- Home
- Entertainment
- Nayanthara : దీనికి 100 కోట్లు అవసరమా? నయనతార కొత్త సినిమా టీజర్ పై దారుణంగా ట్రోలింగ్
Nayanthara : దీనికి 100 కోట్లు అవసరమా? నయనతార కొత్త సినిమా టీజర్ పై దారుణంగా ట్రోలింగ్
Nayanthara : సుందర్ సి దర్శకత్వంలో నయనతార నటించిన 'మూకుత్తి అమ్మన్ 2' టీజర్ రిలీజైంది. అయితే ఇందులోని వీఎఫ్ఎక్స్ చూసిన నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఏమంటున్నారంటే?

మూకుత్తి అమ్మన్ 2 వివాదం
ఆర్జే బాలాజీ దర్శకత్వంలో నయనతార నటించిన 'మూకుత్తి అమ్మన్' 2020లో ఓటీటీలో విడుదలై సూపర్ హిట్ అయింది. దీనికి సీక్వెల్‌ను కూడా బాలాజీనే డైరెక్ట్ చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ, అనూహ్యంగా సుందర్ సి చేతికి ఈ ప్రాజెక్ట్ వెళ్లింది. నయనతార, రెజీనా, ఊర్వశి, దునియా విజయ్ లాంటి భారీ తారాగణంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. మొదటి నుంచీ ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.
రూ.100 కోట్ల బడ్జెట్
ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ (VFX), సీజీఐ (CGI) వర్క్‌కు మేకర్స్ పెద్ద పీట వేశారు. దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్రాఫిక్స్ పనుల కోసమే పోస్ట్ ప్రొడక్షన్ చాలా సమయం తీసుకుంది. అయితే, తాజాగా విడుదలైన టీజర్‌లోని కొన్ని వీఎఫ్ఎక్స్ షాట్స్ చూసి సోషల్ మీడియాలో జనాలు పెదవి విరుస్తున్నారు.
టీజర్‌తో మొదలైన రచ్చ
టీజర్ చూసిన నెటిజన్లు మేకర్స్‌ను ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. "ఇంత బడ్జెట్ పెట్టి తీసిన గ్రాఫిక్స్ ఇవేనా?", "మొదటి భాగానికి, దీనికి సంబంధమే లేదు", "ఏదో ఏఐతో క్రియేట్ చేసిన వీడియోలా ఉంది" అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, ఇది కేవలం టీజర్ మాత్రమేనని, థియేటర్లలో ఫైనల్ అవుట్‌పుట్ చూశాకే ఓ అంచనాకు రావాలని మరికొందరు అభిమానులు సపోర్ట్ చేస్తున్నారు.
రిలీజ్ ఎప్పుడంటే..?
మొదటి భాగం సాధించిన విజయంతో 'మూకుత్తి అమ్మన్ 2'పై సహజంగానే అంచనాలు పెరిగాయి. పార్ట్ 1లో సింపుల్ స్టోరీ, కామెడీ, నయనతార యాక్టింగ్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యాయి. కానీ, సీక్వెల్‌లో మాత్రం భారీ గ్రాఫిక్స్‌ను నమ్ముకున్నారు. మరి ఈ ప్రయోగం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి. ఈ సినిమా దీపావళి కానుకగా థియేటర్లలోకి రానుంది.

