- Home
- Telangana
- Weather Update: 5 తుపాన్లు.. మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో 4 రోజులు భారీ వర్షాలు.. ఏ ఏ జిల్లాల్లో అంటే?
Weather Update: 5 తుపాన్లు.. మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో 4 రోజులు భారీ వర్షాలు.. ఏ ఏ జిల్లాల్లో అంటే?
Weather Update: రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం కూల్ అయింది. ఒడిశా అల్పపీడనంతో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ, కోస్తాంధ్రకు ఐఎమ్‌డీ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌లో వానలు పడుతున్నాయి.

ఐఎమ్‌డీ అలర్ట్: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాల వాతావరణంలో ఒక్కసారిగా పెద్ద మార్పు వచ్చింది. గత కొద్దిరోజులుగా ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బంది పడ్డ ప్రజలకు ఐఎండీ కూల్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి రావడంతో పాటు ఒడిశా తీరంలో బలమైన అల్పపీడనం ఏర్పడటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు దంచికొట్టనున్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఒడిశా అల్పపీడనం.. తెలంగాణకు వాన ముప్పు
ఒడిశాపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తీవ్ర అల్పపీడనంగా మారింది. దీని చుట్టూ గంటకు 40 కిలోమీటర్ల వేగంతో సుడిగాలులు తిరుగుతున్నాయి. ఇది ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఏపీల పై బలమైన ప్రభావం చూపుతోంది. దీనివల్ల తెలంగాణలోని ఉత్తర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. దీని తీవ్రత మరింత పెరిగే అవకాశముందని ఐఎండీ వర్గాలు పేర్కొంటున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు.
ఉత్తర తెలంగాణాలో బిగ్ అలర్ట్
ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగుల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో గాలివాన విరుచుకుపడే ప్రమాదం ఉంది.
హైదరాబాద్ వాతావరణం ఎలా ఉందంటే?
హైదరాబాద్ సహా చుట్టుపక్కల జిల్లాల్లో ఆకాశం ఆదివారం రోజంతా మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 29°C నుంచి 30°C మధ్య, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 23°C గా నమోదవుతాయి. ఉక్కపోత తగ్గి నగరం హాయిగా కూల్ గా మారనుంది.
ఏపీలో వాతావరణం ఎలా ఉందంటే?
ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 23 నుంచి 26 వరకు అస్థిర వాతావరణం కొనసాగుతుంది. ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. రాయలసీమ, దక్షిణ తీర ప్రాంతాల్లో వేడి, తేమ ఎక్కువగా ఉన్నప్పటికీ తిరుపతి సహా కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయి. ఏపీలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నాయి.
పసిఫిక్‌లో 5 తుపాన్లు.. జాగ్రత్తలు తప్పనిసరి
మరోవైపు గ్లోబల్ వాతావరణాన్ని పరిశీలిస్తే ఎల్ నినో ప్రభావంతో పసిఫిక్ మహాసముద్రంలో సాడెల్ (గంటకు 215 కి.మీ వేగం), నర్రా, లాలా, మోక్, 19W అనే 5 తీవ్ర తపాన్లు, 3 వాయుగుండాలు ఏర్పడ్డాయి. బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ఒడిశాలోని భువనేశ్వర్, బాలాసోర్ మీదుగా బెంగాల్ వైపు వెళ్లనుంది. కాబట్టి ప్రజలు ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు చెట్ల కింద నిలబడకుండా, విద్యుత్ తీగలకు దూరంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

