Asianet News TeluguAsianet News Telugu

ఉసిరి ఔషదసిరి

మనకు తెలిసి ఉసిరిలో రెండు రకాలు... ఒకటి పుల్లని నేల ఉసిరి, మరొకటి తీపీ వగరూ పులుపూ కలగలిసినట్లుండే రాతి ఉసిరి. నేల ఉసిరిని నేరుగా తినడానికో పులిహోరకో వాడటంతోపాటు ఆ పొడిని దుస్తుల అద్దకాల్లోనూ వాడతారు.

Health benefits and  Uses of Gooseberry
Author
Hyderabad, First Published Dec 7, 2021, 2:06 PM IST

 

ఆయుర్వేద వైద్యానికి ఉసిరే కీలకం. అందుకే ప్రతీ వ్యక్తీ తన జీవిత కాలంలో ఐదు ఉసిరి మొక్కలయినా నాటాలని పెద్దవాళ్లు చెబుతారు. ఉసిరిని సంస్కృతంలో ఆమ్లా లేదా ధాత్రీఫలం అని పిలుస్తారు. మనకు రోగనిరోధకశక్తి పెరగాలంటే సి - విటమిన్‌ ఎక్కువగా ఉండే పండ్లూ కూరగాయలూ తినాలి. కరోనా పుణ్యమా అని ఈ విషయం మాటలు సరిగ్గా రాని పసివాళ్ల నుంచి చదువురాని వృద్ధుల వరకూ అందరికీ నోటిమాటగా మారిపోయింది. అయితే ఆ విటమిన్‌ ఎక్కువగా ఉండే పండు ఏదీ అంటే మాత్రం నారింజ, నిమ్మ అనో చెబుతారు. కానీ అందులో తొలి స్థానం మన ఉసిరి ( ఇండియన్‌ గూస్‌బెర్రీ )దే... దానికి సీజన్‌ కూడా ఇదే. 

ప్రకృతిలో ఆరోగ్యఫలాల్ని అందించే చెట్లు ఎన్నో ఉన్నాయి. అయితే అటు ఆరోగ్యంతోపాటు ఇటు దైవ సమానంగా పూజలందుకునే చెట్లు కొన్నే ఉంటాయి. అలాంటి పవిత్ర వృక్షాల్లో ఒకటి ఉసిరి. దేవ దానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరబాటున భూమ్మీద పడటంతో పుట్టిందే ఉసిరి అన్నది ఓ కథనం. పూజల్లోనూ వ్రతాల్లోనూ ఉసిరికి విశిష్ట స్థానం ఉంది. చెట్టుని పూజించడంతోపాటు కాయల్నీ దీపాలుగా వాడుతుంటారు.  ఉసిరి కాయలు వేసవి వరకూ కాస్తూనే ఉంటాయి. వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వని ఔషధ మొక్కల్లో ఉసిరి ఎంతో ఉత్తమం అని చరక సంహిత పేర్కొంటోంది. 

మనకు తెలిసి ఉసిరిలో రెండు రకాలు... ఒకటి పుల్లని నేల ఉసిరి, మరొకటి తీపీ వగరూ పులుపూ కలగలిసినట్లుండే రాతి ఉసిరి. నేల ఉసిరిని నేరుగా తినడానికో పులిహోరకో వాడటంతోపాటు ఆ పొడిని దుస్తుల అద్దకాల్లోనూ వాడతారు. రాతి ఉసిరిలో వేరు నుంచి చిగురు వరకూ ప్రతీ భాగమూ ఔషధమే. దీని కొమ్మలు సన్నగా ఆకులు చిన్నగా ఉంటాయి. ఓ దశలో చెట్టంతా మోడయిపోతుంది. కొన్నిరోజులకి ఆ కొమ్మలన్నీ లేత పసుపురంగులో కనిపిస్తే చిగురేయకుండానే పూసిందేమో అనుకుంటాం. కానీ అవే మెల్లగా ఆకులుగా విచ్చుకుంటాయి. పూలలా కనిపించే ఈ చిగుళ్లూ ఆరోగ్యమేనట. అవి కాస్త పెరిగాక లేతపచ్చ కలిసిన పసుపురంగులో పూత వస్తుంది. అది పిందె తొడిగి లేతాకుపచ్చ రంగు కాయగా మారుతుంది. ఈమధ్య కొందరు వ్యవసాయ నిపుణులు లేత గులాబీరంగు ఉసిరికాయల సాగు అభివృద్ధి చేయడం విశేషం.

పోషక సిరి:- అరటిపండు, ఆపిల్‌ పండు మాదిరిగా ఉసిరికాయని కొరికి తినడం కష్టమే... ఎందుకంటే పులుపు దీని ఇంటిపేరు. కానీ ఆ పులుపే ఈ పండుకున్న బలం. కమలాలతో పోలిస్తే ఉసిరిలో విటమిన్‌ - సి 20 రెట్లు ఎక్కువ. ఆపిల్‌లోకన్నా మూడురెట్లు ప్రొటీన్లు ఎక్కువ. ఇతర పండ్లలోకన్నా యాంటీఆక్సిడెంట్లూ ఎక్కువే. మొత్తంగా అనేకానేక రోగాలకు ప్రకృతి ప్రసాదించిన వరమే ఉసిరి. అందుకే దీన్ని ‘సర్వదోషహర’ అనీ పిలుస్తారు. ఈ కాయల్ని ఎండబెట్టి నిల్వచేసుకుని ఏడాది పొడవునా వాడతారు. తాజా వాటితో పచ్చడి పులిహోరా... వంటివి చేయడంతోపాటు మురబ్బా రూపంలో పంచదార పాకంలో నిల్వచేసుకునీ తింటారు. నిల్వపచ్చడి రూపంలో వాడుకున్నా ఉసిరి అద్భుత ఔషధమే. కానీ వీలైనంత వరకూ వాటిల్లో పంచదారా ఉప్పూ బాగా తగ్గించి తినాలి. 

అలాగే ఉసిరికాయలతో రైతాలానూ చేసుకోవచ్చు. వంద గ్రా. రాతి ఉసిరిలో 80 శాతం నీరూ కొద్దిపాళ్లలో ప్రొటీన్లూ పిండిపదార్థాలూ పీచూ లభిస్తాయి. 470 నుండి 680 మి.గ్రా. సి - విటమిన్‌ లభ్యమవుతుంది. ఎంబ్లికానిన్‌ - ఎ, ఎంబ్లికానిన్‌ - బి, ప్యునిగ్లుకానన్‌ వంటి పాలీఫినాల్సూ, ఎలాజిక్‌, గాలిక్‌ ఆమ్లం... వంటి ఫ్లేవనాయిడ్లూ పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, ఐరన్‌, ఫాస్ఫరస్‌, పొటాషియం... వంటి ఖనిజాలూ ఉసిరిలో దొరుకుతాయి. ఇతర పండ్లలో మాదిరిగానే ఇందులో పీచూ ఎక్కువే.

ఆరోగ్య సిరి:- ఉసిరి త్రిదోషహరిణి అంటోంది ఆయుర్వేదం. అన్ని అవయవాలూ సమన్వయంతో పనిచేసేలా చేస్తుందట. అందుకే అద్భుత ఔషధంగా చెప్పే చ్యవన్‌ప్రాశ్‌ తయారికి ఆమ్లానే ప్రధానం. పరగడుపున కాస్త ఉసిరి పొడిని నీళ్లలో కలుపుకుని తాగితే దీర్ఘకాలిక దగ్గు, అలర్జీ, ఆస్తమా, టీబీ... వంటివన్నీ తగ్గుతాయని చెబుతారు సంప్రదాయ వైద్యులు. ముఖ్యంగా జలుబుతో బాధపడేవాళ్లు రెండు టీ స్పూన్ల ఉసిరి పొడీ తేనే కలిపి పేస్టులా చేసుకుని రోజుకి రెండుమూడుసార్లుగా తింటే చాలా వరకూ తగ్గుతుందట. ఇతరత్రా ఇన్ఫెక్షన్లనీ ఇది తగ్గిస్తుంది. అందుకే ఫ్లూ తరహా జ్వరాల నివారణకి ఉసిరి ఉత్తమోత్తమ ఔషధం.

తిన్నది ఒంటికి పట్టేలా చేయడం లోనూ దీన్ని మించింది లేదు. ఎండు ఉసిరి జీర్ణసంబంధమైన అన్ని సమస్యల్నీ నివారిస్తుందనీ భోజనం తరవాత తింటే మరీ మంచిదనీ అంటారు. ఇది జీవక్రియని పెంచడంతోపాటు ఇందులోని పీచు ఆకలినీ తగ్గిస్తుంది. దాంతో ఊబకాయాన్నీ అడ్డుకోవచ్చు. మలబద్ధకం కూడా ఉండదు.

కాలేయ వ్యాధులకీ ఉసిరి దివ్యౌషధం. శరీరంలోని విషతుల్యాలనీ తొలగిస్తుంది. డయేరియా డీసెంట్రీలనీ ఉసిరి తగ్గిస్తుంది. మెదడు పనితీరుని మెరుగుపరుస్తుందనీ, తద్వారా జ్ఞాపకశక్తీ, తెలివితేటలూ పెరుగుతాయనీ చెబుతారు. నెలసరి సమస్యల్ని తగ్గించి, సంతానో త్పత్తి సామర్థ్యాన్నీ పెంచుతుందనీ, వీర్యసమృద్ధికీ తోడ్పడుతుందనీ చెబుతారు.

ఊపిరితిత్తుల వ్యాధులకు ఉసిరిని మించిన మందు మరొకటి లేదట. రోజూ ఓ ఉసిరికాయని తింటే కఫ సమస్యలన్నీ తొలగిపోతాయి. కంటి సమస్యలకి ఉసిరి మంచిదన్న కారణంతో దీన్ని చక్షు క్షయ అనీ పిలుస్తారు. ఉసిరికాయల్ని ముద్దగా చేసి తలకి పట్టిస్తే కళ్ల మంటలు తగ్గుతాయట. ముఖ్యంగా ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీరాడికల్స్‌ కారణంగా కణాలు దెబ్బతినకుండా చేయడంతో చర్మం త్వరగా ముడతలు పడకుండా ఉంటుంది.

ఆయుర్వేదమే కాదు, అల్లోపతీ సైతం ఉసిరిని ఔషధ సిరి అని పొగుడుతోంది. ఇందులో యాంటీమైక్రోబియల్‌, యాంటీవైరల్‌ గుణాలు అధికంగా ఉన్నాయనీ, ఇది రక్తప్రసారాన్ని మెరుగుపరుస్తుందనీ గ్యాస్ట్రిక్‌ సమస్యల్నీ కొలెస్ట్రాల్‌నీ తగ్గిస్తుందనీ చెబుతోంది. ఇందులో ఉండే క్రోమియం ఇన్సులిన్‌ స్రావాన్నీ పెంచడం ద్వారా చక్కెర నిల్వల్ని తగ్గించి హృద్రోగాలూ మధుమేహం... వంటివి రాకుండా అడ్డుకుంటుందనీ తేలిందట. కొన్ని రకాల క్యాన్సర్లను సైతం తగ్గించగల గుణాలు ఉసిరికి ఉన్నాయట. ఎలా చూసినా ఉసిరిలో రోగనిరోధకశక్తిని పెంచే లక్షణాలు అనేకం. అందుకే మనదేశంలో పండే ఈ ఉసిరిని పొడి, క్యాండీలు, రసం, ట్యాబ్లెట్ల రూపంలో నిల్వచేసి ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తున్నారు.

సౌందర్యలహరి :- కేశసంరక్షణకు ఉసిరి ఎంతో మేలు. రోజూ తాజా ఉసిరిని తినడం లేదా దాని గుజ్జుని కుదుళ్లకు పట్టించడం వల్ల శిరోజాలు బాగా పెరగడంతోబాటు నల్లగా ఉంటాయి. దీంతో చేసే షాంపూలూ నూనెలూ జుట్టుకి మంచివే. ఇవి బాల నెరుపునీ చుండ్రునీ తగ్గిస్తాయి. ఆ కారణంతోనే ఈమధ్య హెయిర్‌ఆయిల్స్‌లో ఉసిరిని విరివిగా వాడుతున్నారు. అలాగే ఇందులోని సి-విటమిన్‌ ఎండ నుంచీ చర్మరోగాల నుంచీ కాపాడటమే కాదు, శరీరానికి మంచి మెరుపునీ ఇస్తుంది. రోజూ ఓ ఉసిరికాయని తింటే కాల్షియం శోషణ పెరుగుతుంది. దాంతో ఎముకలూ, దంతాలూ, గోళ్లూ, వెంట్రుకలూ ఆరోగ్యంగా ఉంటాయి. అందుకే మరి, తాజాగా, ఎండు పండుగా, ట్యాబ్లెట్‌గా లేదా పొడి రూపంలో-ఎలా తీసుకున్నా ఉసిరి... అందాన్నీ ఆరోగ్యాన్నీ సంరక్షించే అద్భుత ఔషధ సిరి.

ఉసిరి కాని ఉసిరి:- గూస్‌బెర్రీ... ఇవి ఉసిరికాయల్నే తలపిస్తాయి. కానీ ఉసిరి కాదు. వీటిని యూరోపియన్‌ గూస్‌బెర్రీ అంటారు. వీటిని అలా పిలవడంవల్లే మన ఉసిరి ( ఆమ్లా )ని ‘ఇండియన్‌ గూస్‌బెర్రీ’ అని ప్రత్యేకంగా పిలుస్తారు పాశ్చాత్యులు. చూడ్డానికి ఒకేలా ఉన్నప్పటికీ ఈ ఐరోపా గూస్‌బెర్రీలు, పొదలకి కాస్తాయి. ఆకుపచ్చ రంగుతో పాటు ఎరుపు, ఊదా, పసుపు, తెలుపు... ఇలా వేర్వేరు రంగుల్లోనూ ఉంటాయివి. ఐరోపా, పశ్చిమాసియా దేశాలతోబాటు ఉత్తర భారతదేశంలోనూ హిమాలయశ్రేణుల్లోనూ ఇవి ఎక్కువగా పెరుగుతాయి. చిత్రంగా వీటితోనూ నిల్వ పచ్చళ్లు పడతారు. మురబ్బా తయారుచేస్తారు. ఎండబెట్టీ తింటారు. జామ్‌లు చేస్తారు. 

జ్యూస్‌ రూపంలో తాగుతారు. ఇతరత్రా పోషకాలు ఉసిరిలో మాదిరిగానే ఉన్నప్పటికీ సి-విటమిన్‌ శాతం మాత్రం గూస్‌బెర్రీలో తక్కువ. కానీ నిమ్మ, నారింజలతో పోలిస్తే ఎక్కువే. ఎ-విటమిన్‌ కూడా పుష్కలంగా ఉండటంతో ఇవి కళ్ల సమస్యల్ని తగ్గిస్తాయి. పైగా ఇందులోని ఫైటో కెమికల్సూ ఆంథోసైనిన్లూ బీపీ, హృద్రోగాలూ మధుమేహం నియంత్రణకీ తోడ్పడతాయి. జీర్ణశక్తిని పెంచి, బరువునీ తగ్గిస్తాయి. వీటిని టీ లేదా జ్యూస్‌ రూపంలో తాగితే జలుబూ ఫ్లూ జ్వరాలకీ ఉపశమనం లభిస్తుంది. అందుకే ఉసిరిలానే ఇదీ అద్భుతమైన ఓషధీఫలమే. 

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Follow Us:
Download App:
  • android
  • ios