన్ను (Inheritance Tax Row)అనే అంశం చర్చనీయంగా మారింది. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పిట్రోడా మనదేశంలోనూ వారసత్వపు పన్నును అమలు చేయాలంటూ సంచలన ప్రకటన చేయడంతో..  రాజకీయ దుమారం చెలరేగింది. అమెరికాలో పరోక్ష వారసత్వ పన్ను విధించాలని ఆయన వాదించారు. భవిష్యత్తులో అమెరికా తరహాలో భారత్‌లో మళ్లీ అమలు చేస్తారా? లేదా?  అనేది వేరే విషయం. అయితే చరిత్ర పేజీని తిరగేస్తే.. ఇంతకుముందు భారతదేశంలో కూడా వారసత్వపు పన్ను వసూలు చేశారని తెలుసు. దాని తొలగింపు వెనుక చాలా ఆసక్తికరమైన కథ ఉంది. ముందుగా వారసత్వపు పన్ను అంటే ఏమిటో తెలుసుకుందాం? 

వారసత్వ పన్ను అంటే ఏమిటి ?

అమెరికాలో వారసత్వపు పన్ను అమల్లో ఉంది. అక్కడి చట్టాల ప్రకారం.. ఓ వ్యక్తికి $100 మిలియన్ల విలువైన ఆస్తి ఉంటే.. అతడు చనిపోయిన తరువాత.. తన పిల్లలకు కేవలం 45% ఆస్తి మాత్రమే  దగ్గుతుంది. మిగతా 55% ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరైనా మరణించిన వ్యక్తి నుండి డబ్బు లేదా ఇంటిని వారసత్వంగా పొందినట్లయితే వాటిని వారసత్వపు ఆస్తి అంటారు. ఆ ఆస్తుల పై పన్ను చెల్లించేదాన్ని వారసత్వపు పన్ను అంటారు. వారసత్వంగా వచ్చిన ఆస్తి, మరణించిన వారితో వారసుడి సంబంధాన్ని బట్టి పన్ను రేట్లు మారుతూ ఉంటాయి.

నియమాల ప్రకారం అమెరికాలోని ఆరు రాష్ట్రాల్లో మాత్రమే వారసత్వ పన్ను విధిస్తారు. అయోవా పన్ను రేటును 5%కి తగ్గించాలని కోరింది. దీన్ని 2025లో ముగిస్తామని ప్రకటించినట్లు నివేదిక పేర్కొంది. పన్ను రేట్లు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి. కానీ 1% కంటే తక్కువ నుండి 20% వరకు ఉంటాయి. సాధారణంగా మినహాయింపు పరిమితి కంటే ఎక్కువ మొత్తాలకు వర్తిస్తాయి. పన్ను రేట్లు మీ వారసత్వం పరిమాణం, రాష్ట్ర పన్ను చట్టాలు, మరణించిన వారితో వారి సంబంధం పై ఆధారపడి ఉంటాయి.

భారతదేశంలోనూ వారసత్వపు పన్ను వసూలు..

భారత చరిత్ర పుటల్లో వారసత్వపు పన్ను ప్రస్తావన ఉంది. ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు వెల్త్ ఆఫ్ నేషన్స్ చట్టం కింద 1953లో వారసత్వ పన్నును ప్రవేశపెట్టారు. 1953లో సంపదలో భారీ అసమానతలు ఉన్నాయని ప్రభుత్వం కనుగొంది. అందువల్ల అటువంటి పన్ను ఆలోచన వచ్చింది. అదనంగా ఇది తరువాతి తరానికి పెద్ద మొత్తంలో డబ్బును వదిలిపెట్టిన ధనవంతులపై ఈ పన్ను వసూలు చేశారు. అంటే.. ఒక వ్యక్తి మరణించిన తరువాత అతని స్వంత ఆస్తి మొత్తం విలువపై ఎస్టేట్ సుంకం విధించబడుతుంది. ఆస్తిని వారసులకు బదిలీ చేసినప్పుడు, వారు పన్ను చెల్లించాల్సి ఉండేది. ఈ సుంకం అన్ని స్థిరాస్తితో పాటు భారతదేశంలో లేదా వెలుపల ఉన్న అన్ని చరాస్తులపై విధించబడింది. ఉదాహరణకు రూ. 20 లక్షల కంటే ఎక్కువ విలువ చేసే ఆస్తులపై 85 శాతం వరకు ఆస్తి సుంకం విధించే వారు. దీంతో ఆనాటి ప్రభుత్వాలు ప్రజాగ్రహానికి గురయ్యాయి. 

ది ఎకనామిక్ టైమ్స్‌లోని ఒక నివేదిక ప్రకారం.. 1984-85లో ఎస్టేట్ డ్యూటీ యాక్ట్ ప్రకారం మొత్తం రూ.20 కోట్ల పన్ను వసూలు చేయబడింది. ప్రజలు పన్నులు చెల్లించకుండా ఉండేందుకు మార్గాలను అన్వేషించడం ప్రారంభించారు. అక్రమంగా సంక్రమించిన ఆస్తులను దాచిపెట్టడమే కాకుండా బినామీ ఆస్తులు పెరిగాయి. ఆదాయపు పన్ను పైన ప్రత్యేక సంపద పన్ను రెట్టింపు పన్నుగా పరిగణించబడింది.దీంతో ప్రజల ఆగ్రహానికి ప్రభుత్వం గురైంది.  దీంతో రాజీవ్ గాంధీ ప్రభుత్వం కాలంలో (1985లో)అప్పటి ఆర్థిక మంత్రి వీపీ సింగ్‌ ఈ పన్నును రద్దు చేశారు. వారసత్వ పన్ను కారణంగా ప్రభుత్వం చాలా వ్యాజ్యాలలో చిక్కుకుందట. అయితే ఆ పన్ను ద్వారా వచ్చే ఆదాయం పరిపాలనలో అయ్యే ఖర్చుల కంటే తక్కువగా ఉందని ప్రభుత్వం తెలిపింది. 

వారసత్వ పన్ను ప్రస్తావన మళ్లీ ఎప్పుడు ప్రారంభమైంది ?

వారసత్వ పన్నును తిరిగి తీసుకురావాలనే ఆలోచన దశాబ్దానికి పైగా రాజకీయ వర్గాల్లో ఉంది. 2011లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన ప్రణాళికా సంఘం (ప్రస్తుతం నీతి ఆయోగ్) సమావేశంలో ఆనాటి హోం మంత్రి పి చిదంబరం వారస్వత పన్నును తిరిగి ప్రవేశపెట్టాలనే ఆలోచనను మొదటిసారిగా ప్రతిపాదించారు. యుపిఎ-1 ప్రభుత్వం మొదటి నాలుగేళ్లలో చిదంబరం ఆర్థిక మంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే. 

పన్ను వనరులను పెంచడానికి , పడిపోతున్న పన్ను-జిడిపి నిష్పత్తిని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక సంవత్సరం తర్వాత.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీలో జరిగిన కార్యక్రమంలో చిదంబరం మరోసారి ఈ అంశాన్ని లేవనెత్తాడు. కొద్ది మంది వ్యక్తుల చేతుల్లో దేశ సంపద పోగుపడడంపై ఆందోళన వ్యక్తం చేసిన చిదంబరం, వారసత్వ పన్ను విధించేందుకు ఇదే సరైన సమయమని అన్నారు.

2013లో చిదంబరం యూపీఏ-2 ప్రభుత్వ చివరి పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పుడు దీనిపై పునరాలోచన జరిగింది. వాస్తవానికి.. యుపిఎ రాజకీయ లక్ష్యాన్ని నెరవేరుస్తూనే వారసత్వపు పన్ను ఆదాయాన్ని పెంచుతుందని చిదంబరం విశ్వసించారు. అయితే.. క్యాబినెట్‌లో ఈ అంశంపై విభిన్న అభిప్రాయాలు వెలువడటంతో బడ్జెట్‌లో ప్రస్తావించలేదు.

వారసత్వ పన్నుకు కాంగ్రెస్ నేతల మద్దతు 

2014 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం విజయం సాధించిన తర్వాత, ఈ విషయం తాత్కాలికంగా నిలిపివేయబడింది. అదే సంవత్సరంలో.. అప్పటి ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా వారసత్వ పన్నును ప్రవేశపెట్టడాన్ని బహిరంగంగా సమర్థించారు. అటువంటి పన్ను రాజవంశ వ్యాపారులు అనుభవిస్తున్న కొన్ని ప్రయోజనాలను తొలగిస్తుందని  సిన్హా చెప్పారు.

2017లో ప్రభుత్వం వారసత్వపు పన్నును మళ్లీ విధించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. 2018లో కూడా అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దీనిని సమర్థించారు, అభివృద్ధి చెందిన దేశాల్లోని ఆసుపత్రులు , విశ్వవిద్యాలయాలు వారసత్వ పన్ను వంటి కారణాల వల్ల పెద్ద గ్రాంట్లు పొందుతాయని చెప్పారు. అమెరికా, యూరప్‌లోని ప్రముఖ ఆసుపత్రులకు అందుతున్న గ్రాంట్లు బిలియన్ల డాలర్లలో ఉన్నాయని జైట్లీ చెప్పారు.

నిపుణులు ఏమంటున్నారు?

దేశంలోని అతిపెద్ద పన్ను నిపుణులలో ఒకరైన బల్వంత్ జైన్ ఈ విషయం పై మాట్లాడుతూ వారసత్వపు పన్ను ఉండకూడదని అన్నారు. అందుకే భారతదేశంలో దీన్ని రద్దు చేశారని, దీన్ని తీసుకువచ్చిన ప్రయోజనం నెరవేరలేదని అన్నారు. ఖర్చు ఎక్కువ కావడం, వసూళ్లు తక్కువగా ఉండడంతో రాజీవ్ గాంధీ ప్రభుత్వం దాన్ని ముగించాల్సి వచ్చిందని తెలిపారు. భారత్ లాంటి దేశంలో 1991కి ముందు సోషలిజం ఉందని, పన్ను ఎగవేత ఎక్కువగా ఉందని జైన్ చెప్పారు.

ఇందిరాగాంధీ ప్రభుత్వం గురించి చెప్పాలంటే, అప్పట్లో సాధారణ ప్రజలు రూ.100 ఆదాయం పై కేవలం రూ.97 మాత్రమే పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఏ దేశ ప్రగతిలో అయినా పన్నులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. రాజీవ్ గాంధీ ప్రభుత్వం వారసత్వపు పన్నును రద్దు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వం దీనికి సంబంధించి అనేక రకాల వ్యాజ్యాలలో చిక్కుకుంది. దాని నిర్వహణ వ్యయం కంటే పన్ను ఆదాయం చాలా తక్కువగా ఉండేదట.ఏదిఏమైనా ఈ అంశం చాలా సున్నితమైంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios