Asianet News TeluguAsianet News Telugu

విపక్షాల ఐక్యత కార్యరూపం దాల్చేనా?.. ఆ పార్టీలకు రాష్ట్రాలనే వదిలిపెట్టాలా?.. డైలామాలో కాంగ్రెస్!

విపక్షాల ఐక్యత కార్యరూపం దాల్చేనా? కాంగ్రెస్ కోణంలో విపక్షాల ఐక్యత ప్రతిపాదనలను, ఫార్ములాను చూస్తే వచ్చే సందేహం ఇది. ప్రాంతీయ పార్టీల కోసం తమకు బలమైన యూనిట్లు గల, దీర్ఘకాలంగా పోరాడుతున్న రాష్ట్రాలను మొత్తంగా వదిలిపెట్టాలా? అనే డైలామాలో కాంగ్రెస్ ఉన్నది.
 

congress in dilemma whether it has to leave states for other parties ahead of june 23rd opposition parties patna meeting kms
Author
First Published Jun 18, 2023, 10:49 PM IST

Opposition Unity: విపక్షాల ఐక్యతకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలు ఈ నెల 23వ తేదీన బిహార్ రాజధాని పాట్నాలో సమావేశం కాబోతున్నాయి. ఈ భేటీలో విపక్షాల ఐక్యతకు కావాల్సిన ప్రాతిపదిక, తీరు గురించి చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశం మరో నాలుగు రోజుల దూరంలో ఉన్నది. అయినా.. కాంగ్రెస్‌లో మాత్రం డైలామా వీడటం లేదు. విపక్షాల ఐక్యత కోసం ప్రాంతీయ పార్టీలు నేరుగా బీజేపీపై పోరాడటానికి కాంగ్రెస్ మొత్తంగా తప్పుకోవాలనే ప్రతిపాదన ఒకటి బలంగా వినిపిస్తున్నది. కాంగ్రెస్ ఈ ప్రతిపాదనను జీర్ణించుకోవడం లేదు. అందుకే దీనికి వ్యతిరేకంగా ఫైటింగ్ మోడ్‌లోకి వెళ్లింది. దీనిపై నిర్ణయం కనీసం ఈ ఏడాది చివరి వరకైనా పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఉదాహరణకు పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీకి, ఢిల్లీ, పంజాబ్‌లలో ఆప్, యూపీలో ఎస్పీకి అన్ని సీట్లను కాంగ్రెస్ త్యాగం చేయాలి. కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఈ పార్టీలు మద్దతు తెలుపుతాయి.

తృణమూల్ కాంగ్రెస్, ఆప్, సమాజ్‌వాదీ పార్టీలు ఈ నిర్ణయం వీలైనంత త్వరగా తీసుకోవాలని కోరుకుంటున్నాయి. ఈ నిర్ణయం తొందరగా తీసుకుంటే ఈ ఏడాది చివరిలో జరగనున్న ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ మరింత బలపడానికి తాము సహకరిస్తామని ప్రతిపక్ష పార్టీలు అభిప్రాయపడుతున్నాయి.

అదే కారణం.. అంటే ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణల్లో విజయం అనే కారణంతోనే కాంగ్రెస్ జూన్ 23న దీనిపై ఓ కమిట్‌మెంట్ ఇవ్వడానికి ఆసక్తి చూపించడం లేదు. కర్ణాటకలో మంచి విజయం సాధించిన కాంగర్ెస్ ఈ ఏడాది జరగనున్న ఇతర రాష్ట్రాల్లోనూ మంచి ప్రదర్శన చూపిస్తామనే ఆత్మవిశ్వాసంతో ఉన్నది. ఇది అన్ని రకాలుగా కాంగ్రెస్‌కు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నది.

ఢిల్లీ, పంజాబ్‌లలో కాంగ్రెస్ పోటీ చేయకుంటే తాము మధ్యప్రదేశ్‌లో పోటీ చేయబోమని ఆప్ స్పష్టం చేసింది. అదే పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్.. సీపీఎంతో దోస్తీ కడితే లోక్ సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ఆశించరాదని మమతా బెనర్జీ విస్పష్టంగా చెప్పేశారు.

కాగా, మేమేమీ రాజకీయాల నుంచి స్వచ్ఛంద విరమణ తీసుకోలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అధికారంలో ఉన్న బీజేపీ యేతర విపక్షపార్టీలు.. కాంగ్రెస్ పోటీ చేయరాదని చెబుతున్న ఆ రాష్ట్రాల్లో తమకు క్రియాశీలక పార్టీ యూనిట్లు ఉన్నాయని పేర్కొన్నారు. 

ఐక్యత గురించి వల్లిస్తున్న పార్టీలు ఒక విషయం తెలుసుకోవాలని, ఆ రాష్ట్రాల్లో దీర్ఘకాలంగా కాంగ్రెస్ ఉన్నదని కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. గోవా, గుజరాత్‌లలో ఆప్, తృణమూల్ కాంగ్రెస్ పోటీకి రావడానికి ముందే కాంగ్రెస్ అక్కడ ఉన్నదని వివరించారు. వారి లక్ష్యం ఒకటే కాంగ్రెస్‌ను నష్టపరచడమే అని తెలిపారు. ఎందుకంటే ఈ పార్టీలు కేవలం కాంగ్రెస్ ఓట్లను మాత్రమే ఆకర్షిస్తాయని వివరించారు.

Also Read: లిక్కర్ మత్తులో ఉన్న యూకే మహిళను ఫ్లాట్‌కు ఎత్తుకెళ్లి రేప్ చేసిన భారతీయ విద్యార్థి

పాట్నా సమావేశంలో ప్రాంతీయ పార్టీల రాష్ట్రాలను (ఉదాహరణకు పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాలు)వదిలిపెట్టాలని కాంగ్రెస్‌కు ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయి.

కాంగ్రెస్‌తో ఇతర ప్రతిపక్ష పార్టీలకు ఇబ్బందికరంగా ఉన్న అంశం.. హస్తానికి మైనార్టీల్లో ముఖ్యంగా ముస్లింలో విశ్వాసం గణనీయంగా పెరిగింది. ప్రాంతీయ పార్టీలు తమ కంచుకోటల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడాన్ని నిరాకరిస్తూనే ముస్లిం ఓట్లు తమకు దక్కాలని ఆశిస్తున్నాయి.

కర్ణాటకలో కాంగ్రెస్ అభ్యర్థులకు ముస్లింలు భారీగా ఓట్లేశారు. బెంగాల్ బైపోల్‌లోనూ ముస్లిం ప్రాబల్య సీటులో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిని కాంగ్రెస్ ఓడించింది. ఇదిలా ఉండగా, గుజరాత్‌లో ప్రచారం తీరు, ఢిల్లీలో దాని చర్యలు మైనార్టీ కమ్యూనిటీ నుంచి ఆప్‌ను దూరం చేసింది.

ఈ పార్టీలు ముస్లిం ఓటర్లు తమ నుంచి దూరం అవుతున్నారని కలవరపడుతున్నాయి. ఈ పరిణామం తమ గెలుపు అవకాశాలను కొల్లగొట్టే ముప్పు ఉన్నదని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ జాగ్రత్తగా వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ దాని స్ట్రాటజీని కొంచెం మార్చుకుంటే బాగుంటుందని అన్నారు. పొత్తులో సమాజ్‌వాదీ పార్టీ నిక్కచ్చి షరతులతో ఉండదని ఓ హింట్ ఇచ్చారు.

కర్ణాటకలో విజయం తర్వాత తెలంగాణలోనూ తమ పార్టీ మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందని కాంగ్రెస్ భావిస్తున్నది.  అందుకే ఈ ఫార్ములాను కాంగ్రెస్ అంగీకరించడానికి నిరాసక్తి వ్యక్తీకరిస్తున్నది. తెలంగాణను బీఆర్ఎస్‌కే వదిలిపెడితే ఇక్కడ బీజేపీ రెండో స్థానానికి ఎగబాకుతుందని కాంగ్రెస్ నేత ఒకరు వివరించారు. ఇది చాలా ముప్పు అని చెప్పారు.

అదే సమయంలో బీఆర్ఎస్ కూడా విపక్షాల ప్రయత్నాల్లో పాలుపంచుకోవడం లేదు. అదీకాకుండా బీజేపీని ఎదుర్కోనున్న మహావికాస్ అఘాదీ గల రాష్ట్రమైన మహారాష్ట్రలో కొత్త యూనిట్లు ఏర్పాటు చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సూటిగా తన అభిప్రాయాన్ని చెప్పేశారు. ఏ రాష్ట్రంలోనైనా బలోపేతం చేసుకునే హక్కు అన్ని పార్టీలకు ఉన్నాయని అన్నారు. కానీ, తాము బీఆర్ఎస్‌ను మాత్రం బీజేపీ బీ టీమా? అనే కోణంలో చూస్తామని తెలిపారు. ముందు నుంచే విపక్షాల ఐక్యత కూటమికి డిస్టెన్స్ మెయింటెయిన్ చేస్తున్న బీఆర్ఎస్ స్టాండ్‌పై నీలినీడలను కమ్ముకుంటున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios