మీరు చూసే ఉంటారు షాపింగ్ మాల్స్, బంగారం దుకాణాలు, గ్రాసరీ షాప్స్ లాంటి వాటిల్లో పనిచేసే సేల్స్ గర్ల్స్.. వారు పనిచేసినంత సేపు నిలబడే ఉంటారు. కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా ఉండవు. ఒకవేళ ఉన్నా కూర్చోవడానికి వారికి ఖాళీ కూడా ఉండదు. మన దగ్గర అయితే.. కష్టమర్స్ లేని సమయంలో కాసేపు కూర్చుంటారేమో.. కానీ కేరళలో మాత్రం.. అది నిషిద్దం.

కష్టమర్స్ ఉన్నా లేకున్నా.. వారంతా నిలబడి ఉండాల్సిందే. అది అక్కడ రూల్. కానీ.. అబ్బాయిల విషయం పక్కన పెడితే.. అమ్మాయిలకు మాత్రం ఈ రూల్ నరకంగా ఉండేది. పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అయితే మాత్రం వారి పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. కానీ.. ఇప్పుడు వారికి ఆ బాధ నుంచి ఉపశమనం లభించింది.

కేరళ రాష్ట్రంలో అమలవుతున్న ఈ నిబంధనను మార్చడంలో ఈ మహిళలు విజయం సాధించగలిగారు. ఆ నియమం ప్రకారం రీటెయిల్ అవుట్‌లెట్‌లో ఉద్యోగం చేసే మహిళలను కూర్చోకుండా అడ్డుకునేవారు. దీంతో మహిళలందరూ కలిసి దీనికి వ్యతిరేకంగా ఉద్యమం చేశారు.

"జరగకూడని పొరపాట్లు చాలా జరుగుతున్నాయి. అందుకే నిబంధనలను మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు మహిళలకు తప్పకుండా కూర్చోవడానికి చోటు దొరుకుతుంది. దీనితోపాటు మహిళలకు బాత్రూం వెళ్లడానికి కూడా తగినంత సమయం లభిస్తుంది" అని రాష్ట్ర కార్మిక శాఖ అధికారి ఒకరు తెలిపారు.

నిబంధనల్లో మార్పుల ప్రకారం మహిళలకు ఇక తాము పనిచేస్తున్న చోట రెస్ట్ రూం సౌకర్యం కల్పిస్తారు. కొన్ని గంటల తర్వాత తప్పనిసరి బ్రేక్ కూడా ఇస్తారు. మహిళలతో ఎక్కువ సేపు పనిచేయించే ప్రాంతాల్లో, వారికి హాస్టల్ సౌకర్యం కూడా అందిస్తారు. "ఈ నియమాలను ఉల్లంఘిస్తే పరిశ్రమలకు 2 వేల నుంచి లక్ష రూపాయల జరిమానా విధిస్తాం" అని అధికారులు చెబుతున్నారు.