- Home
- Telangana
- Hyderabad Real Estate : మూడు నెలల్లోనే ఎకరం ధర ఏకంగా రూ.27 కోట్లు పెరిగిందా? అక్కడ అసలు ధర తెలిస్తే షాక్
Hyderabad Real Estate : మూడు నెలల్లోనే ఎకరం ధర ఏకంగా రూ.27 కోట్లు పెరిగిందా? అక్కడ అసలు ధర తెలిస్తే షాక్
సాధారణంగానే భూముల ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి… కాబట్టి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా రాయదుర్గంలో ఎకరా ధర ఏకంగా రూ.264 కోట్లు పలికింది.

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ జోరు
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం సరికొత్త చరిత్రను తిరగరాసింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నింటినీ దాటేసి, రికార్డు స్థాయి ధరలతో ఐటీ కారిడార్ దూసుకుపోతోంది. భాగ్యనగరంలోని అత్యంత కీలకమైన రాయదుర్గం ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. ఇటీవల తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) నిర్వహించిన వేలంలో ఎకరం భూమి ధర ఏకంగా రూ. 264 కోట్లు పలికి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మొత్తం 5.25 ఎకరాల భూమిని వేలం వేయగా, ప్రభుత్వం ఏకంగా రూ. 1,386 కోట్లను రాబట్టుకుంది. హైదరాబాద్ వేగవంతమైన వృద్ధికి, ఐటీ కారిడార్‌లోని ల్యాండ్ డిమాండ్‌కు ఈ ఘనతే ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది.
ఎకరా రూ.264 కోట్లా..!
TGIIC నిర్వహించిన ఈ ఈ-వేలంలో రాయదుర్గంలోని సర్వే నంబర్ 83లో ఉన్న 'పి1' (P1) ప్లాట్‌ను విక్రయానికి ఉంచారు. ప్రభుత్వం ఈ స్థలానికి ఎకరాకు కనీస ధర (ఆఫ్‌సెట్ ప్రైస్) రూ. 175 కోట్లుగా నిర్ణయించింది. అయితే వ్యాపార దిగ్గజాలు, ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు ఈ విలువైన స్థలం కోసం తీవ్రంగా పోటీపడ్డాయి. దాదాపు ఐదారు అగ్రగామి సంస్థలు రసవత్తరమైన పోరులో పాల్గొని బిడ్లను పెంచుకుంటూ పోయాయి. చివరకు 'ఎంఎస్ఎన్ రియాల్టీ' (MSN Realty) సంస్థ అత్యధికంగా ఎకరాకు రూ. 264 కోట్ల బిడ్ దాఖలు చేసి, ఈ స్థలాన్ని కైవసం చేసుకుంది. పోటీ తీవ్రంగా ఉండటంతో ప్రభుత్వానికి ఆశించిన దానికంటే భారీ స్థాయిలో ఆదాయం సమకూరింది.
హైదరాబాద్ లో భూములకు రెక్కలు
గత కొన్ని నెలల పరిణామాలను పరిశీలిస్తే, హైదరాబాద్‌లోని ఈ ప్రాంతంలో భూముల విలువ ఎంత వేగంగా పెరుగుతుందో స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం మూడు నెలల క్రితమే TGIIC ఇదే రాయదుర్గం ప్రాంతంలో 6.29 ఎకరాల భూమిని వేలం వేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఎకరం ధర రూ. 237 కోట్లు పలికి రికార్డు సృష్టించింది. కానీ కేవలం 90 రోజుల వ్యవధిలోనే ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. మూడు నెలల స్వల్ప కాలంలోనే ఎకరం భూమిపై ఏకంగా రూ. 27 కోట్లు పెరిగి రూ. 264 కోట్లకు చేరడం రియల్ ఎస్టేట్ నిపుణులను సైతం విస్తుపోయేలా చేస్తోంది.
అయితే తెలంగాణ ప్రభుత్వం మరోసారి రాయదుర్గంలో భూముల వేలానికి సిద్ధమైంది. ఆగస్టు 28న ఈ-వేలం ద్వారా TGIIC మరో 5.38 ఎకరాల విలువైన భూమిని విక్రయించనుంది. ప్రస్తుతం పలికిన రూ. 264 కోట్ల ధరల రికార్డు నేపథ్యంలో వచ్చేవారం జరగబోయే వేలంలో ఎకరం ధర ఏ స్థాయిని తాకుతుందో అని రియల్ ఎస్టేట్ వర్గాలు, పారిశ్రామికవేత్తలు తీవ్ర ఆసక్తితో గమనిస్తున్నారు. ఈ కొత్త వేలం కూడా భారీ ధరను నమోదు చేస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బూమ్ కు కారణాలేంటో తెలుసా?
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో భూముల ధరలు ఈ స్థాయిలో ఆకాశాన్ని తాకడానికి ప్రధాన కారణం ఏమిటనే దానిపై రియల్ ఎస్టేట్ నిపుణులు స్పష్టమైన వివరణ ఇస్తున్నారు. హైదరాబాద్‌లో అమలులో ఉన్న 'అపరిమిత ఎఫ్‌ఎస్‌ఐ' (Unlimited FSI - Floor Space Index) విధానమే దీనికి ప్రధాన చోదక శక్తిగా నిలుస్తోందట. దేశంలోని మిగిలిన మెట్రో నగరాలైన ముంబై, బెంగళూరు, ఢిల్లీలలో భూమి వైశాల్యానికి తగినట్లుగా పరిమిత సంఖ్యలో మాత్రమే అంతస్తులు నిర్మించడానికి అనుమతులు ఉంటాయి. కానీ హైదరాబాద్‌లో కొన్ని (రిజర్వుడ్, ఆర్మీ, పర్యావరణ మండలాలు) మినహా మిగిలిన ప్రాంతాల్లో ఎఫ్‌ఎస్‌ఐపై ఎలాంటి ఆంక్షలు లేవు.
అపరిమిత ఎఫ్‌ఎస్‌ఐ సౌకర్యం ఉండటం వల్ల డెవలపర్లు ఎంత ఎక్కువ డబ్బు పెట్టి భూమి కొనుగోలు చేసినా.. దానికి తగినట్లుగా 40 నుండి 50 అంతస్తులకు పైగా ఆకాశహర్మ్యాలను (Skyscrapers) నిర్మించుకోవచ్చు. దీనివల్ల నిలువునా (వర్టికల్‌గా) ఎక్కువ విస్తీర్ణంలో కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాజెక్టులను చేపట్టి విక్రయించే వీలుంటుంది. రాయదుర్గం ప్రాంతం ఇప్పటికే గచ్చిబౌలి, హైటెక్ సిటీలకు అత్యంత సమీపంలో ఉండటం, మెట్రో రవాణా, ఔటర్ రింగ్ రోడ్డు అనుసంధానం, ప్రపంచస్థాయి కంపెనీలు కొలువుదీరడం వంటివి దీనికి మరింత ప్లస్ పాయింట్‌గా మారాయి. మొత్తంమీద రాయదుర్గం ల్యాండ్ అక్షన్ భాగ్యనగరం క్రేజ్‌ను మరోసారి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది.

