- Home
- Feature
- Cyber Scam Alert : మీ అకౌంట్లో డబ్బులు పడ్డట్లు మెసేజ్ వచ్చిందో తస్మాత్ జాగ్రత్త... ఎందుకో తెలుసా?
Cyber Scam Alert : మీ అకౌంట్లో డబ్బులు పడ్డట్లు మెసేజ్ వచ్చిందో తస్మాత్ జాగ్రత్త... ఎందుకో తెలుసా?
పొరపాటున మీ అకౌంట్‌లోకి డబ్బులు పంపించామని సైబర్ కేటుగాళ్లు ఫోన్ చేస్తారు. డబ్బులు జమ అయినట్టు ఫేక్ SMS పంపి, ఆ డబ్బును తిరిగి పంపమని అడుగుతారు. ఈ మోసంలో చిక్కుకోకుండా ఎలా జాగ్రత్త పడాలో, నకిలీ SMSలను ఎలా గుర్తించాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.

ప్రజలారా.. తస్మాత్ జాగ్రత్త
మోసపోయేవాళ్లు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్లు పుట్టుకొస్తూనే ఉంటారు. అందుకే ఈ రోజుల్లో సైబర్ క్రైమ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ నేరాలపై జనాల్లో అవగాహన పెరుగుతున్న కొద్దీ, నేరగాళ్లు కూడా కొత్త కొత్త పద్ధతులు కనిపెడుతున్నారు. SMS లేదా వాట్సాప్ ద్వారా లింకులు పంపడం, వాటిని క్లిక్ చేయమని చెప్పడం, మీ డబ్బులు రెట్టింపు అవుతాయని ఆశ చూపడం, మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడ్డాయని చెప్పి లింక్ ఓపెన్ చేయమనడం... ఇలా రోజూ ఏదో ఒక సైబర్ మోసం గురించి వింటూనే ఉన్నాం. విచిత్రం ఏంటంటే, బాగా చదువుకున్న వాళ్లే లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు.
సైబర్ కేటుగాళ్ల కొత్త రకం మోసం
అయితే ఇప్పుడు వీటన్నింటికీ భిన్నంగా ఓ కొత్త మోసం మొదలైంది. ఇందులో మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. అవతలి వ్యక్తి, "మేడమ్/సార్, నేను ఓ మెడికల్ షాపుకో, కిరాణా కొట్టుకో డబ్బులు పంపబోయి పొరపాటున మీ నంబర్‌కు పంపించేశాను. మీకు మెసేజ్ కూడా వచ్చి ఉంటుంది చూడండి. దయచేసి ఆ డబ్బును నా ఈ నంబర్‌కు తిరిగి పంపిస్తారా?" అని చాలా వినయంగా అడుగుతారు.
ఈ మాట వినగానే మీరు కాస్త తెలివైన వాళ్లయితే ఇది ఫేక్ కాల్ అని అనుమానిస్తారు. కానీ అకౌంట్‌లోకి డబ్బులు వచ్చినట్టు SMS చూస్తే... అవతలి వ్యక్తి చెప్పింది నిజమేనేమో అనిపిస్తుంది. "అయ్యో పాపం... పొరపాటున పంపించాడు" అని జాలిపడి మీరు డబ్బులు తిరిగి పంపించారంటే, మీ అంత అమాయకులు ఇంకెవరూ ఉండరు. మీరు సైబర్ నేరగాళ్ల వలలో పడినట్లే... మీ డబ్బులను మీరే చేజేతులా వాళ్లకు అప్పగించినట్లు.
సైబర్ నేరగాళ్లు ఇలా కొత్తరకం వలపన్ని మీ అకౌంట్లోని డబ్బులు ఖాళీ చేస్తున్నారు. డబ్బులు వచ్చినట్లుగా మెసేజ్ మాత్రమే వస్తుంది… నిజానికి అకౌంట్లోకి డబ్బులు రావు. మీరు మెసేజ్ చూసి నిజంగానే అకౌంట్లోకి డబ్బులు వచ్చాయనుకుని మీ డబ్బులను సైబర్ నేరగాళ్లకు పంపిస్తారు. ఇలా చేజేతులా డబ్బులు పొగొట్టుకునేలా సైబర్ నేరాల బాాధితుల జాబితాలో చేరిపోతారు.
సైబర్ మోసాన్ని ఎలా గుర్తుపట్టాలి?
మీకు SMS వచ్చిన నంబర్‌ను ఒక్కసారి సరిగ్గా చెక్ చేయండి. బ్యాంకుల నుంచి గానీ, ఏవైనా ప్రభుత్వ సంస్థల నుంచి గానీ వచ్చే SMSలకు మొబైల్ నంబర్ ఉండదు. వాటికి ఒక ప్రత్యేకమైన కోడ్ ఉంటుంది. ఉదాహరణకు, SBI నుంచి వస్తే AX-SBYONO అని, కెనరా బ్యాంక్ నుంచి వస్తే CB-CANBNK, AX-CANBNK... ఇలా ఒక్కోదానికి ఒక్కోలా ఉంటుంది. అలా కాకుండా మామూలు మొబైల్ నంబర్ నుంచి మెసేజ్ వచ్చిందంటే అది కచ్చితంగా ఫ్రాడ్ అని అర్థం. వాళ్లు పంపే SMS అచ్చం బ్యాంక్ నుంచి వచ్చినట్టే ఉన్నా, పంపిన నంబర్ మొబైల్ నంబర్ అయితే అది మోసమేనని గుర్తుంచుకోండి. అలాంటి నంబర్లకు ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు పంపకండి.

