గుజరాత్ రాష్ట్రంలో బంగాళదుంపలు పండించే రైతుల మీద పెప్సీ కంపెనీ కేసు పెట్టడంపై ఏపీ రైతులు భగ్గుమంటున్నారు. దీనిని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు, సీఐటీయూ, వ్యవసాయ కార్మిక, కౌలు రైతు సంఘాలు డిమాండ్ చేశాయి.

ఈ సందర్భంగా సోమవారం విజయవాడ లెనిన్ సెంటర్లో పెప్సి లేస్ ప్యాకెట్లను తగులబెట్టి వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతు సంఘం నేత పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ఒక్కో రైతు ఎకరానికి కోటి ఐదు లక్షల రూపాయలను తమకు పరిహారంగా చెల్లించాలని పెప్సి సంస్థ కోరడం దారుణమన్నారు.

ఈ కేసు దేశంలోని రైతులు, పంటలు, ఆహార భద్రత, వ్యవసాయ స్వాతంత్ర్యం, దేశ సార్వభౌమాధికారంపై విస్తృతమైన ప్రభావం చూపుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులో రైతులకు వ్యతిరేకంగా న్యాయస్థానం తీర్పునిచ్చినట్లయితే రైతుల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

అంతేకాకుండా బడా కార్పోరేట్ సంస్థలు దేశంలో విజృంభించి, రైతులపై స్వారీ చేస్తాయన్నారు. గుజరాత్‌లో బంగాళదుంప రైతులపై కేసులు ఎత్తేయడానికి రైతులు సమైక్య పోరాటం చేయాలని పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు.

తమకు చెందిన లేస్ పొటొటో చిప్స్‌కు వినియోగించే  ఎఫ్ఎల్ 2027/ఎఫ్‌సీ 5 బంగాళదుంప రకాన్ని తమ అనుమతి లేకుండా పండించారంటూ గుజరాత్‌లోని సబర్‌కాంతా, ఆరవల్లి జిల్లాల్లోని తొమ్మిది మంది రైతులపై పెప్సీకో ఇండియా కంపెనీ కేసులు పెట్టింది.

ఇందుకు గాను నలుగురు రైతులు ఒక్కొక్కరు కొటి ఐదు లక్షల రూపాయల జరిమానా కట్టాలని శాసించింది.