Asianet News TeluguAsianet News Telugu

పోలింగ్ కేంద్రం అంటే ఏమిటి? ఇంతకీ ఓటు వేసే విధానం తెలుసా? 

Voting Process: దేశంలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ మహా సమరం కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ స్టేషన్ ల ఎంపిక కూడా ఖరారైంది. అయితే, అసలు పోలింగ్ కేంద్రం అంటే ఏమిటి ? దానిని ఎలా ఎంపిక చేస్తారు? పోలింగ్ స్టేషన్ లో ఎవరెవరి పాత్ర? ఓటు వేసే విధానం ఎలానో అనే విషయాలు చాలా మందికి తెలియవు. ఆ వివరాలు ఈ స్టోరీలో.. 

How is the polling station selected, what is the voting process KRJ
Author
First Published May 2, 2024, 9:52 PM IST

Voting Process: అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. రాబోయే ఐదేళ్ల పాటు దేశాన్ని ఎవరు పాలించాలో నిర్ణయించే ముఖ్య ఎన్నికలు ఇవి. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఎన్నికలు కాబట్టే అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. తమ ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నాయి.

మరో వైపు ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ కూడా అన్ని చర్యలూ తీసుకుంటోంది. అయితే.. ప్రతీ ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటే తప్పనిసరిగా పోలింగ్ కేంద్రానికి వెళ్లాలి. మరి అలాంటి ప్రాముఖ్యత కలిగిన పోలింగ్ కేంద్రం అంటే ఏమిటి ? దానిని ఎంపిక చేసే విధానం ఏమిటి ? ఓటు ఎలా వేస్తారు? పోలింగ్ స్టేషన్ లో ఎవరెవరి పాత్ర? ఓటు వేసే విధానం ఎలా? అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.. 

పోలింగ్ కేంద్రం అంటే ? 

పోలింగ్ కేంద్రం అంటే ఓ ఓటరు తమకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకోవడానికి ప్రజాస్వామ్యబద్ధంగా, అధికారికంగా ఎంపిక చేయబడిన భవనం లేదా ప్రాంగణం. ఈ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ బూత్ లు ఉంటాయి. ఇందులోనే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలో పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు చేసేందుకు పాటించాల్సిన నిబంధనలు ఉన్నాయి. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ఎన్నికల సంఘం కూడా అప్ డేట్ అవుతూ ఎప్పటికప్పుడు కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తుంది. 

కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి..?

2020లో రూపొందించిన నిబంధనల ప్రకారం.. 1,500 కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉంటే వారందరికీ ప్రత్యేకంగా ఓ పోలింగ్ స్టేషన్ ఉండాలి. పోలింగ్ బూత్‌లో 1000 మందికి మించి ఓటర్లు ఉండకూడదు. ఓ వ్యక్తి తమ ఓటును వినియోగించుకునేందుకు రెండు కిలో మీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లకుండా చూడాలని నిబంధనలు చెబుతున్నాయి. మెట్రోపాలిటన్ నగరాల్లో లేదా జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్లు పెద్ద సంఖ్యలో కనిపించడానికి ఇదే కారణమని చెప్పవచ్చు. మారుమూల ప్రాంతాల్లో జన సాంద్రత చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి పోలింగ్ కేంద్రాల సంఖ్య కూడా తక్కువగానే ఉంటుంది. 

ఎక్కడ ఏర్పాటు చేస్తారు ?

సాధారణంగా పోలింగ్ కేంద్రాల కోసం ప్రభుత్వ లేదా పాక్షిక ప్రభుత్వ కార్యాలయ భవనాలను ఎంపిక చేస్తారు. ఇందులో కూడా మెజారిటీ పోలింగ్ కేంద్రాలు స్కూల్, కాలేజీ భవనాల్లోనే ఉంటాయి. అందులో టేబుల్స్, కుర్చీలు అందుబాటులో ఉండటమే దానికి కారణం. కొన్ని సార్లు గ్రామీణ కమ్యూనిటీ భవనాలు, పంచాయతీ భవనాలు, హాళ్లలో కూడా ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. అయితే నిబంధనల ప్రకారం పోలీస్ స్టేషన్లు, హాస్పిటల్స్, దేవాలయాలు, ఇతర మత స్థలాల్లో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయరాదు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో ఏ రాజకీయ పార్టీ కార్యాలయం లేదా తాత్కాలిక కార్యాలయం ఉండకూడదు. వృద్ధులు, వికలాంగ ఓటర్లను దృష్టిలో ఉంచుకొని గ్రౌండ్ ఫ్లోర్ లోనే పోలింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేస్తుంటారు. వారి కోసం ర్యాంప్ ను కూడా నిర్మిస్తారు. 

వారి నిర్ణయమే కీలకం.. 

పోలింగ్ స్టేషన్‌ ఏర్పాటు చేయడంలో సాధారణంగా జిల్లా మేజిస్ట్రేట్ లేదా జిల్లా ఎన్నికల అధికారి నిర్ణయం కీలకంగా ఉంటుంది. అయితే ఇందుకోసం ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకోవడం కూడా తప్పనిసరి. ఇలా చేయకపోతే ఆ పోలింగ్ కేంద్రంలో వేసిన ఓట్లు చెల్లుబాటు కావు. భారతదేశంలో ఎన్నికల నిర్వహణకు కమిషన్ ఉంది కానీ ఎన్నికల నిర్వహణకు సిబ్బంది లేరు. అందుకే ఎన్నికల పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు, పారమిలటరీ బలగాలను ఉపయోగించుకుంటుంది. 

పోలింగ్ కేంద్రాన్ని ఎలా కనుగొనాలి ? 

గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రం కనుక్కోవడం సులభమే కానీ సిటీల్లో అనేక పోలింగ్ స్టేషన్ లను ఏర్పాటు చేయడం వల్ల ఓటర్లు కొంత అయోమయానికి గురవుతారు. తమ పోలింగ్ స్టేషన్ ఎక్కడుందో తెలుసుకోవడానికి కొంత ఇబ్బంది పడుతారు. అలాంటి వారు పోలింగ్ స్టేషన్‌ను కనుగొనడానికి మూడు ప్రధాన మార్గాలు ఉన్నాయి. స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లు ప్లే స్టోర్ నుండి ఓటర్ హెల్ప్‌ లైన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో నో యువర్ పోలింగ్ స్టేషన్ విభాగంలో ఓటరు వివరాలను పొందుపరిస్తే పోలింగ్ స్టేషన్‌ వివరాలు వస్తాయి. 

లేదా ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో కూడా పోలింగ్ కేంద్రాన్ని కూడా కనుగొనవచ్చు. ఓటరు గుర్తింపు కార్డుపై ఇచ్చిన ఎపిక్ నెంబర్ ద్వారా.. మొబైల్ నంబర్ ద్వారా పోలింగ్ కేంద్రాన్ని గుర్తించవచ్చు. ఓటింగ్‌కు ముందు బీఎల్ వో ఇచ్చిన ఓటర్ స్లిప్‌లో కూడా పోలింగ్ కేంద్రం, బూత్ నంబర్ సహా పూర్తి సమాచారం ఉంటుంది. ఓటర్ హెల్ప్‌లైన్ నంబర్ 1950కి కాల్ చేసి కూడా ఓటరు తన సమాచారాన్ని అడగవచ్చు.  

ఓటింగ్ ప్రక్రియ.

పోలింగ్ స్టేషన్‌కు వెళ్లే ముందు ఓటరు తన ఓటర్ ఐడీ లేదా ఇతర ఫోటో గుర్తింపు కార్డులు, ఓటర్ స్లిప్లును తీసుకెళ్లాలి. ఓటర్ ఐడీ కార్డు లేకున్నా ఓటెయ్యొచ్చు.. దాదాపు ఇతర  12 కార్డుల్లో ఏది ఉన్నా ఓకే..!. ఓటర్ స్లిప్ అనేది.. ఎన్నికల అధికారుల మీ ఇంటి వద్దకే వచ్చి ఇచ్చి వెళతారు. ఒక వేళ ఓటర్ స్లిప్ ఇవ్వకున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పోలింగ్ బూత్‌ వద్ద లేదా రాజకీయ పార్టీల ఏజెంట్ల వద్ద కూడా పొందవచ్చు.

పోలింగ్ స్టేషన్‌లో.. 

>> మెుదటి అధికారి ఓటరు జాబితాలో మీ గుర్తింపు కార్డులోని పేరుతో పరిశీలిస్తారు. ఓటర్ జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసి, మీ ఐడీ కార్డును తనిఖీ చేస్తారు.

>> రెండో అధికారి మీ వేలికి ఇంక్ అంటిస్తారు. ఆ తర్వాత ఓ చీటీ ఇస్తారు. అలాగే.. రిజిస్టర్ లో మీతో సంతకం చేయిస్తారు.(ఫారం 17A)

>> మూడో అధికారి ఆ చీటిని చెక్ చేసి.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (EVM) దగ్గరకు పంపిస్తారు.  మీరు ఓటు వేయడానికి సిద్ధంగా ఉండాలి.

>> ప్రిసైడిండ్ అధికారి/ పోలింగ్ అధికారి ఈవీఎం మిషన్ బటన్ నొక్కిన తరువాత ఈవీఎం యంత్రంపై మిమ్ములను ఓటు వేసేందుకు అనుమతిస్తారు.

>> మీరు ఈవీఎం యంత్రంపై ఉన్న అభ్యర్థుల పేర్లు, పార్టీ పేరు, ఆయనకు సంబంధించిన గుర్తు సరిగా గుర్తించి..  మీరు నచ్చిన  అభ్యర్థికి ఎదురుగా ఉన్న బ్లూ బటన్‌పై నొక్కాలి.

>> అప్పుడు దాని పక్కనే ఉన్న రెడ్ సిగ్నల్ వెలగడంతో పాటు పెద్దగా బీప్ శబ్దం వినిపిస్తుంది. అప్పుడు మీ ఓటు నమోదైనట్లు లెక్క. 

>> మీ ఓటు ఎవరికి పడిందో లేదో.. తెలుసుకోవడానికి ఈవీఎం పక్కనే ఉన్న ఓటర్ వెరిఫియేబుల్ ఆడిట్ ట్రయల్(వీవీప్యాట్)లో చూడవచ్చు.

>> సీల్డ్ బాక్స్‌లోని గ్లాస్ కేసులో ఎవరికి ఓటు వేశామో ఏడు సెకన్ల పాటు కనిపిస్తుంది.

>>ఒకవేళ.. వీవీప్యాట్ లో బ్యాలెట్ స్లిప్ కనిపించకపోయినా.. బీప్ సౌండ్ రాకపోయినా.. మీరు వెంటనే ప్రిసైడింగ్ అధికారిని సంప్రదించాలి.

Follow Us:
Download App:
  • android
  • ios