PM Modi: భారతీయ ప్రయాణికులకు ఉజ్బెకిస్థాన్ శుభవార్త చెప్పింది. ఇకపై భారత పౌరులు 30 రోజుల వరకు ఎలాంటి వీసా అవసరం లేకుండానే ఉజ్బెకిస్థాన్‌లో పర్యటించేందుకు అవకాశం కల్పించనున్నారు. మోదీ ఉజ్బెకిస్థాన్ పర్యటన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది.
భారత్‌తో బలమైన భాగస్వామ్యం
పర్యాటక రంగంతో పాటు ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత దగ్గర చేసేందుకు వీసా రహిత ప్రయాణ విధానం ఉపయోగపడుతుందని ఉజ్బెక్ అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు. వ్యాపారవేత్తలు, పర్యాటకులు, పెట్టుబడిదారుల రాకపోకలు పెరగడం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపు వస్తుందని పేర్కొన్నారు. భారత్‌ను తమ దేశానికి విశ్వసనీయమైన వ్యూహాత్మక భాగస్వామిగా మిర్జియోయెవ్ అభివర్ణించారు. గత ఏడాది ఇరు దేశాల మధ్య వాణిజ్య విలువ 1 బిలియన్ డాలర్లను అధిగమించిందని తెలిపారు. రెండు దేశాల సంస్థల మధ్య జాయింట్ వెంచర్లు కూడా పెరుగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం భారత్-ఉజ్బెకిస్థాన్ మధ్య ప్రతి వారం 14 ప్రత్యక్ష విమాన సర్వీసులు నడుస్తున్నాయని వెల్లడించారు. రాబోయే సంవత్సరాల్లో వాణిజ్య, ఆర్థిక సంబంధాలను మరింత విస్తరించేందుకు ఇరు దేశాలు చర్యలు చేపట్టనున్నాయి.
2030 నాటికి 5 బిలియన్ డాలర్ల వాణిజ్య లక్ష్యం
తాష్కెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ సమావేశమై విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక ఆవిష్కరణలు, డిజిటల్ చెల్లింపులు, యూపీఐ సేవలు, రక్షణ రంగ సహకారం వంటి పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ఇరు దేశాల మధ్య వార్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 5 బిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యాన్ని నిర్ణయించారు. డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య, పెట్టుబడుల రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించడంపై కూడా నేతలు సమాలోచించారు.
మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత గౌరవం
ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం లభించింది. భారత్-ఉజ్బెకిస్థాన్ స్నేహబంధాన్ని బలోపేతం చేయడంలో చేసిన కృషికి గుర్తింపుగా ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘ఆర్డర్ ఆఫ్ ఒలియ్ దరాజాలి దోస్త్లిక్’ను అధ్యక్షుడు మిర్జియోయెవ్ స్వయంగా ప్రధానికి అందజేశారు. పురస్కారం అందుకున్న అనంతరం ప్రధాని మోదీ స్పందిస్తూ, ఈ గౌరవాన్ని వ్యక్తిగతంగా కాకుండా భారత్-ఉజ్బెకిస్థాన్ మధ్య ఉన్న చిరస్థాయి స్నేహానికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు.
లాల్‌బహదూర్ శాస్త్రికి నివాళి
తాష్కెంట్‌లోని భారత మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి విగ్రహాన్ని కూడా ప్రధాని మోదీ సందర్శించి నివాళులర్పించారు. 1965 భారత్-పాకిస్థాన్ యుద్ధం అనంతరం శాంతి చర్చల్లో భాగంగా జరిగిన తాష్కెంట్ ఒప్పందానికి శాస్త్రి సంతకం చేశారు. అనంతరం 1966 జనవరి 11న తాష్కెంట్‌లో ఆయన ఆకస్మికంగా మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శాస్త్రి స్మారకాన్ని సందర్శించడం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.
ఉజ్బెకిస్థాన్‌లో యోగాకు పెరుగుతున్న ఆదరణ
రెండు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా మోదీ తాష్కెంట్‌లో నిర్వహించిన ప్రత్యేక యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగా ఫెడరేషన్ ఆఫ్ ఉజ్బెకిస్థాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యోగాపై అక్కడి ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తిని ప్రధాని ప్రశంసించారు. యోగాను ప్రజల జీవితాల్లో భాగం చేసేందుకు ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కొనియాడారు. యోగా కేవలం ఆరోగ్యానికి మాత్రమే పరిమితం కాకుండా దేశాల మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని పెంచే వారధిగా మారుతుందని మోదీ పేర్కొన్నారు.
అభివృద్ధి లక్ష్యాలపై చర్చలు
ఈ పర్యటన సందర్భంగా భారత్ చేపట్టిన ‘వికసిత్ భారత్ 2047’, ఉజ్బెకిస్థాన్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘ఉజ్బెకిస్థాన్-2030’ కార్యక్రమాల మధ్య సహకార అవకాశాలపై ఇరు దేశాధినేతలు చర్చించారు. అలాగే తాష్కెంట్‌లోని మహాత్మా గాంధీ కేంద్రాన్ని సందర్శించడంతో పాటు భారత్‌కు సంబంధించిన చారిత్రక ప్రదేశాలను కూడా ప్రధాని పరిశీలించారు. ఉజ్బెకిస్థాన్ పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కెక్‌కు వెళ్లనున్నారు. అక్కడ జరగనున్న 26వ ఎస్‌సీవో శిఖరాగ్ర సమావేశంలో పాల్గొని సభ్య దేశాల నేతలతో కీలక అంశాలపై చర్చించనున్నారు.


