Asianet News TeluguAsianet News Telugu

Pepsico: పెప్సికో కంపెనీకి చుక్కెదురు.. బంగాళాదుంప వెరైటీపై హక్కులు వెనక్కి

పెప్సికో కంపెనీకి పీపీవీఎఫ్ఆర్ఏలో చుక్కెదురైంది. 2016లో ఆ కంపెనీ బంగాళాదుంప ఎఫ్ఎల్-2027 వెరైటీపై పొందిన హక్కులను కోల్పోవాల్సి వచ్చింది. సాగు కార్యకర్త కవితా కురుగంటి దాఖలు చేసిన ఓ పిటిషన్‌పై విచారిస్తూ పెప్సికో కంపెనీకి జారీ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను పీపీవీఎఫ్ఆర్ఏ తోసిపుచ్చింది. 2018, 2019లలో ఈ సర్టిఫికేట్ ఆధారంగానే పెప్సికో కంపెనీ గుజరాత్ రైతులను కోర్టుకు ఈడ్చిన సంగతి తెలిసిందే.
 

PPVFRA revoked pepsicos IPR on potato variety
Author
New Delhi, First Published Dec 3, 2021, 8:43 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ: పెప్సికో(Pepso Co) కంపెనీకి ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ అథారిటీ(పీపీవీఎఫ్ఆర్ఏ)లో చుక్కెదురైంది. ఎఫ్ఎల్-2027 రకానికి చెందిన బంగాళాదుంప(Potato Variety)పై పెప్సికో కంపెనీ ఇండియా హోల్డింగ్‌కు జారీ చేసిన పీవీపీ(ప్లాంట్ వెరైటీ ప్రొటెక్షన్) సర్టిఫికేట్‌ను తోసిపుచ్చింది. వ్యవసాయ కార్యకర్త Kavita Kuruganti దాఖలు చేసిన ఓ పిటిషన్‌పై విచారించి పీపీవీఎఫ్ఆర్ఏ ఈ ఆదేశం వెలువరించింది. పెప్సికో కంపెనీ సమర్పించిన తప్పుడు సమాచారం ఆధారంగా ఆ కంపెనీకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జారీ చేసినట్టు అభిప్రాయపడింది. అంతేకాదు, కనీసం రక్షణకు అర్హులు కాని వారికి ఈ సర్టిఫికేట్ మంజూరు చేశారన్న పిటిషనర్ వాదనతో ఏకీభవించింది.

అసలు రిజిస్ట్రేషన్‌కు కావాల్సిన సమాచారం, దస్త్రాలను రిజిస్ట్రార్‌కు కంపెనీ సమర్పించలేదని పిటిషనర్ వాదించారు. ఆ సర్టిఫికేట్ మంజూరీ కూడా ప్రజా హితమైనది కాదని ఆరోపించారు. ఈ వాదనలు విన్న తర్వాతే పీపీవీఎఫ్ఆర్ఏ పెప్సికో కంపెనీకి బంగాళాదుపం ఎఫ్ఎల్-2027 వెరైటీపై జారీ చేసిన సర్టిఫికేట్‌ను తోసిపుచ్చింది.

Also Read: బంగాళదుంప రైతులపై పెప్సికో కేసు: భగ్గుమన్న బెజవాడ

దీంతో 2016లో ఈ కంపెనీకి ప్లాంట్ వెరైటీ సర్టిఫికేట్ రూపంలో మంజూరు చేసిన మేధోసంపత్తి హక్కులను వెనక్కి తీసుకున్నట్టయిందని పిటిషనర్ కవిత కురుగుంటి తెలిపారు. అంతేకాదు, ఈ తీర్పు పీవీసీ మంజూరులోని లోపాలను ఎత్తిచూపిందని వివరించారు. ఈ కంపెనీకి రిజిస్ట్రేషన్ కాలం మరో రెండు నెలలతో ముగియనుంది. అయితే, దాన్ని మళ్లీ 2031 జనవరి 31వ తేదీ వరకు రెనివల్ చేసుకునే వెసులుబాటు ఉంది. కానీ, తాజా తీర్పుతో ఆ హక్కులు ఎత్తేసినట్టయింది.

ఈ తీర్పు కేవలం పెప్పికో కంపెనీకే కాదు.. ఇతర అన్ని ఫుడ్ అండ్ బెవరేజెస్ కార్పొరేషన్లకు ఒక హెచ్చరికగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అలాంటి సంస్థలు భారత రైతుల హక్కులను, విత్తన హక్కులను కాలరాయలేరని ఒక గీత గీసినట్టు ఉన్నదని చెబుతున్నారు.

ఈ తీర్పుపై లీగల్ రీసెర్చ్, ఐపీఆర్ నిపుణులు షాలిని భుతాని స్పందిస్తూ ఇది చరిత్రాత్మక తీర్పు అని అభివర్ణించారు. పీపీవీఎఫ్ఆర్ఏలోని 39 సెక్షన్‌లో రైతులకు విత్తనాలపై ఉండే హక్కులను ఎత్తిపట్టిందని వివరించారు. మేధోసంపత్తి హక్కులు పొందినవారు రైతుల హక్కులను అంత చులకనగా తీసిపారేయలేరనే ఒక కచ్చితమైన సంకేతాలను ఈ తీర్పు ఇచ్చిందని తెలిపారు.

Also Read: రైతులపై కేసులు, వెనక్కి తగ్గిన పెప్సీ: కేసులు విత్‌డ్రా

పిటిషనర్ కవితా కురుగంటి మాట్లాడుతూ ఈ సర్టిఫికేట్‌ను ఉపయోగించే గతంలో అంటే 2018, 2019లలో గుజరాత్‌లోని అమాయక రైతులను కోర్టుకు ఈడ్చిందని అన్నారు. రైతులు తమకు ఇష్టమైన విత్తనాలు విత్తడానికి ఉన్న అతిముఖ్యమైన హక్కును ఈ చట్టం స్పష్టంగా చెబుతున్నదని, అంతేకాదు, పండించిన వాటినీ వారు ఏమైనా చేసుకోవచ్చు.. ఇతర కంపెనీలు రిజిస్టర్ చేసుకున్న వెరైటీలతో సహా వాటిపై హక్కు రైతులకు ఉంటుందని తెలిపారు. అయితే, ఒకే ఒక కండీషన్ ఏమంటే.. రిజిస్ట్రేషన్ చేసుకున్న వెరైటీల విత్తనాలను బ్రాండెడ్ విధానంలో అమ్మకాలు చేపట్టకూడదని వివరించారు. అదీ తెలియక చేస్తే ఆ నేరం నుంచీ వారికి మినహాయింపు ఉంటుందని తెలిపారు.

చట్టం ఇంత విస్పష్టంగా ఉన్నప్పటికీ పెప్సికో కంపెనీ గుజరాత్ రైతులను వేధించిందని, భారీ పరిహారాలను డిమాండ్ చేసి హరాస్ చేసిందని కవితా కురుగంటి వివరించారు. ఈ తీర్పుపై 2019లో పెప్సికో కంపెనీ దావాతో కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిన రైతు బిపిన్ బాయ్ పటేల్ స్పందించారు. ఈ కేసు ఫలితంపై తాము ఎంతో సంతోషంగా ఉన్నామని అన్నారు. రైతుల హక్కులను స్పష్టపరిచి ఇతరులకు ఒక గిరి గీయడంతో తమ పాత్ర ఉన్నందుకు గర్విస్తున్నామని చెప్పారు. సాగు కార్యకర్తలకూ తాము రుణపడి ఉన్నామని వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios