Temple: ఒకే దగ్గర 12 జ్యోతిర్లింగాలు, తెలంగాణ మినీ మాల్దీవులు.. హైదరాబాద్ దగ్గరలోనే..
Temple: జీవితంలో ఒక్కసారైనా ద్వాదశ జోతిర్లింగాలు అన్నీ దర్శించుకోవాలని చాలా మంది ఆశపడుతూ ఉంటారు. అయితే, 12 జోతిర్లింగాలను ఒకే గుడిలో చూడొచ్చు.. అది కూడా హైదరాబాద్ కి దగ్గరలోనే అని మీకు తెలుసా?

12జోతిర్లింగాలు ఒకేచోట..
లాంగ్ వీకెండ్ వస్తే చాలు.. ఈ మధ్యకాలంలో చాలా మంది ఫ్యామిలీతో కలిసి మాల్స్ లోనే సమయం గడిపేస్తున్నారు. అప్పుడే అదే మాల్స్ కి వెళ్లి బోర్ గా అనిపిస్తే.. ఈ వీకెండ్ హైదరాబాద్ కి దగ్గరలో ఉన్న ఈ టెంపుల్ కి కచ్చితంగా వెళ్లాల్సిందే. ఆధ్యాత్మిక ప్రశాంతతతో పాటు ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి ఒక అద్భుతమైన క్షేత్రం సోమశిల . నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలో, కృష్ణానది ఒడ్డున ఉన్న శ్రీ లలితా సోమేశ్వర స్వామి ఆలయ సముదాయం ఆధ్యాత్మిక భావనను కలిగిస్తుంది.
ఈ ఆలయం ప్రత్యేకత..
సోమశిల క్షేత్రం కేవలం ఒక్క దేవాలయం మాత్రమే కాదు, ఇక్కడ 15 పురాతన శివాలయాల సముదాయం ఉంది.
ద్వాదశ జ్యోతిర్లింగాలు: ఈ ఆలయ ప్రాంగణంలోనే ప్రధాన దైవమైన శ్రీ లలితా సోమేశ్వర స్వామితో పాటు, దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల రూపాలను ప్రతిబింబించే శివలింగాలు కొలువై ఉన్నాయి. ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శిస్తే, దేశవ్యాప్తంగా ఉన్న 12 జ్యోతిర్లింగాలను దర్శించినంత పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం.
7వ శతాబ్దానికి చెందిన (చాళుక్యుల కాలం నాటి) ఈ ఆలయాలను శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం సమయంలో ముంపునకు గురికాకుండా, రాతిని రాతితో సేకరించి ఉన్నతమైన ప్రదేశానికి (పునర్నిర్మాణం) తరలించారు.
తెలంగాణ మినీ మాల్దీవులు..
కృష్ణానది బ్యాక్ వాటర్స్ చుట్టూ కొండలు, పచ్చదనంతో సోమశిల గ్రామం ఒక దీవిలా కనిపిస్తుంది. అందుకే పర్యాటకులు దీనిని తెలంగాణ 'మినీ మాల్దీవులు' అని కూడా పిలుస్తుంటారు.
బోటింగ్ అనుభూతి: తెలంగాణ టూరిజం (TSTDC) ఆధ్వర్యంలో ఇక్కడ బోటింగ్ సౌకర్యం ఉంది. కృష్ణానదిలో ప్రయాణిస్తూ చుట్టూ ఉన్న నల్లమల అటవీ అందాలను చూడటం మరచిపోలేని అనుభూతినిస్తుంది.
ఆలయ దర్శనం వివరాలు..
ఆలయ సమయాలు: ఉదయం 6:00 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు, సాయంత్రం 4:00 PM నుండి రాత్రి 8:00 PM వరకు ఆలయం తెరిచి ఉంటుంది.
ప్రత్యేక సమయాలు: కార్తీక మాసంలో ఇక్కడ శివరాత్రి, దివ్యమైన దీపోత్సవం అత్యంత వైభవంగా జరుగుతాయి.
హైదరాబాద్ నుండి ఎలా చేరుకోవాలి? హైదరాబాద్ నుండి సోమశిల కు సుమారు 180 - 186 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సొంత వాహనం లేదా, క్యాబ్ లో వెళితే.. నాలుగు గంటల్లో చేరుకోవచ్చు.
బస్సు సౌకర్యం: హైదరాబాద్ (ఎంజిబిఎస్) నుండి కొల్లాపూర్ వరకు బస్సులు ఉంటాయి, అక్కడి నుండి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోమశిలకు ఆటోలు లేదా లోకల్ బస్సుల్లో వెళ్లవచ్చు. అక్కడ రాత్రి బస చేయాలనుకునే పర్యాటకుల కోసం తెలంగాణ టూరిజం వారి 'హరిత హోటల్', కాటేజీలు అందుబాటులో ఉన్నాయి.

