Hash Oil : హ్యాష్ ఆయిల్ అంటే ఏమిటి? దేనితో తయారు చేస్తారు.. లీటర్ ధర కోట్లలో ఎందుకు?
హైదరాాబాద్ లో తాజాగా కోట్ల విలువచేసే హ్యాష్ ఆయిల్ పట్టుబడింది. అసలు ఏమిటీ ఆయిల్? దేనితో, ఎలా తయారుచేస్తారు? దీని ధర కేవలం కొన్ని లీటర్లకే కోట్లాది రూపాయలు ఉంటుందా?

హైదరాబాద్ లో కోట్ల విలువైన హ్యాష్ ఆయిల్ పట్టివేత
Hash Oil : గంజాయిని కలిగివుండటం ఇల్లీగల్... దీన్ని సాగుచేసినా, సరఫరా చేసినా, వాడినా శిక్ష తప్పదు. అయితే గంజాయి మొక్కలను పెంచి, ఆకులను ఎండబెడ్డి స్మగ్లింగ్ చేయడం గురించి తరచూ వింటుంటాం... ఒక్కోసారి పచ్చి గంజాయిని అక్రమంగా రవాణా చేసే ముఠాలు పట్టుబడటం గురించీ వింటుంటాం. అయితే తాజాగా హైదరాబాద్ లో వింత గంజాయి రవాణా వ్యవహారం బైటపడింది... ఎండు గంజాయి లేదా పచ్చి గంజాయి కాదు ఏకంగా గంజాయి ఆయిల్ స్మగ్లింగ్ చేస్తూ ఓ ముఠా పట్టుబడింది.
ఆంధ్ర ప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మాడుగుల మండలం గెమ్మెల్లి గ్రామానికి చెందిన భార్యభర్తలు శ్రీను, నిబియా గంజాయి ఆయిల్ (హ్యాష్ ఆయిల్) అక్రమ రవాణా దందా చేస్తున్నారు. వీళ్లు కొందరు యువకులను డబ్బులతో మభ్యపెట్టి హ్యాష్ ఆయిల్ క్యారియర్లుగా ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు హ్యాష్ ఆయిల్ తరలిస్తున్న ఆరుగురిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎవ్వరికీ అనుమానం రాకుండా ఒక్కొక్కరు కడుపు, కాళ్లకు కిలో చొప్పున రెండు హ్యాష్ ఆయిల్ ప్యాకెట్లు అతికించుకుని ప్రయాణిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఒక్కొక్కరి దగ్గర 2 లీటర్ల చొప్పున ఆరుగురి వద్ద మొత్తం 12 లీటర్ల హ్యాష్ ఆయిల్ పట్టుబడింది. దీని విలువ రూ.1.5 కోట్ల నుండి రూ.2 కోట్ల వరకు ఉంటుందని అంచనా. నిందితుల్లో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు... ఈ ముఠా నుండి హ్యాష్ ఆయిల్ తో పాటు కొంత డబ్బు, సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ నగరంలో భారీ హ్యాష్ ఆయిల్ తో స్మగ్లింగ్ ముఠా పట్టుబడటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే చాలామందికి గంజాయి గురించి తెలుసు కానీ ఈ హ్యాష్ ఆయిల్ గురించి తెలియదు... దీని గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఏమిటీ హ్యాష్ ఆయిల్?
హ్యాష్ ఆయిల్ అనేది గంజాయి (క్యానబీస్) మొక్క నుండి తయారుచేసే ఒక శక్తివంతమైన ద్రవ రూప మాదకద్రవ్యం. దీనిని గంజాయి ఆకులు, పువ్వులు, కాండం నుండి ప్రత్యేక రసాయన ప్రక్రియ ద్వారా సంగ్రహిస్తారు. ఆకులు, పొడి రూపంలో ఉండే గంజాయి కన్నా ఈ హ్యాష్ ఆయిల్ ఎన్నో రెట్లు ఎక్కువ మత్తును కలిగిస్తుంది, దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అధిక సాంద్రత కారణంగా దీనిని చిన్న పరిమాణంలోనే అధిక ధరలకు విక్రయిస్తారు, ప్రపంచవ్యాప్తంగా దీనికి అక్రమ మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంది. హ్యాష్ ఆయిల్ వినియోగం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, వ్యసనం ఏర్పడతాయి.
హ్యాష్ ఆయిల్ ఎలా తయారుచేస్తారు?
హ్యాష్ ఆయిల్ ఉత్పత్తి అనేది గంజాయిని ఇథనాల్, బ్యుటేన్ వంటి రసాయన ద్రావకాలతో కలిపి నూనెను సంగ్రహించే ప్రక్రియ. ఈ ప్రక్రియ చాలా ప్రమాదకరమైనది… మాదక ద్యవ్రాల ముఠాలు చాలా రహస్యంగా ప్రయోగశాలల్లో దీన్ని తయారుచేస్తాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో కేవలం కొన్ని లీటర్ల హ్యాష్ ఆయిల్ ధర కోట్లాది రూపాయలలో ఉంటుంది, దీనివల్ల మాదక ద్రవ్యాల మాఫియా భారీ లాభాలు పొందుతుంది. దేశీయంగా కూడా ఈ నూనె గ్రాములలో కొన్ని వేల రూపాయల నుండి లక్షల రూపాయల వరకు విక్రయించబడుతుంది, వినియోగదారులకు చేరేసరికి ఇది చిన్న డ్రాపర్‌లలో ప్యాక్ చేయబడుతుంది. దీని అధిక ధర కారణంగా యువతను త్వరగా లక్ష్యంగా చేసుకుంటారు, సులభంగా డబ్బు సంపాదించవచ్చని ఆశ చూపుతారు.
జోరుగా హ్యాష్ ఆయిల్ స్మగ్లింగ్
హ్యాష్ ఆయిల్ అక్రమ రవాణా, ఉత్పత్తిని అరికట్టడంలో పోలీసులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. దట్టమైన అడవుల్లో, మారుమూల ప్రాంతాల్లో గంజాయి సాగు చేయడం, అక్కడే రహస్యంగా నూనెను ఉత్పత్తి చేయడం వల్ల నిఘా కష్టం. ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో కోట్ల రూపాయల విలువైన హ్యాష్ ఆయిల్ పట్టుబడిన సందర్భాలు ఉన్నాయి. మాదక ద్రవ్యాల మాఫియా సభ్యులు తరచుగా తమ గుర్తింపును మార్చుకోవడం, అధునాతన కమ్యూనికేషన్ పద్ధతులను ఉపయోగించడం పోలీసులకు పెద్ద సమస్యగా మారింది.
మాదక ద్రవ్యాల మాఫియా ఈ హ్యాష్ ఆయిల్ రవాణా, విక్రయాలలో అత్యంత అధునాతన పద్ధతులను అవలంబిస్తోంది. వారు GPS టెక్నాలజీ, ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌లు, డార్క్ వెబ్‌ను ఉపయోగించి కమ్యూనికేషన్, లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఆయిల్ డెలివరీ కోసం ప్రత్యేకంగా క్యారియర్‌లను నియమించుకుంటారు, వారిని తరచుగా రవాణా మార్గాలను మార్చుతారు. వాహనాలలో, వస్తువులలో, చివరికి శరీరంలో కూడా తెలివిగా దాచి రవాణా చేస్తుంటారు. యువకులను, ఆర్థికంగా వెనుకబడిన వారిని లక్ష్యంగా చేసుకుని మాదక ద్రవ్యాల రవాణాకు ఉపయోగిస్తున్నారు, ఈ నెట్‌వర్క్‌లను ఛేదించడం పోలీసులకు పెద్ద సవాలు.
హ్యాష్ ఆయిల్ స్మగర్లకు విధించే శిక్షలివే..
మాదకద్రవ్యాల నియంత్రణ కోసం భారత ప్రభుత్వం కఠిన చట్టాలను అమలు చేస్తోంది... NDPS చట్టం 1985 దీనిలో ప్రముఖమైనది. ఈ చట్టం కింద హ్యాష్ ఆయిల్ ఉత్పత్తి, రవాణా, వినియోగం, నిల్వ చేయడం తీవ్ర నేరం… దీనికి పదేళ్ల నుండి ఇరవై ఏళ్ల వరకు జైలు శిక్ష, భారీ జరిమానాలు ఉంటాయి. పోలీసులు, ఎక్సైజ్ శాఖలు సంయుక్తంగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడానికి కృషి చేస్తున్నాయి. సరిహద్దుల్లో నిఘాను పెంచడం, అంతర్రాష్ట్ర సహకారాన్ని పెంపొందించడం, ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి చర్యలు కూడా చేపడుతున్నారు. మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.

