ముఖంపై ఒక్క ముడత కూడా లేకుండా చేసే చిట్కాలివి
వయసు పెరుగుతున్న కొద్దీ తెల్ల వెంట్రుకలు రావడం ఎంత కామనో.. ముఖంపై ముడతలు ఏర్పడటం కూడా అంతే కామన్. అయితే కొన్ని కొన్ని సార్లు కాలుష్యం, ఎండ వల్ల కూడా చిన్న వయసులోనే ముడతలు ఏర్పడుతుంటాయి, వీటిని ఎలా తగ్గించాలంటే?
వృద్ధాప్య ప్రక్రియలో తెల్ల వెంట్రుకలు రావడం, ముఖంపై ముడతలు, గీతలు ఏర్పడటం చాలా కామన్. వయసు మీద పడుతున్న ఎవ్వరికైనా ముడతలు ఖచ్చితంగా వస్తాయి. అయితే కొంతమందికి చిన్న వయసులో కూడా ముఖంపై ముడతలు ఏర్పడుతుంటాయి. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
ఎలాంటి రక్షణ లేకుండా ఎండలో ఎక్కువ సేపు ఉండటం, కాలుష్యం, వాటర్ తాగకపోవడం, చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించకపోవడం వల్ల కూడా చిన్నవయసులోనే ముఖంపై ముడతలు వస్ తాయి. అలాగే మీ చర్మం తేమను, స్థితిస్థాపకతను కోల్పోయినప్పుడు కూడా ముడతలు, గీతలు లోతుగా ఉంటాయి. అలాగే ఇవి ముఖంపై క్లియర్ గా కనిపిస్తాయి. ఈ ముడతలు కనిపించకుండా చేయడం సాధ్యం కాని పని. కానీ వృద్ధాప్య సంకేతాలను నెమ్మదించేలా మాత్రం చేయొచ్చు.
ముఖంపై ముడతలు ఎందుకు వస్తాయి?
ముడతలకు అసలు కారణం వృద్ధాప్యం. ఎందుకంటే కాలక్రమేణా మన చర్మం సహజంగా పొడిగా, సన్నగా మారుతుంది. అలాగే తక్కువ స్థితిస్థాపకతను కలిగి ఉండటం వల్ల ఇలా ముడతలు ఏర్పతాయి. అలాగే సూర్యుడి నుంచి వచ్చే యూవీ రేడియేషన్ వల్ల కొల్లాజెన్, ఎలాస్టిన్ విచ్చిన్నం అవుతుంది. ఇవే మన చర్మాన్ని మృదువుగా ఉంచే అవసరమైన ప్రోటీన్లు. ఇవి విచ్చిన్నం కావడం వల్ల ముడతలు ఏర్పడతాయి. అలాగే స్మోకింగ్ వల్ల కూడా ముడతలు వస్తాయి. దీనివల్ల చర్మంలో రక్త ప్రవాహం తగ్గుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో చర్మ వృద్ధాప్య ప్రక్రియ పెరుగుతుంది.
కొన్ని ముఖ కవళికల వల్ల కూడా ముడతలు ఏర్పడతాయి. అంటే మెల్లకన్ను లేదా చిరునవ్వు వంటి పునరావృత ముఖ కవళికల వల్ల కూడా శాశ్వత గీతలు చర్మంపై ఏర్పడతాయి. అలాగే మీ చర్మంలో తేమ తగ్గితే కూడా ముడతలు ఎక్కువగా కనిపిస్తాయి. జెనెటిక్స్ వల్ల కూడా ముడతలు వచ్చే అవకాశం ఉంది. అలాగే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు శరీరంలో తగ్గడం వల్ల కూడా చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. నిద్రలేమి వల్ల కూడా అకాల వృద్ధాప్యానికి దారితీస్తుంది.
ముఖంపై ముడతలను తగ్గాలంటే ఏం చేయాలి?
ఎండ నుంచి రక్షణ
మీరు ఇంట్లో ఉన్నా, బయట పనిచేస్తున్నా.. మీ చర్మాన్ని ఎండ నుంచి రక్షించడం చాలా అవసరం. అందుకే బయటకు వెళితే ఖచ్చితంగా తలకు టోపీ పెట్టండి. అలాగే ఎండ తగలకుండా ఫుల్ హ్యాండ్స్ దుస్తులను వేసుకోండి. అలాగే యూవీ కిరణాలు హానిచేయకుండా సన్ గ్లాసెస్ ను ఖచ్చితంగా పెట్టుకోండి. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అసోసియేషన్ ప్రకారం.. సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ 30 తో బ్రాడ్-స్పెక్ట్రం ఉన్న వాటర్ రెసిస్టెంట్ సన్స్క్రీన్ వాడితే మంచిది.
కలబంద జెల్
కలబంద జెల్ మన చర్మానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. క్లినికల్, కాస్మెటిక్ అండ్ ఇన్వెస్టిగేషనల్ డెర్మటాలజీ జర్నల్లో ప్రచురించబడిన 2015 అధ్యయనంలో.. 20 నుంచి 50 సంవత్సరాల వయస్సున్న వారు 8 వారాల పాటు కలబంద సప్లిమెంట్లను తీసుకున్నారు. దీనివల్ల వారి ముఖంలో ముడతలు చాలా వరకు తగ్గాయని పరిశోధనలో తేలింది. కలబంద జెల్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అలాగే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇందుకోసం మీరు ఫ్రెష్ కలబంద జెల్ ను ముఖానికి పెట్టొచ్చు. ముఖానికి 15 నుంచి 20 నిమిషాలు ఉంచిన తర్వాత కడిగేస్తే చాలు. ఇలా రోజూ చేస్తే ముడతలు చాలా వరకు తగ్గుతాయి.
కొబ్బరి నూనె
అవును కొబ్బరి నూనె కూడా ముఖంపై ముడతలను పోగొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. కొబ్బరి నూనెను వాడటం వల్ల మీ చర్మం హైడ్రేట్ గా ఉంటుంది. అలాగే చర్మ స్థితిస్థాపకత కూడా మెరుగుపడుతుంది. రాత్రి పడుకునే ముందు కొంచెం కొబ్బరి నూనె ముఖానికి రాసి కొద్ది సేపు మసాజ్ చేయండి.
అరటి మాస్క్
అరటి పండులో ఉండే సిలికా చర్మంలో కొల్లాజెన్ సంశ్లేషణ చేయడానికి సహాయపడుతుంది. ఇది కండరాలకు, చర్మానికి, ఎముకలకు చాలా అవసరం. ముఖంపై ముడతలు పోవాలంటే బాగా పండిన అరటిపండు గుజ్జులా డిఐవై ఫేస్ మాస్క్ లా అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని నీట్ గా కడిగేయండి. ఇది వాపును తగ్గిస్తుంది.
తేనె, పెరుగు మాస్క్
తేనె మీ చర్మాన్ని తేమగా చేస్తుంది. ఇకపోతే పెరుగు చర్మంలో స్థితిస్థాపకతను మెరుగ్గా ఉంచుతుంది. 2011 లో జర్నల్ ఆఫ్ కాస్మెటిక్ సైన్స్ లో ప్రచురించిన పరిశోధనలో ఈ విషయం తేలింది. సాదా పెరుగును తీసుకుని అందులోని తేనెను కలిపి ముఖానికి పెట్టాలి. 15 నుంచి 20 నిమిషాల తర్వాత మంచి నీళ్లతో కడగాలి. వారానికి ఒకసారి ఈ హోం మేడ్ ఫేస్ మాస్క్ ను ఉపయోగిస్తే ముడతలు తగ్గి మీ ముఖంలో గ్లో వస్తుంది.
ఎగ్ వైట్ మాస్క్
ఎగ్ వైట్ ఫేస్ మాస్క్ కూడా మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఎగ్ వైట్ మీ చర్మాన్ని బిగుతుగా చేయడానికి, సన్నని గీతలను, ముడతలను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. ఇందుకోసం తెల్లసొనను నేరుగా ముఖానికి అప్లై చేయండి. ఇది పూర్తిగా ఆరే వరకు ఉంచి తర్వాత కడిగేయండి. వారానికి రెండుసార్లు ఎగ్ వైట్ ఫేస్ మాస్క్ వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.