- Home
- Telangana
- Hyderabad: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు చల్లటి వార్త.. ఇకపై లోకల్ ట్రైన్స్ లో మెట్రో లాంటి అనుభూతి
Hyderabad: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు చల్లటి వార్త.. ఇకపై లోకల్ ట్రైన్స్ లో మెట్రో లాంటి అనుభూతి
Hyderabad: నగరంలో రోజువారీ ప్రయాణాలకు కీలకంగా మారిన ఎంఎంటీఎస్ సేవల్లో మరో కీలక మార్పు చోటుచేసుకోనుంది. ప్రస్తుతం సాధారణ కోచ్‌లతో నడుస్తున్న ఎంఎంటీఎస్ రైళ్లలో ఏసీ కోచ్‌లను అందుబాటులోకి తీసుకురావడానికి రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది.

తొలి దశలో పాత రైళ్లకే ఏసీ కోచ్‌లు
రైల్వేబోర్డు సూచనల మేరకు దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ ఎంఎంటీఎస్‌పై ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. మొదటి దశలో ప్రస్తుతం నడుస్తున్న ఎంఎంటీఎస్ రైళ్లలో ఒక్కో రైలుకు 2 నుంచి 4 ఏసీ కోచ్‌లు జత చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రయాణికుల స్పందన, డిమాండ్‌ను బట్టి తదుపరి దశలో పూర్తిస్థాయి ఏసీ లోకల్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఏసీ కోచ్‌ల తయారీకి రైల్వేబోర్డు గ్రీన్ సిగ్నల్
దేశవ్యాప్తంగా ఏసీ లోకల్ రైళ్లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ భారీగా ఏసీ కోచ్‌ల తయారీకి సిద్ధమవుతోంది. ఐసీఎఫ్, ఆర్సీఎఫ్, ఎంసీఎఫ్ వంటి మూడు రైల్వే కోచ్ తయారీ కేంద్రాల్లో వందల సంఖ్యలో ఏసీ లోకల్ కోచ్‌లను తయారు చేసేందుకు అనుమతులు ఇచ్చింది. 2027 ఏప్రిల్ నాటికి వివిధ కోచ్ ఫ్యాక్టరీల నుంచి పెద్ద సంఖ్యలో ఏసీ కోచ్‌లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
రోజూ 60 వేల మందికి ఎంఎంటీఎస్ సేవలు
ప్రస్తుతం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలను అనుసంధానిస్తూ సుమారు 70 ఎంఎంటీఎస్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి. ఉందానగర్–లింగంపల్లి/ఆర్సీపురం వైపు, లింగంపల్లి–హైదరాబాద్, కాచిగూడ–మేడ్చల్, ఘట్‌కేసర్–లింగంపల్లి వంటి మార్గాల్లో రైళ్లు నడుస్తున్నాయి. వీటి ద్వారా ప్రతిరోజూ దాదాపు 60 వేల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.
ఐటీ, కార్పొరేట్ ఉద్యోగులకు మరింత ప్రయోజనం
హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్లకు ప్రతిరోజూ వేలాది మంది ఉద్యోగులు రాకపోకలు సాగిస్తున్నారు. ఎంఎంటీఎస్‌లో ఏసీ కోచ్‌లు అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ రద్దీని తప్పించుకోవడంతో పాటు, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఎంచుకునే అవకాశం ఉద్యోగులకు లభిస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ఏసీ కోచ్‌లు ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి.
యాదాద్రి, సంగారెడ్డి వైపు విస్తరణకు అవకాశాలు
ఎంఎంటీఎస్ రెండో దశలో ఘట్‌కేసర్ నుంచి యాదాద్రి వరకు సేవల విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు పటాన్‌చెరు మీదుగా సంగారెడ్డి వరకు ఎంఎంటీఎస్‌ను విస్తరించాలనే డిమాండ్ కూడా ఉంది. ఈ విస్తరణలకు కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వస్తే భవిష్యత్‌లో కొత్త మార్గాల్లో మరిన్ని ఎంఎంటీఎస్ రైళ్లు, అందులో ఏసీ రైళ్లు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

