- Home
- International
- Nepal Flash Floods: కైలాస యాత్రలో ఊహించని విషాదం.. సెకన్లలో కొట్టుకుపోయిన బ్రిడ్జిలు.. 160 మందికి పైగా మృతి
Nepal Flash Floods: కైలాస యాత్రలో ఊహించని విషాదం.. సెకన్లలో కొట్టుకుపోయిన బ్రిడ్జిలు.. 160 మందికి పైగా మృతి
Nepal Flash Floods: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన ల్యాండ్‌స్లైడ్ కారణంగా ఆకస్మిక వరదలు వచ్చాయి. 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 133 మంది భారతీయులు సహా వందలాది మంది గల్లంతయ్యారు. కైలాస యాత్రలో ఊహించని విషాదంతో చాలా మంది భారతీయులు గల్లంతయ్యారు.

నేపాల్ సరిహద్దులో ఆకస్మిక విలయం: అసలు ఏం జరిగింది?
నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ఊహించని పర్యావరణ విపత్తు ముంచెత్తింది. హిమపాతం, కొండచరియలు విరిగిపడటంతో ఒక్కసారిగా ఆకస్మిక వరదలు వచ్చాయి. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, ఈ కొండచరియలు విరిగిపడిన తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో కూడిన భూకంపంతో సమానంగా నమోదు కావడం గమనార్హం. ఈ దెబ్బకు మంచు, రాళ్లు, మట్టి, నీరు పెద్ద ఎత్తున 'ల్హెండే ఖోలా' నదిలోకి కొట్టుకొచ్చాయి. అక్కడి నుంచి 'భోటే కోశి', 'త్రిశూలి' నదుల ద్వారా నీరు ఉగ్రరూపం దాల్చి దిగువ ప్రాంతాలను ముంచెత్తింది.
163కు చేరిన మరణాలు.. వందలాది మంది అడ్రస్ లేదు
ఈ భయానక వరదల వల్ల ఇప్పటివరకు 163 మృతదేహాలను అధికారులు వెలికితీశారు. నూవాకోట్, రసువా, ధాడింగ్, చిత్రవాన్, గూర్ఖా వంటి జిల్లాలు దారుణంగా దెబ్బతిన్నాయి. అత్యధికంగా చిత్వాన్‌లో 64 మంది, ధాడింగ్‌లో 27 మంది మరణించారు. దాదాపు 750 మందికి పైగా జాడ తెలియకుండా పోయినట్లు నేపాల్ అధికారులు వెల్లడించారు. సరిహద్దుల్లోని టిబెట్ భూభాగంలో కూడా ముగ్గురు మరణించగా, 265 మంది గల్లంతయ్యారు. నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ మాట్లాడుతూ, శతాబ్ద కాలంలో ఇదొక అతిపెద్ద విపత్తు అని, గ్రామాలు క్షణాల్లో తుడిచిపెట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
133 మంది భారతీయ యాత్రికులు గల్లంతు: సహాయక చర్యలు వేగవంతం
పవిత్ర కైలాస మానససరోవర యాత్రకు వెళ్లిన భక్తులు ఈ విపత్తులో చిక్కుకున్నారు. వీరిలో 133 మంది భారతీయ యాత్రికుల అడ్రస్ దొరకడం లేదు. తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఈ జాబితాలో ఉన్నారు. ఈషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది సభ్యులు ఇమ్మిగ్రేషన్ సెంటర్ వద్ద ఉండగా వరదల్లో చిక్కుకున్నారని, వారితో కమ్యూనికేషన్ కట్ అయిందని సద్గురు తెలిపారు. బాధితులను రక్షించడానికి నేపాల్ ఆర్మీ, హెలికాప్టర్లను రంగంలోకి దించింది. భారత్ కూడా వెంటనే స్పందించి 10 టన్నుల సహాయక సామగ్రిని సీ-130జే విమానంలో ఖాట్మండుకు పంపింది.
కూలిపోయిన బ్రిడ్జిలు, పవర్ ప్రాజెక్టులు: ఊళ్లు జలమయం
వరద దెబ్బకు రవాణా వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. కనీసం 19 మోటారబుల్ వంతెనలు కొట్టుకుపోయాయి. కేవలం 30 సెకన్ల వ్యవధిలోనే ఒక భారీ బ్రిడ్జి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో పాటు 354 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 8 పవర్ ప్రాజెక్టులు పూర్తిగా దెబ్బతిన్నాయి. బెట్రావతి నుండి రసువాగధి సరిహద్దు వరకు ఉండే 42 కిలోమీటర్ల ప్రధాన రహదారి కొట్టుకుపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
బీహార్‌కు పొంచి ఉన్న ముప్పు: అప్రమత్తమైన యంత్రాంగం
నేపాల్‌లో ఉప్పొంగిన ప్రవాహం బీహార్‌లోని గండక్ నది వైపు రావడంతో అక్కడి ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. వాల్మీకినగర్ బ్యారేజీకి చెందిన మొత్తం 36 గేట్లను ఎత్తివేసి నీటిని కిందకు విడుదల చేశారు. రాత్రి వేళ 1.5 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రావడంతో ముంపు ప్రాంతాల నుంచి 4,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పశ్చిమ చంపారన్, గోపాల్‌గంజ్, ముజఫర్‌పూర్ జిల్లాల్లో ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF) బలగాలను మోహరించారు. ప్రస్తుతం గండక్ నదిలో నీటి మట్టం కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో అధికారులు ఉపశమనం పొందారు.

